‘ఇక్కడ రచయితలకు గౌరవం లేదు’

Writer and Actor Vela Ramamoorthy Special Interview - Sakshi

ఎప్పటికైనా దర్శకత్వం వహిస్తా అంటున్నారు ప్రముఖ రచయిత, నటుడు వేల రామమూర్తి. నటనకు అర్హత అంటూ ఏం ఉండదు. ఇంకా చెప్పాలంటే ఎలాంటి శిక్షణ లేకుండా నటుడిగా రాణించడం అన్నది ఒక్క సినిమా రంగంలోనే సాధ్యం అనుకుంటా. వేల రామమూర్తిని చూస్తే అలానే అనిపిస్తుంది. అసలు ఈయన జీవితమే అనూహ్య మలుపులతో సాగి ప్రస్తుతం నటుడి వరకూ వచ్చి ఆగింది. ముందు ముందు మరిన్ని మలుపులు తిరగబోందట. ఆ సంగతులేంటో ఆయన్నే అడిగి తెలుసుకుందాం.

ప్రముఖ రచయిత అయిన మీ నేపథ్యం గురించి చెప్పండి?
మాది రామనాథపురం జిల్లా, పెరునాడు గ్రామం. చదివింది పీయూసీ. ఆ తరువాత ఒకసారి చెన్నైకి వస్తే, స్థానిక తేనాంపేటలో మిలటరీ ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్‌ జరుగుతుండడంతో ప్రయత్నిద్దామని అందులో పాల్గొన్నా ను. అలా యాదృచ్ఛికంగానే ఎంపికయ్యాను. మధ్యప్రదేశ్‌లోని జంబలపుడిలో సైనికుడిగా పోస్ట్‌ వేశారు. అక్కడ ఐదేళ్లు పని చేశాను. ఆ తరువాత పోస్టల్‌ శాఖలో కొంత కాలం పని చేశాను. అయితే నాకు చిన్నతనం నుంచి రచనలంటే ఆసక్తి. దీంతో రచయితగా పలు కథలు రాశాను. అందులో ఒకటి కుట్రపరంపరై.

నటుడిగా పరిచయం గురించి?
రచయితగా పేరు వచ్చిన తరువాత అనుకోకుండా మదయానై కూట్టం చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. సరే చేసి చూద్దాం అని నటనలోకి దిగాను. ఆ చిత్రంలో నా నటనకు మంచి పేరు వచ్చింది. ఆ తరువాత విలన్, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ అంటూ వరుసగా అవకాశాలు ఇస్తున్నారు. ఒక సైనికుడినైనా నేను నటుడిగా రాణించడం నిజంగా ఆశ్చర్యమే.

మీరు రాసిన కుట్రపరంపరై కథను సినిమాగా చేయాలని ప్రఖ్యాత దర్శకులు భారతీరాజా, బాలాలు పోటీ పడ్డారు. ఆ విషయం ఏమైంది?
ఆ సమస్య సమసిపోయింది. త్వరలోనే కుట్రపరంపరై కథతో భారీ చిత్రం తెరకెక్కబోతోంది. ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం.

కథా రచయితకు గౌరవం లేదని ఇటీవల నటుడు రజనీకాంత్‌ పేర్కొన్నారు. మీ స్పందనేంటి?
కథా రచయితలకు ఇక్కడ గౌరవం లేదన్నది నిజం. తెలుగు, మలయాళం వంటి భాషల్లో మంచి మంచి కథా చిత్రాలు వస్తున్నాయి. తెలుగులో బాహుబలి వంటి చిత్రాలు ఇక్కడ ఎందుకు రావడం లేదు? ఆ చిత్ర కథా రచయిత విజయేంద్రప్రసాద్‌ లాంటి వారికి పేరు, ప్రఖ్యాతులు చూడండి. తెలుగు, మలయాళం చిత్రాలు సాధిస్తున్న జాతీయ అవార్డులను మన తమిళ చిత్రాలు ఎందుకు పొందలేకపోతున్నాయి? కథా రచయితలకు తగిన గుర్తింపు లేకపోవడమే.

నటుడిగానే కొనసాగుతారా? లేక మరో ఆలోచన ఉందా?
నాకు తగ్గ పాత్రలు వస్తున్నాయి. అందుకే నటుడిగా కొనసాగుతున్నాను. దర్శక నిర్మాతలు వైవిధ్యభరిత పాత్రలను ఇస్తున్నారు. అయితే కచ్చితంగా దర్శకుడినవుతాను. నేను రాసుకున్న కథతోనే చిత్రం చేస్తాను. అదీ రామనాథపురం నేపథ్యంలో సాగే కథతోనే చిత్రాన్ని తెరకెక్కిస్తా.

తాజాగా మీరు నటించిన మయూరన్‌ చిత్రంలో పాత్ర గురించి?
మయూరన్‌ చిత్రంలో కళాశాల ప్రిన్సిపల్‌గా నటించాను. తొలిసారిగా చిత్ర కథానాయకుడి లాంటి పాత్రను ఇందులో చేశాను. ఇంతకు ముందు నటించిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. దర్శకుడు బాలా శిష్యుడు నందన్‌ సుబ్బరాయన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం 30వ తేదీన తెరపైకి రానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top