స్పందించకపోవడం సరికాదు!

Varalaxmi Sarathkumar Said Why Top Actors Wont Give Voice - Sakshi

స్పందించకపోవడం సరికాదని నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌ సినీ ప్రముఖులకు చురకలు వేసింది. ఏ విషయంలోనైనా తనకు అనిపించింది వ్యక్తం చేయడానికి ఏ మాత్రం భయపడని నటి వరలక్ష్మీ. చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న వరలక్ష్మీ శరత్‌కుమార్‌ సమాజంలోని స్త్రీలకు అండగా ఉండడానికి సేవ్‌శక్తి అనే సేవా సంస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఇక భవిష్యత్తులో తన రాజకీయరంగ ప్రవేశం తథ్యం అని కూడా కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. తన తండ్రి శరత్‌కుమార్‌ పార్టీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టంగా చెప్పేసింది. ఈమె నోరు విప్పిందంటే సంచలనమే. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పలు విషయాల గురించి తన అభిప్రాయాలను పంచుకుంది. ముఖ్యంగా పొల్లాచ్చిలో ఇటీవల జరిగిన అత్యాచార సంఘటన గురించి తీవ్రంగా స్పందించింది.

ఆ సంఘటనను ఇప్పుటికే పలువురు తీవ్రంగా ఖండించారని, అందరూ ముఖ్యంగా ప్రభుత్వం అలాంటి మృగాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇలాగే పలువురు సినీ ప్రముఖులు పొల్లాచ్చి సంఘటనపై తీవ్రంగా స్పందించారు.అయితే ఇంకా ఖండించని సినీ ప్రముఖులు ఉన్నారని, వారు ఎందుకు స్పందించలేదో అర్థం కావడం లేదని వరలక్ష్మీశరత్‌కుమార్‌ అంది. ఇటీవల మీటూ విషయంలోనూ తాను, గాయని చిన్మయి లాంటి వారు పోరాడామని, అయితే చాలా మంది ప్రముఖులు నోరు మెదపలేదని విమర్శంచింది.

నిజానికి ఇలాంటి ఘోర  సంఘటనలపై స్పందించడం ప్రముఖుల బాధ్యత అని పేర్కొంది. వారి స్పందనకు చాలా పవర్‌ ఉంటుందని అంది. దాని ప్రభావం చాలా ఉంటుందని అంది. కాబట్టి పొల్లాచ్చి సంఘటనలాంటి వాటిపై సినీ ప్రముఖులు స్పందించాలని వరలక్ష్మీశరత్‌కుమార్‌ అంటోంది. వరలక్ష్మీశరత్‌కుమార్‌ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసిందో అందరికీ తెలిసిందే. రాజకీయాల్లోకి వస్తామంటున్న కొందరు పొల్లాచ్చి సంఘటనపై ఇంకా గొంతు విప్పలేదన్నది వాస్తవం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top