అఖిల్ రెండో సినిమా రీమేకేనా? | Vamshi Paidipally backs out of project with Akhil Akkineni | Sakshi
Sakshi News home page

అఖిల్ రెండో సినిమా రీమేకేనా?

May 12 2016 11:57 PM | Updated on Sep 3 2017 11:57 PM

అఖిల్ రెండో సినిమా రీమేకేనా?

అఖిల్ రెండో సినిమా రీమేకేనా?

చిన్నప్పుడు ‘సిసింద్రీ’లో ముద్దు ముద్దుగా కనిపించి, ఆకట్టుకున్న అఖిల్ పెద్దయ్యాక ‘మనం’లో కొన్ని క్షణాలు కనిపించి,

చిన్నప్పుడు ‘సిసింద్రీ’లో ముద్దు ముద్దుగా కనిపించి, ఆకట్టుకున్న అఖిల్ పెద్దయ్యాక ‘మనం’లో కొన్ని క్షణాలు కనిపించి, కుర్రాడు కత్తి అనిపించుకున్నాడు. ఇక ‘అఖిల్’ చిత్రం ద్వారా పూర్తి స్థాయిలో హీరోగా జనం ముందుకొచ్చాడు. ఆ సినిమా జయాపజయాల సంగతెలా ఉన్నా తనలో మంచి హీరో మెటీరియల్ ఉన్నాడని నిరూపితమైంది.
 
  ఇప్పుడు అక్కినేని అభిమానుల దృష్టంతా అఖిల్ చేయనున్న రెండో చిత్రం పైనే. ‘ఊపిరి’ చేస్తున్నప్పుడు ఆ చిత్రదర్శకుడు వంశీ పైడిపల్లి పని తీరు నచ్చి, అఖిల్ రెండో సినిమాకి అతనే దర్శకుడని నాగార్జున అనుకున్నారనే వార్త వచ్చింది. దానికి తగ్గట్లే అఖిల్ కోసం వంశీ స్టోరీ వర్కవుట్ చేస్తున్నారనే వార్త కూడా ప్రచారంలో ఉంది. అయితే, ఇప్పుడు తాజాగా మరో వార్త ప్రచారంలోకొచ్చింది. ఆ వార్త ప్రకారం అఖిల్ రెండో సినిమాని వంశీ డెరైక్ట్ చేయలేదట.
 
 మూడేళ్ల క్రితం హిందీలో రణబీర్ కపూర్, దీపికా పదుకొనే జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ ‘యే జవానీ హై దీవానీ’ని తెలుగులో అఖిల్ హీరోగా రీమేక్ చేయాలని నాగ్ అనుకుంటున్నారట. ఆ కథ మీదే వంశీని వర్కవుట్ చేయమని కోరారని భోగట్టా. కానీ, వంశీ అందుకు ఇష్టపడలేదట. వాస్తవానికి ‘ఊపిరి’ చిత్రాన్ని ఫ్రెంచ్ మూవీ ‘ఇన్‌టచబుల్స్’ ఆధారంగానే తీశారు. మళ్లీ వెంటనే మరో రీమేక్ చేయడానికి వంశీ అంత సుముఖంగా లేరట. అందుకే వేరే స్టోరీ లైన్‌తో చేద్దామని నాగ్‌తో అన్నారని తెలుస్తోంది.
 
  కానీ ఓ సూపర్ హిట్ మూవీ రీమేక్‌ని వదిలేసి, కొత్త కథతో చేయడానికి నాగ్ సుముఖంగా లేరని కృష్ణానగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో వేరే దర్శకుడితో అఖిల్ హీరోగా ‘యే జవానీ హై దీవానీ’ తెలుగు రీమేక్ చేయాలనుకుంటున్నారట. ఆ సంగతలా ఉంచితే.. ప్రస్తుతం తాను అనుకుంటున్న మంచి స్టోరీ లైన్‌తో ఓ స్టార్ హీరోతో సినిమా చేయాలనే ఆలోచనలో వంశీ పైడిపల్లి ఉన్నారని సినీవర్గాలు చెబుతున్నాయి. ఈ గుసగుసల్లోని నిజానిజాలు నిలకడ మీద తెలుస్తాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement