బాల నేరస్తులను సంస్కరించాల్సిన నిలయంలోనే వారికి రక్షణ కరువైంది.
	ముంబై:   బాల నేరస్తులను సంస్కరించాల్సిన నిలయంలోనే వారికి రక్షణ కరువైంది.  దొంగతనం కేసులో అనుమానితుడుగా ఉన్న17 ఏళ్ల బాలుడిని తీవ్రంగా కొట్టడంతో పాటు అత్యాచారం చేయడంతో... శరీరంపై తీవ్రగాయాలతో అతడు  మరణించిన ఉదంతం కలకలం రేపింది.  ముంబై మతుంగ జువైనల్ హోమ్లో అమీర్ జమీల్ ఖాన్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు విడిచాడు.
	
	డేవిడ్ సాసూన్ హోమ్ వార్డెన్ సహా, తోటి సహచరులు ఇద్దరు  తనను తీవ్రంగా కొట్టారని  అమీర్ జమీల్ వాంగ్మూలం ఇచ్చాడని, తనపై అత్యాచారం కూడా జరిగిందని చెప్పాడని శివరాజ్ పార్క్ పోలీసులు  తెలిపారు. విచారణ కొనసాగుతోందని, ముగ్గురు నిందితులపై హత్యకేసు నమోదు చేసినట్లు చెప్పారు. అయితే అమీర్ జమీల్ ఖాన్ పారిపోయేందుకు ప్రయత్నించినపుడు తోటి  ఖైదీలు పట్టుకొని హింసించినట్టుగా తమ ప్రాథమిక  విచారణలో తేలిందని మరింత లోతుగా పరిశీలన  చేస్తున్నామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేష్ పాటిల్  వెల్లడించారు.
	
	కొడుకు మరణంతో  అమీర్ జమీల్ ఖాన్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.  వెదురు కర్రలతో తీవ్రంగా కొట్టి,  దారుణంగా తమ బిడ్డను  పొట్టన బెట్టుకున్నారని  వారు ఆవేదన  వ్యక్తం చేశారు.  తనను కొడుతున్నారని, మత్తు మందులు సేవించాలని బలవంతం  చేస్తున్నారని అమీర్ ను   తాము కలిసినప్పుడు  ఏడుస్తూ చెప్పాడన్నారు. ఈ సంఘటనపై న్యాయ విచారణ జరిపించి తమకు న్యాయం చేయమని రాష్ట్రప్రభుత్వాన్ని  విజ్ఞప్తి చేశారు.  కాగా ఏప్రిల్ 17న ఒక  మహిళ పర్సును దొంగిలించాడనే ఆరోపణలతో ఈ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.  అనంతరం జువైనల్ హోమ్కు  తరలించినట్టు సమాచారం.
	
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
