చైనాలో 131కి పెరిగిన మృతుల సంఖ్య | 24 Members Died Due To Corona Virus | Sakshi
Sakshi News home page

చైనాలో 131కి పెరిగిన మృతుల సంఖ్య

Jan 29 2020 1:30 AM | Updated on Jan 29 2020 8:27 AM

24 Members Died Due To Corona Virus - Sakshi

మనీలాలో మాస్క్‌లతో విద్యార్థులు

బీజింగ్‌/న్యూఢిల్లీ: చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్‌ ఉధృతంగా విస్తరిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా మరో 24 మంది మృతిచెందినట్లు చైనా ప్రకటించింది. దీంతో మొత్తం చైనాలో కరోనా మృతుల సంఖ్య 131కి చేరింది. 4,515 న్యుమోనియా కేసులు నమోదయ్యాయి. థాయ్‌లాండ్‌లో 7, జపాన్‌లో 3, దక్షిణ కొరియాలో 3, అమెరికాలో 3, వియత్నాంలో 2, సింగపూర్‌లో4, మలేషియాలో 3, ఫ్రాన్స్‌లో 3, ఆస్ట్రేలియాలో 4, శ్రీలంక, నేపాల్‌లో చెరో కేసు నమోదైనట్టు అధికారులు చెప్పారు. కరోనా వైరస్‌ వ్యాప్తిచెందకుండా ఉండేందుకు అవసరమైన అన్ని రకాల సహాయసహకారాలను అందిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ గెబ్రేయేసస్‌ వెల్లడించారు.

భారత్‌లో 20 విమానాశ్రయాల్లో స్క్రీనింగ్‌
కరోనా వైరస్‌ నేపథ్యంలో భారత్‌కు వచ్చే ప్రయాణికులను తనిఖీ చేసేందుకు ఇప్పటికే 7 విమానాశ్రయాల్లో ఏర్పాటు చేసిన థర్మల్‌ స్క్రీనింగ్‌ సదుపాయాన్ని 20 విమానాశ్రయాలకు విస్తరించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ప్రకటించారు. భారత్‌లో ఒక్కవ్యక్తికి కూడా కరోనా వైరస్‌ సోకలేదని స్పష్టం చేశారు. మనవారిని వెనక్కి రప్పిస్తున్నాం.. చైనాలో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ తెలిపారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని వూహాన్‌కి పంపనున్నట్టు చెప్పారు. అయితే అందుకు మరికొద్ది రోజులు పట్టొచ్చనీ, వారిని వెనక్కి తీసుకొచ్చి తీరుతామనీ, స్పష్టంచేశారు. ఇప్పటివరకు ఒక్క భారతీయ విద్యార్థికి కూడా వైరస్‌ సోకలేదని చెప్పారు.

భారత్‌కి తీసుకెళ్ళండి
చైనాలో చిక్కుకుపోయిన గుజరాత్‌కి చెందిన దాదాపు 100 మంది విద్యార్థులు తాము భారత్‌ తిరిగివచ్చేందుకు యత్నిస్తున్నారు. అందులో కొందరు బీజింగ్‌ నుంచి బయలుదేరి బుధవారానికి దేశానికి చేరుకుంటారని గుజరాత్‌ సీఎం రూపానీ చెప్పారు. సురక్షితంగా దేశానికి చేర్చేందుకు కావాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నట్టు విదేశాంగ శాఖ వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement