వారెవ్వా 'మెర్సల్‌'.. కళ్లు చెదిరే వసూళ్లు!

Vijay Mersal earned Rs 170 crore

విజయ్‌ తాజా సినిమా 'మెర్సల్‌'.. బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోంది. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా.. బీజేపీ వాళ్లు ఎంత గగ్గోలు రేపినా.. ఈ సినిమాపై ఏమాత్రం ప్రభావం చూపలేదు సరికదా.. ఈ వివాదాలు 'మెర్సల్‌' వరంగా మారాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారీ అంచనాలతో విడుదలైన 'మెర్సల్‌' సినిమా తొలిరోజు ఏకంగా రూ. 43.50 కోట్లు వసూలు చేసి.. ట్రేడ్‌ వర్గాలను విస్మయపరిచింది. దీపావళి కానుకగా విడుదలైన 'మెర్సల్‌' తొలివారంలో ప్రపంచవ్యాప్తంగా అక్షరాల రూ. 170 కోట్లు వసూలు చేసిందని సమాచారం.

వైద్య మాఫియాపై అస్త్రంగా తెరకెక్కిన 'మెర్సల్‌' సినిమాలో జీఎస్టీ, డిజిటల్‌ ఇండియా పథకాలపై విమర్శలు ఉండటం బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. ఆ డైలాగులు తొలగించాల్సిందేనంటూ డిమాండ్‌ చేశారు. ఈ వివాదం మీడియాలో పతాకశీర్షికలకు ఎక్కడం, పలువురు సినీ ప్రముఖులు, జాతీయ నాయకులు సినిమాకు అండగా నిలబడటం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమాలో ఏముందో చూసేందుకు జనం పోటెత్తుతున్నారు. దీంతో ఒక్క తమిళ వెర్షన్‌లోనే విడుదలైన 'మెర్సల్‌' ప్రపంచవ్యాప్తంగా మొదటివారంలో అసాధారణ వసూళ్లు రాబట్టింది. తొలిరోజు రూ. 43. 50 కోట్లు వసూలు చేసిన 'మెర్సల్‌'.. తొలిమూడురోజుల్లో రూ. 100 కోట్లు రాబట్టింది. మొత్తానికి తొలివారంలో ఈ సినిమా రూ. 170 కోట్లు రాబట్టిందని 'టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా' వెల్లడించింది. 'మెర్సల్‌' ఓవర్సీస్‌ వసూళ్లు కూడా కళ్లుచెదిరే రీతిలో ఉండటం గమనార్హం. తొలివారంలో ఈ సినిమా విదేశాల్లో రూ. 45 కోట్లు రాబట్టింది. కొన్నిరోజుల కిందట ఈ సినిమా రూ. 150 కోట్లు కలెక్ట్ చేసినట్టు సినిమా యూనిట్‌ ధ్రువీకరించింది. మొత్తం తొలివారం వసూళ్ల గురించి చిత్ర నిర్మాత కన్ఫర్మ్‌ చేయాల్సి ఉంది. ఏదిఏమైనా  'మెర్సల్‌'  విజయ్‌ కెరీర్‌లో రూ. 200 కోట్లు సాధించిన తొలి సినిమా రికార్డు దిశగా సాగుతోందని ట్రేడ్‌ వర్గాలు అభిప్రాయడుతున్నాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top