ప్రియాకు చిక్కులు: కన్నుకొట్టడం దైవదూషణే!

Trouble for Oru Adaar Love movie, Hyderabad residents move Supreme Court - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఓవర్‌నైట్‌ ఇంటర్నెట్‌ సెన్సేషన్‌గా మారిన ప్రియాప్రకాశ్‌ వారియర్‌ తొలి చిత్రం ‘ఓరు ఆదార్‌ లవ్‌’ సినిమాకు ఒక్కొక్కటిగా కష్టాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా ఇద్దరు హైదరాబాద్‌ వాసులు ఈ సినిమాకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమాలోని ‘మాణిక్య మలరాయ పూవి’  పాటను తొలగించాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు. పవిత్రమైన పాటలో కన్నుగీటినట్టు చిత్రించడం.. ఇస్లాంలో ‘దైవదూషణ’ లాంటిదేనని పేర్కొన్నారు.

‘మాణిక్య మలరాయ పూవి’  పాట వీడియోను కొన్ని రోజుల కిందట ఇంటర్నెట్‌లో విడుదల చేయగా.. ఈ పాటలోని ప్రియా వారియర్‌ తన క్లాస్‌మేట్‌ను చూసి నవ్వుతూ.. కన్నుకొట్టే దృశ్యాలు వైరల్‌ అయ్యాయి. ఈ వీడియోతో ప్రియా వారియర్‌ ఓవర్‌నైట్‌ ఇంటర్నెట్‌ సెన్సేషన్‌గా మారిపోయింది. అయితే, ఈ వీడియో క్లిప్‌పై పలు ముస్లిం సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇది మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పేర్కొంటున్నాయి. మహమ్మద్‌ ప్రవక్త, ఆయన భార్య ఖదీజా బివీని ప్రశంసిస్తూ రాసిన పాటను ఈ సినిమాలో ఉపయోగించుకొని.. అభ్యంతరకర దృశ్యాలను చిత్రీకరించారని పిటిషనర్లు పేర్కొన్నారు.

‘30 సెకన్ల వీడియోలో పాఠశాల బాలిక.. ఓ బాలుడి పట్ల నవ్వుతూ.. కనుబొమ్మలు ఎగరేస్తూ.. కన్నుకొట్టినట్టు చూపించారు. కన్నుకొట్టడం ఇస్లాంలో నిషేధం. మహమ్మద్‌ ప్రవక్త, ఆయన భార్యను ప్రశంసిస్తూ రాసిన పవిత్రమైన పాటలో ఇలా కన్నుకొట్టే సన్నివేశాలు పెట్టడం దైవదూషణే’ అని పిటిషనర్లు తెలిపారు. పిటిషనర్లలో ఒకరు ఇప్పటికే సినిమా దర్శకుడు ఒమర్‌ లులుకు వ్యతిరేకం పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top