
శ్రియ
వెంకటేశ్, శ్రియకి ముచ్చటగా మూడోసారి జోడీ కుదిరింది. ‘సుభాష్ చంద్రబోస్, గోపాల గోపాల’ వంటి చిత్రాల్లో అలరించిన ఈ జంట మరోసారి ఓ చిత్రంలో కలిసి నటించనున్నారని టాక్. అఫ్‌కోర్స్ వెంకీతో ‘తులసి’లో శ్రియ ‘నే చుక్ చుక్ బండి’ అనే ఐటమ్ సాంగ్ చేసిన విషయం కూడా గుర్తుండే ఉంటుంది. ఆ సంగతలా ఉంచి, తాజా చిత్రం విషయానికొస్తే.. ‘గురు’ వంటి హిట్ సినిమా తర్వాత వెంకటేశ్ నటిస్తున్న సినిమా ‘ఆట నాదే వేట నాదే’ (పరిశీలనలో ఉన్న టైటిల్).
‘నేనే రాజు నేనే మంత్రి’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత తేజ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో వెంకీకి జోడీగా కాజల్ అగర్వాల్, నిత్యామీనన్ వంటి పేర్లు వినిపించాయి. వారిద్దరూ కాదు.. బాలీవుడ్ బ్యూటీ అదితీ రావ్ హైదరీని ఫిక్స్ చేశారంటూ ఆ మధ్య వార్తలు హల్‌చల్ చేశాయి. కట్‌చేస్తే.. తాజాగా శ్రియ పేరు లైన్‌లోకి వచ్చింది. వెంకటేశ్ ప్రొఫెసర్ పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో ఆయనకు జోడీగా శ్రియ కరెక్ట్ అని చిత్రబృందం ఆలోచన అట. ‘గోపాల గోపాల’ సినిమాలో ఓ బిడ్డకు తల్లిగా కనిపించిన శ్రియ ఈ సినిమాలో ఇద్దరు పిల్లలకు తల్లి పాత్రలో నటించనున్నారట. ప్రస్తుతం తెలుగులో ‘వీర భోగ వసంతరాయలు’లో నటిస్తున్నారు శ్రియ. తమిళంలో చేసిన ‘నరగసూరన్’, ప్రకాశ్‌రాజ్ కాంబినేషన్‌లో నటించిన హిందీ చిత్ర ‘తఢ్కా’ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి.