 
													హీరో విక్రమ్ కెరీర్‌లోని 63వ సినిమా చిత్రీకరణ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాతో బోడి కె. రాజ్‌కుమార్ అనే నూతన దర్శకుడు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. గతంలో ‘ఆమెన్, లో అండ్ బిహోల్డ్’ వంటి షార్ట్ ఫిల్మ్స్‌తో వీక్షకులను మెప్పించారు రాజ్‌కుమార్. అయితే విక్రమ్ కెరీర్‌లోని 63వ చిత్రానికి మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించనున్నట్లుగా గత ఏడాది డిసెంబరులో యూనిట్ ప్రకటించింది. కానీ ఇప్పుడు మడోన్ ప్లేస్‌లోకి రాజ్‌కుమార్ వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఇంకా ‘96, సత్యం సుందరం’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన సి. ప్రేమ్‌కుమార్‌తోనూ విక్రమ్ ఓ సినిమా కమిటయ్యారు. అయితే విక్రమ్‌తో తాను డైరెక్ట్ చేయనున్న సినిమా చిత్రీకరణ కాస్త ఆలస్యం కానుందని, ఫాహద్ ఫాజిల్‌తో సినిమాను పూర్తి చేసిన తర్వాత విక్రమ్‌తో సినిమా చేస్తానని ఇటీవల ఓ సందర్భంలో దర్శకుడు సి. ప్రేమ్‌కుమార్ తెలిపారు. ఈ గ్యాప్‌లో నూతన దర్శకుడు రాజ్‌కుమార్ సినిమాతో బిజీ అవుతారు విక్రమ్.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
