నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!

Vikram Special Interview on Mister KK Movie - Sakshi

‘‘ప్రతి నటుడు హిట్‌ సాధించాలనే సినిమా చేస్తాడు. నా కెరీర్‌నే ఓసారి పరిశీలించుకుంటే.. ‘సేతు’ విజయం అందుకోవడానికి ముందు దాదాపు పన్నెండేళ్లు ఫెయిల్యూర్స్‌ చూశాను. ఆ సమయంలో నేను చేసిన ప్రతి సినిమా బ్రేక్‌ సాధిస్తుందనే చేశాను. కానీ రాలేదు. అయితే నటుడిగా ప్రతిసారి ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యే సబ్జెక్టే ఎంచుకున్నాను. అందుకే ఇండియన్‌ సినిమాలో నాకంటూ ఓ గుర్తుంపు ఉందని భావిస్తున్నాను’’ అన్నారు విక్రమ్‌. రాజేష్‌ ఎం. సెల్వ దర్శకత్వంలో విక్రమ్, అక్షరా హాసన్, అభిహసన్‌ (నటుడు నాజర్‌ తనయుడు) ముఖ్య తారాగణంగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘కడరమ్‌ కొండాన్‌’. ఈ చిత్రానికి నటుడు కమల్‌హాసన్‌ ఒక నిర్మాత. టి. అంజయ్య సమర్పణలో పారిజాత మూవీ క్రియేషన్స్‌ పతాకంపై టి. నరేష్‌కుమార్, టి. శ్రీధర్‌ ఈ సినిమాను ‘మిస్టర్‌ కేకే’ టైటిల్‌తో ఈ నెల 19న తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా విక్రమ్, అక్షరా హాసన్‌ చెప్పిన విశేషాలు.

ఇంటర్నేషనల్‌ స్టైల్లో తెరకెక్కిన చిత్రం ‘కేకే’. ఈ చిత్రంలో నేను చేసిన పాత్ర నా సినిమా జీవితంలోనే వన్నాఫ్‌ ది బెస్ట్‌ క్యారెక్టర్స్‌గా నిలుస్తుందని నమ్ముతున్నాను. అయితే నా పాత్రలో గ్రే షేడ్స్‌ ఉంటాయి. సినిమాలో నా క్యారెక్టర్‌ పాజిటివ్‌నా? నెగటివా? అనే విషయం ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఉంటుంది.

కొన్ని సినిమాలకు క్యారెక్టర్‌ పేరే సినిమా టైటిల్‌గా ఉంటుంది. అంటే సినిమాలో ఆ పాత్ర ఎంత బలమైనదో ఊహించుకోవచ్చు. ఈ సినిమా అలాంటిదే. అందుకే అలా టైటిల్‌ పెట్టాం. ఒక రోజులో జరిగే కథ కాబట్టి స్క్రీన్‌పై కథ స్పీడ్‌గా నడుస్తుంటుంది. ఈ సినిమాలో యాక్షన్‌ రియల్‌గా ఉంటుంది. ఫ్రాన్స్‌ నుంచి వచ్చిన  గిల్‌ ఫైట్స్‌ను బాగా డిజైన్‌ చేశారు. దర్శకుడు రాజేష్‌కు మంచి టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉంది. సెట్‌లో తనకు ఏం కావాలన్న విషయంపై ఫుల్‌ క్లారిటీతో ఉంటాడు.

ఇది ఇంటర్‌నేషనల్‌ స్టైలిష్‌ మూవీ అయినప్పటికీ మన ఆడియన్స్‌కు కనెక్ట్‌ అవుతుందనే అనుకుంటున్నాను. నేను చేసిన ‘శివపుత్రుడు’ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయ్యింది. అయినా కేవలం నేటివిటి కారణంగానే మూవీ ఆడియన్స్‌కు కనెక్ట్‌ కావాల్సిన అవసరం లేదు. ఎందుకుంటే.. ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్, టైటానిక్‌’ వంటి సినిమాలకు మన ప్రేక్షకుల ఆదరణ దక్కడం ఆ సినిమాల్లోని ఎమోషనల్‌ కంటెంటే. అలాగే ‘బాహుబలి’ కూడా. మంచి కథ, సరైన ఎమోషన్స్‌ ఉంటే ఆడియన్స్‌ సినిమాలను ఆదరిస్తారు. అలాగే ఒక నటుడిగా బాక్సాఫీస్‌ నంబర్స్‌ కూడా ముఖ్యంగా భావిస్తాను.

ఇప్పుడు ‘బాహుబలి’ లాంటి ప్యాన్‌ ఇండియా సినిమాలు వస్తున్నాయి. అందుకే ఏ ఒక్క భాషకే నేను పరిమితం కావాలనుకోవడం లేదు. తెలుగు, తమిళం, మలయాళం ఇలా అన్ని భాషల్లో నాకు గుర్తింపు తెచ్చిన సినిమాలు ఉన్నాయని చెప్పుకోవడానికి సంతోషిస్తున్నాను. నంబర్‌ 1 యాక్టర్‌ కావాలనే ఆశ లేదు. మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలి.  

నిజానికి ఈ సినిమాలో కమల్‌హాసన్‌గారు నటించాల్సింది. ఆ సమయంలో ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల కమల్‌సార్‌ బ్యానర్‌లో నేను ఈ సినిమా చేశాను. వాస్తవానికి కమల్‌గారు ఎవరి గురించీ ఎక్కువగా మాట్లాడరు. కానీ ఈ సినిమా తమిళ ఆడియో వేడుకలో నా గురించి ఆయన చెప్పిన మాటలు నన్ను భావోద్వేగానికి గురి చేశాయి.

నా కొడుకు ధృవ్‌ నటించిన ‘ఆదిత్యవర్మ’ (తెలుగు ‘అర్జున్‌రెడ్డి’ తమిళ రీమేక్‌) షూటింగ్‌ పూర్తయింది. ఈ సినిమా చాన్స్‌ వచ్చినప్పుడు ధృవ్‌ అమెరికాలో మెథడ్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటున్నాడు. చాలా నేచురల్‌గా నటించాడనిపించింది. కొన్ని సీన్స్‌లో అయితే నా కంటే బాగా చేశాడనిపించింది. రొమాంటిక్‌ సీన్స్‌ చేసే సమయంలో, డబ్బింగ్‌ చెప్పే సమయంలో ‘నాన్నా.. నువ్వు బయటికి వెళ్లు’ అన్నాడు. నేను ఇక్కడ లేను.. ఓ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఉన్నాడనుకుని వర్క్‌ చేయమన్నాను.

మణిరత్నంగారి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘పొన్నియన్‌ సెల్వన్‌’ సినిమాలో ఓ కీలక పాత్ర చేయబోతున్నాను. అలాగే అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో హీరోగా నటించబోతున్నాను. గౌతమ్‌ మీనన్‌గారి దర్శకత్వంలో నేను చేస్తున్న ‘ధృవనక్షత్రం’ ఫైనల్‌ షెడ్యూల్‌ జరగాల్సి ఉంది. ‘మహావీర్‌ కర్ణ’ చిత్రీకరణ ఈ ఏడాదిలోనే ప్రారంభం అవుతుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top