నవతరం ‘డైరెక్షన్‌’

Tollywood Women Directors - Sakshi

సవాళ్లతో కూడుకున్న సినిమా రంగంలో తెరపైనే కాదు తెర వెనుక కూడా మహిళలు సత్తా చాటుతున్నారు. కథానాయికలు, సహాయక పాత్రల్లో తెరపై కనిపించడానికి పరిమితం కాకుండా సినిమా నిర్మాణంలో తమదైన శైలిలో దూసుకెళ్తున్నారు. 24 క్రాప్టుల్లోనూ భాగస్వాములవుతున్న మహిళల సంఖ్య పెరుగుతుండటం ఇందుకు నిదర్శనం. ఒకప్పుడు సినిమాల్లో నటనకు, పాటలు పాడటానికి, నర్తించడానికే మాత్రమే పరిమితమైన మహిళలు ఇప్పుడు అన్నిరంగాల్లోకి ప్రవేశిస్తున్నారు. ముఖ్యంగా ఎంతో సంక్లిష్టమైన దర్శకత్వ విభాగంలోకి నవతరం నారీమణుల రాక పెరుగుతుండటం శుభపరిణామం. ఛాన్స్‌ వచ్చింది కదా అని మూస సినిమాలు చుట్టేయడం లేదు. నవ్యపంథాలో ముందుకు సాగుతూ తమదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.  

ఇదివరకటి రోజుల్లో అమ్మాయిలు సినిమా రంగంలోకి అడుగుపెడతామంటే కుటుంబ సభ్యులతో పాటు సమాజం నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమయ్యేది. ఇప్పుడా పరిస్థితిలో చాలావరకు మార్పు రావడంతో చిత్రసీమలోకి అడుగుపెట్టే యువతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తమకు ఇష్టమైన విభాగాల్లో ప్రవేశించిన అమ్మాయిలు అందివచ్చిన అవకాశాలతో తామేంటో నిరూపించుకుంటున్నారు. మగాళ్లకు ఏమాత్రం తీసిపోమని ఢంకా బజాయిస్తున్నారు. సినిమా రంగంలో నిలదొక్కుకున్న కుటుంబాలకు చెందిన మహిళలు కూడా మెగాఫోన్ పట్టడం తాజా పరిణామం.

నాగార్జునను పడేసింది!
'పడేశావే' సినిమాతో దర్శకురాలిగా వెండితెరకు పరిచయమైంది చునియా. మా టీవీలో ప్రసారమైన యువ సీరియల్ ద్వారా ఆమె దర్శక జీవితం మొదలైంది. అక్కినేని కుటుంబం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన మనం సినిమాకు లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది. చునియా ప్రతిభను గుర్తించిన హీరో నాగార్జున ఆమెకు దర్శకురాలిగా అవకాశం ఇచ్చారు. ఆమె చెప్పిన స్టోరీలైన్ నచ్చడంతో 'పడేశావే' సినిమాను స్వయంగా నిర్మించారు. ఈ సినిమాకు విజయం సాధించనప్పటికీ డైరెక్టర్‌గా చునియాకు మంచి మార్కులు పడ్డాయి.

డైరెక్టర్‌గా మారిన జర్నలిస్ట్
చిత్రసీమపై ఎనలేని అభిమానం సంజనారెడ్డిని దర్శకురాలిని చేసింది. రాజ్ తరుణ్, అమైరా దస్తర్ జంటగా నటిస్తున్న 'రాజుగాడు' సినిమాతో దర్శకురాలిగా టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ఎలక్ట్రానిక్  మీడియా జర్నలిస్ట్‌గా పనిచేసిన ఆమె తన కలను సాకారం చేసుకునేందుకు ఉద్యోగాన్ని వదులుకుంది. కథలు రాయం, వాటిని ఆకట్టుకునేలా చెప్పడం లాంటి అంశాల్లో తన ప్రతిభకు పదుకుపెట్టుకుంది. సినిమా పరిశ్రమలో సాంకేతిక నిపుణులుగా పనిచేస్తున్న వారితో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకుంది. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దగ్గర 'రౌడీ' సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసింది.

ఘట్టమనేని వారసురాలు
సీనియర్ నటుడు సూపర్ కృష్ణ తనయ, హీరో మహేశ్ బాబు సోదరి ఘట్టమనేని మంజుల కూడా 'మనసుకు నచ్చిన'పని మొదలు పెట్టింది. దర్శకురాలిగా మారి 'మనసుకు నచ్చింది' అనే సినిమా తీసింది. స్వీయ రచనా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'షో' సినిమాతో నటిగా పరిచయమైన మంజుల పలు సినిమాలకు నిర్మాత కూడా వ్యవహరించారు. ఆమె తండ్రి కృష్ణ కూడా నటుడిగా నిరూపించకున్న తర్వాత నిర్మాత, దర్శకుడిగా మారారు. ఇప్పుడు ఆయన కుమార్తె మంజుల కూడా అదే దారిలో ముందుకు సాగుతున్నారు.

సాహో శశికిరణ్‌
తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న సినీ రచయిత, హాస్యనటుడు ఎంఎస్‌ నారాయణ కుమార్తె శశికిరణ్‌ కూడా మెగాఫోన్‌ పట్టింది. తండ్రి పేరు వాడకుండా స్వయం ప్రతిభతో ఛాన్స్‌ దక్కించుకుంది. సాహెబా సుబ్రహ్మణ్యం సినిమాతో టాలీవుడ్‌లోకి దూసుకొచ్చింది. వాణిజ్యపరంగా ఈ సినిమా విజయం సాధించకున్నా ఆమె దర్శకత్వ ప్రతిభకు ప్రశంసలు దక్కాయి. మహిళలు దర్శకత్వం చేయలేరేమోనన్న భయం క్రమంగా టాలీవుడ్‌లో తగ్గుతోందని చెబుతున్న శశికిరణ్‌.. మున్ముందు మరింత మంది యువతులను డైరెక్టర్లుగా చూడొచ్చన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

- పోడూరి నాగ శ్రీనివాసరావు, సాక్షి వెబ్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top