‘నడిగర్‌’ ఎన్నికల రద్దుపై రిట్‌ పిటిషన్‌

Writ Petition On Nadigar Sangam Elections - Sakshi

పెరంబూరు: దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్‌) ఎన్నికలను నిర్వహించడానికి ప్రస్తుత సంఘ కార్యదర్శి విశాల్‌ ఇంకా పోరాడుతూనే ఉన్నారు. కోర్టుల చుట్టూ తిరుగుతూ, చివరికి గవర్నర్‌ను కూడా కలిసి ఎన్నికలు జరగడానికి చర్యలు తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు.   2019–2022 సంవత్సరానికిగానూ నడిగర్‌ సంఘం ఎన్నికలను ఈ నెల 23వ తేదీన నిర్వహించడానికి ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రస్తుత సంఘ నిర్వాహక వర్గం పాండవర్‌ జట్టు పేరుతోనూ, వీరికి పోటీగా దర్శక నటుడు కే.భాగ్యరాజ్‌ నేతృత్వంలో స్వామి శంకరదాస్‌ జట్టు పోటీలో ఉన్నాయి. ఎన్నికలకు స్థానిక అడయార్‌లోని ఎంజీఆర్‌ జానకీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలను వేదికగా నిర్ణయించారు.

ఇలాంటి పరిస్ధితుల్లో ఆ ప్రాంతంలో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎన్నికలకు భద్రత కల్పించలేమని పోలీసులు చెప్పడంతో సమస్య మొదలైంది. ఎన్నికలకు భద్రత కల్పించాల్సిందిగా కోరుతూ విశాల్‌ వర్గం చెన్నై హైకోర్టును ఆశ్రయించింది. అయితే కోర్టు కూడా అందుకు నిరాకరిస్తూ ఎన్నికలకు వేరే వేదికను ఎంచుకోవాలని సూచించింది. ఇలాంటి పరిస్థితుల్లో సంఘాల జిల్లా అధికారి ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది. సంఘం నుంచి తొలగించబడ్డ 61 మంది ఫిర్యాదుల కారణంగానే ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు ఆయన వివరణ ఇచ్చారు. సభ్యుల తొలగింపునకు కారణాలు సరైనవేనా? కాదా? అన్నది పరిశీంచిన తరువాతనే ఎన్నికల నిర్వహణకు అనుమతి నివ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై కోర్టులో వేసిన పిటిషన్‌ను గురువారం విచారించిన న్యాయస్థానం 61 మంది సభ్యుల తొలగింపు సరైనదేనని తీర్పునిచ్చింది. ఈ తీర్పు విశాల్‌ జట్టుకు ఊరటనిచ్చిందనే చెప్పాలి. కాగా ఎన్నికలకు అనుమతినివ్వాల్సిందిగా విశాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం కోర్టులో విచారణ జరగనుంది. కోర్టు తీర్పుపైనే 23వ తేదీన నడిగర్‌ సంఘం ఎన్నికలు జరుగుతాయా? రద్దవుతాయాయనేది ఆధారపడి ఉంది.

నాకు సంబంధం లేదు
బుధవారం సంఘ ఎన్నికలను నిజాయితీగా, ప్రశాంతంగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవలసిందిగా పాండవర్‌ జట్టు తరఫున విశాల్‌ తదితరులు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌ను కలిసి వినతి పత్రాన్ని అందించిన విషయం తెలిసిందే. కాగా గురువారం స్వామి శంకరదాస్‌ జట్టు తరఫున దర్శక నటుడు కే.భాగ్యరాజ్, ఐసరిగణేశ్‌ తదితరులు గవర్నర్‌ బంగ్లాకు వెళ్లి బన్వరిలాల్‌ పురోహిత్‌ను కలిశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ సంఘ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి చర్చలు తీసుకోవసిందిగా గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు. అయితే నడిగర్‌ సంఘం ఎన్నికలకు తనకు సంబంధం లేదని గవర్నర్‌ చెప్పారని పేర్కొన్నారు. అదే విధంగా విశాల్‌ వర్గం అబద్దాలు చెబుతున్నారని, సంఘంలో సమస్యలకు కారణం విశాల్, కార్తీ లాంటి వారేనని స్వామి శంకర్‌దాస్‌ జట్టు ఆరోపించింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top