నాన్న, పెదనాన్న మెచ్చుకున్నారు!

నాన్న, పెదనాన్న మెచ్చుకున్నారు!


 తొలిసారిగా తెర మీదకు వచ్చి కనిపిస్తున్నప్పుడు ఎవరికైనా కొద్దిగా టెన్షన్ సహజమే. ఆ ప్రయత్నం చూసి ఇంట్లోవాళ్ళు ఏమంటారోనన్న భయమూ సహజమే. తొలి చిత్రం ‘ముకుంద’ విషయంలో హీరో వరుణ్‌తేజ్‌కూ అదే అనుభవమైంది. కాకపోతే, ‘‘సినిమా చూశాక నాన్న గారు బాగుందన్నారు. కొన్ని కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. రాబోయే రోజుల్లో నాకు అవి నటుడిగా ఉపయోగపడతాయి’’ అని ఈ యువ హీరో చెప్పారు. మరి, చిరంజీవి ఏమన్నారు? ‘‘పెదనాన్న అయితే నీకిచ్చిన పాత్రకూ, కథకూ తగ్గట్లు బాగా చేశావంటూ ప్రోత్సహించారు’’ అని వరుణ్‌తేజ్ ఇష్టాగోష్ఠిగా చెప్పారు.

 

  ‘ముకుంద’ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో ఆ చిత్ర యూనిట్ మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో విలేకరులతో తమ ఆనందాన్ని పంచుకుంది. ఈ సందర్భంగా వరుణ్‌తేజ్ మాట్లాడుతూ, ‘‘దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గత చిత్రాల లాగే ఇదీ సహజమైన సినిమా. ఇలాంటి చిత్రాలు చేయడం ద్వారా ప్రేక్షకులకు దగ్గరవ్వాలన్నది నా కోరిక’’ అని పేర్కొన్నారు. శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ, ‘‘అందరూ కష్టపడి నిజాయతీగా పనిచేయడం వల్లే ఈ చిత్రం విజయవంతమైంది. మొదట మిశ్రమ స్పందన వచ్చినా, క్రమంగా పాజిటివ్ టాక్ స్థిరపడి, ఇప్పటి దాకా దాదాపు 13 - 14 కోట్ల వసూళ్ళు ఈ చిత్రం సాధించింది’’ అని చెప్పారు.

 

  ‘‘రావు రమేశ్ అమ్మ గారు నాకు ఫోన్ చేసి కన్నీళ్ళు పెట్టుకుంటూ, తెర మీద మళ్ళీ దొరగారిని (రావు గోపాలరావు) చూసినట్లుంది అంటూ రావు రమేశ్ పాత్ర గురించి పేర్కొనడం మర్చిపోలేని అనుభవం’’ అని శ్రీకాంత్ చెప్పారు. నటులు పరుచూరి వెంకటేశ్వరరావు, అలీ, రావు రమేశ్, ఆనంద్, నిర్మాతల్లో ఒకరైన ‘ఠాగూర్’ మధు తదితరులు ఈ విజయోత్సవ సభలో పాల్గొని, తమ అనుభూతులను పంచుకున్నారు. మొత్తానికి, ‘ముకుంద’ అటు హీరోకూ, అటు నటీనటులకూ ఇంట్లో వాళ్ళ నుంచి తగిన ప్రశంసలే తెచ్చిందన్న మాట!

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top