జయలలితే ప్రేరణ

Varaxmi Sarathkumar Want to Comes in Politics - Sakshi

ఇక్కడ రాజకీయ నాయకత్వ శూన్యత ఉంది

చెన్నై, పెరంబూరు: దివంగత ముఖ్యమంత్రి జయలలిత తనకు రాజకీయ ప్రేరేపిత శక్తి. తాను రాజకీయాల్లోకి రావడం ఖయం అంటోంది నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌. స్త్రీశక్తి పేరుతో సేవాసంఘాన్ని నెలకొల్పిన ఈ భామ క్యాస్టింగ్‌ కౌచ్‌ వంటి వివాదాస్పద అంశాలపైనా ధైర్యంగా స్పందించిందన్నది గమనార్హం. కాగా ఈ డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ లేడీ ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంది. కథానాయకి, ప్రతినాయకి అని తారతమ్యం చూపకుండా అ అమ్మడు నచ్చిన కథా పాత్రలను ఎడా పెడా చేసేస్తోంది.

కాగా వరలక్ష్మీపై వదంతులు చాలానే దొర్లుతున్నాయి. అందులో నటుడు విశాల్‌తో ప్రేమ, త్వరలో పెళ్లి చేసుకోనున్నారన్నది ఒకటి. అలాంటిది ఈ సంచలన నటి విశాల్‌ హీరోగా నటించి, నిర్మించిన సండైకోళి–2లో విలనిజాన్ని ప్రదర్శించింది. తాజాగా విజయ్‌ హీరోగా నటించిన సర్కార్‌ చిత్రంలో రాజకీయ నాయకురాలిగానూ ప్రతినాయకి ఛాయలున్న పాత్రలో నటించింది. కీర్తీసురేశ్‌ కథానాయకిగా నటించిన ఈ చిత్రానికి ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకుడు. సర్కార్‌ చిత్రం ఈ నెల 6వ తేదీన తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఒక ఛానల్‌కు భేటీ ఇచ్చిన నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కొన్ని సంచలన విషయాలను వెల్లడించారు. అవేమిటో ఆమె మాటల్లోనే చూద్దాం.

ప్ర: విశాల్‌తో పెళ్లా?
జ: నటుడు విశాల్‌ తనకు అత్యంత సన్నిహితుడు. ఏ విషయాన్నైనా మేమిద్దరం షేర్‌ చేసుకుంటాం. అయితే మేమిద్దరం ప్రేమించుకోవడం లేదు. విశాల్‌కు ఏ అమ్మాయితోనైనా పెళ్లి కుదిరితే నేనే దగ్గరుండి వారి పెళ్లి జరిపిస్తాను. విశాల్‌ పెళ్లి చేసుకుంటే సంతోష పడేవారిలో నేను ముందుంటాను. అలాంటిది ఏ కారణంతో విశాల్‌తో నన్ను కలిపి ప్రచారం చేస్తున్నారో తెలియడం లేదు. ఇకపోతే చాలా మంది రాజకీయ రంగప్రవేశం చేస్తారా? అని అడుగుతున్నారు. వారందరికీ చెప్పేదొకటే కచ్చితంగా నేను రాజకీయాల్లోకి వస్తా. అయితే అందుకు మరో ఐదేళ్లు పడుతుంది. ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ నాయకత్వ శూన్యత నెలకొన్న మాట నిజమే. దాన్ని పూర్తి చేయడానికే నటుడు రజనీకాంత్, కమలహాసన్‌ వంటి వారు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రజలు వారిని ఆదరిస్తారా? అన్నది వేచి చూడాలి. జయలలిత ఉత్తమ పరిపాలనాధక్షురాలు. ఆమెను మూడు సార్లు కలిసే అవకాశం నాకు లభించింది. రాజకీయపరంగా జయలలితనే నాకు ప్రేరణ. గొప్ప పాలకురాలే కాదు, మంచి విద్యావేత్త కూడా. ఒంటరి స్త్రీగా రాష్ట్రాన్ని పరిపాలించారు.

నాన్న పార్టీలో చేరను
మరో ఐదేళ్లలో నా రాజకీయ రంగప్రవేశం ఉంటుంది. నా తండ్రి శరత్‌కుమార్‌ తన పార్టీలో చేరమని ఎప్పుడో ఆహ్వానించారు. నేనే నిరాకరించాను. ఆయన పార్టీ ద్వారా నేను రాజకీయాల్లోకి పరిచయం కాను. ఏ పార్టీలో చేరేది తరువాత వెల్లడిస్తాను. కాగా ఇంతకు ముందు రాష్ట్రంలో రాజకీయ నాయకత్వ శూన్యం ఏర్పడిందనే వ్యాఖ్యలు చేసిన నటుడు రజనీకాంత్‌పై అన్నాడీఎంకే నేతలు మాటల దాడులు చేసిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి వ్యాఖ్యలు చేసిన నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటుందో చూడాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top