15 మంది కస్టమ్స్‌ ఆఫీసర్లపై వేటు

15 more tax officials facing corruption charges forced to retire - Sakshi

ఆదాయానికి మించిన ఆస్తులే కారణం

వైజాగ్‌ జీఎస్టీ జోన్‌ అధికారి కూడా

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరోమారు అధికారులపై కొరడా ఝళిపించింది. అవినీతి, అధికార దుర్వినియోగం వంటి కారణాలతో ఇటీవల ఆదాయపన్ను అధికారులపై వేటు వేసిన ప్రభుత్వం ఇప్పుడు కస్టమ్స్, ఎక్సైజ్‌ అధికారులపై వేటువేసింది. అవినీతి, ముడుపులు అందుకున్నారన్న ఆధారాలతో ప్రభుత్వం మంగళవారం 15 మంది సీనియర్‌ కస్టమ్స్, సెంట్రల్‌ ఎక్సైజ్‌ ఆఫీసర్లను విధుల నుంచి తొలగించింది. అందులో ఒకరు ప్రిన్సిపల్‌ కమిషనర్‌ హోదా ఉన్న అధికారి కావడం గమనార్హం.

వీరిలో కొందరు ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉన్నారు. ముడుపులు అందుకోవడం, ప్రభుత్వ సొమ్మును కాజేయడం, ఆదాయానికి మించిన ఆస్తులు ఉండడం వంటి అభియోగాలతో సీబీఐ ఇప్పటికే వారిపై కేసులు నమోదు చేసిందని ఆర్థిక శాఖాధికారులు పేర్కొన్నారు. వీరిలో ప్రిన్సిపల్‌ ఏడీజీగా పనిచేస్తున్న అనూప్‌ శ్రీవాస్తవపై 1996లో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి ఓ సొసైటీకి భూమిని కొనుగోలు చేయడానికి సహకరించారని సీబీఐ కేసు నమోదు చేసింది. జాయింట్‌ కమిషనర్‌ నళిన్‌ కుమార్‌ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చిక్కుకున్నారు. ఫండమెంటల్‌ రూల్స్, క్లాస్‌ జే లోని 56వ నిబంధనను ఉపయోగించి రాష్ట్రపతి వీరిని తొలగించారు. రానున్న మూడు నెలలపాటు యధావిధిగా వేతనాలు అందుతాయని తెలిపారు.

మూడు నెలల ముందు నోటీసులు ఇచ్చి ప్రభుత్వ అధికారులను తొలగించే హక్కు రాష్ట్రపతికి ఉంటుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చెన్నై కమిషనర్‌ జీ శ్రీ హర్షలను సీబీఐ వలపన్ని పట్టుకుంది. వీరితో పాటు కమిషనర్‌ ర్యాంక్‌ ఆఫీసర్లు అతుల్‌ దీక్షిత్, వినయ్‌ బ్రిజ్‌ సింగ్‌లు ఉన్నారు. ఢిల్లీ జీఎస్టీ పరిధిలోని డిప్యూటీ కమిషనర్‌ అమ్రేశ్‌ జైన్, భువనేశ్వర్‌ జీఎస్టీ జోన్‌కు చెందిన ఎస్‌ఎస్‌ బిష్త్, ముంబై జీఎస్టీ జోన్‌కు చెందిన వినోద్‌ సంగా, వైజాగ్‌ జీఎస్టీ జోన్‌కు చెందిన రాజు శేఖర్, అలహాబాద్‌ జీఎస్టీ జోన్‌కు చెందిన మొహమ్మద్‌ అల్తాఫ్‌లు ఉన్నారు. వీరితో పాటు డైరెక్టరేట్‌ ఆఫ్‌ లాజిస్టిక్స్‌ డిప్యూటీ కమిషనర్‌ అశోక్‌ అశ్వాల్‌ కూడా ముందస్తు పదవీవిరమణ చేయాలని ప్రభుత్వం ఆర్డర్‌ జారీ చేసింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top