కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యాను : కేవీ సతీశ్ | 'Yamaleela 2' Success Meet | Sakshi
Sakshi News home page

కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యాను : కేవీ సతీశ్

Dec 1 2014 11:00 PM | Updated on Aug 29 2018 9:35 PM

కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యాను : కేవీ సతీశ్ - Sakshi

కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యాను : కేవీ సతీశ్

సినిమాల్లో నటించాలనే నా చిన్నప్పటి కల ‘యమలీల-2’తో నెరవేరింది. కుటుంబ ప్రేక్షకులకు దగ్గర కావాలనే ఆశయంతో చేసిన చిత్రమిది. పెద్దవాళ్లు మాత్రమే కాదు

 ‘‘సినిమాల్లో నటించాలనే నా చిన్నప్పటి కల ‘యమలీల-2’తో నెరవేరింది. కుటుంబ ప్రేక్షకులకు దగ్గర కావాలనే ఆశయంతో చేసిన చిత్రమిది. పెద్దవాళ్లు మాత్రమే కాదు.. ఐదేళ్ల పిల్లలు కూడా నన్ను గుర్తుపడుతున్నందుకు ఆనందంగా ఉంది. నేను ఫ్యామిలీ హీరో అనిపించుకోవడానికి కారణం ఈ చిత్రబృందం. నా తదుపరి చిత్రాలు కూడా కుటుంబ సమేతంగా చూడదగ్గవిగానే ఉంటాయి’’ అని డా. కేవీ సతీశ్ అన్నారు. ఆయన హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘యమలీల 2’ గత వారం విడుదలైన విషయం తెలిసిందే.
 
 కె.అచ్చిరెడ్డి ఆశీస్సులతో డీయస్ మ్యాక్స్ సమర్పణలో క్రిష్వీ ఫిలింస్ పతాకంపై ఆశా సతీశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం విజయోత్సవ సభలో ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ -‘‘మోహన్‌బాబు, బ్రహ్మానందంలాంటి సీనియర్స్ కాంబినేషన్‌లో ఓ కొత్త నటుడు నటించడం చిన్న విషయం కాదు. సెంటిమెంట్, యాక్షన్ సన్నివేశాల్లో సతీశ్ బాగా నటించారు. మాస్ హీరోలకు ఏమాత్రం తక్కువ కాకుండా ఫైట్స్ చేశారు. తదుపరి చిత్రం సతీశ్‌ని మరో మెట్టు ఎక్కేలా చేస్తుంది.
 
 అలాంటి సినిమా చేయబోతున్నాం’’ అన్నారు. అచ్చిరెడ్డి మాట్లాడుతూ -‘‘ప్రథమార్ధంలో కూల్‌గా, ద్వితీయార్ధంలో హీరోయిజమ్‌ని ఎలివేట్ చేసే పాత్రను సతీశ్ బాగా చేశారు. ఆయన మంచి వ్యక్తి కూడా. హుద్ హుద్ తుఫాను బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి సతీశ్ పది లక్షల రూపాయలు విరాళమందించారు’’ అన్నారు. వసూళ్లు బాగున్నాయనీ, 500 థియేటర్లలో 50 రోజులాడటం ఖాయమని సహ నిర్మాత డీకే అరుణ్ కుమార్, విజయ్‌భాస్కర్ చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement