మూడు కోకిలలు.. ఆరు పాటలు

tollywood singers ugadi festival sakshi special story - Sakshi

ఇండియన్‌ ఐడల్‌ స్పెషల్‌

ప్రతిరోజూ పండగలానే...
ఉగాది అనగానే నాకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, పిండివంటలు. ఇప్పటివరకు నేను ఎనిమిది భాషల్లో మూడు వందలకు పైగా పాటలు పాడాను. బాలీవుడ్‌లో కూడా చాలా మంచి పాటలు పాడి పేరు సంపాదించాను. ఉగాది అని ప్రత్యేకంగా చెప్పను కాని ప్రతి రోజూ పండగ లాగానే ఉంటుంది. మన తెలుగువారందరూ విళంబి నామ సంవత్సరంలో మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. రోజూ అందరూ చాలా కష్టపడి పని చెయ్యాలి. నా విషయానికొస్తే నాకైతే ఇంకా అన్ని భాషల్లో పాటలు పాడాలి అని ఉంటుంది. అలాగే నేను నటిస్తానని కూడా అందరికీ తెలుసు.

ఇప్పటివరకు మూడు తెలుగు సినిమాల్లో నటించాను. ఇప్పుడు తెలుగులో ‘ఉగ్రం’ అనే సినిమాలో జేడీ చక్రవర్తి, నేను కలిసి నటిస్తున్నాం. ఈ ఉగాదికి స్పెషల్‌ ఏంటంటే  అమెజాన్‌ ప్రైమ్‌లో  నా కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ‘దరీమిక్స్‌’ అనే షో ప్రసారమౌతుంది.  నాకు చాలా పేరొస్తుందనే గట్టి నమ్మకముంది. వారానికి ఒక షో రిలీజవుతుంది. ఇప్పటివరకు రెండు ఎపిసోడ్స్‌ ప్రసారం అయ్యాయి. ఇందులో సింగింగ్, డాన్సింగ్‌కి చాలా స్కోప్‌ ఉంది. హిందీలో మంచి ఆల్బమ్స్‌ చేస్తున్నాను. వచ్చే ఉగాది లోపు నటుడిగా మంచి అవకాశలొస్తాయని ఆశిస్తున్నా.
– శ్రీరామచంద్ర

బాలీవుడ్‌లో ఎంటరవుతా
2017 సంవత్సరానికి సంబంధించిన ఇండియన్‌ ఐడల్‌ ట్రోఫీని సొంతం చేసుకున్నా. ఈ టైటిల్‌ను సొంతం చేసుకున్న తర్వాత వచ్చిన మొదటి ఉగాది ఇది. మాది మధ్యతరగతి కుటుంబం. కంబైన్డ్‌ ఫ్యామిలీ. ఉగాది అనగానే ఉగాది పచ్చడి గుర్తొస్తుంది. ఈసారి పచ్చడి మిస్సవుతానేమో అనుకొన్నాను. కాకపోతే ఈ సంవత్సరం మీ అందరికంటే ముందే నేను ఉగాది పచ్చడి రుచి చూశాను. ప్రస్తుతం నేను అమెరికాలో ఉన్నాను. అమెరికా వెళ్లే ముందే మా అమ్మగారు నాకు ఉగాది పచ్చడి ఇష్టమని ముందే తయారు చేసి రుచి చూపించారు. గతేడాది ఉగాదికి నేను మన రాష్ట్రాంలోని తెలుగువారికి  మాత్రమే తెలుసు. ఈ ఉగాదికి భారతదేశం మొత్తం తెలుసు. ఎప్పుడైతే నా పేరు పక్కన ‘ఇండియన్‌ ఐడల్‌’ అని చేరిందో అది నా జీవితాన్ని మార్చేసింది.

ఉగాది పండగ స్పెషల్‌ ఏంటంటే మన జీవితంలో ఉన్న అన్ని రుచులు ఈ ఉగాది పచ్చడిలో ఉంటాయి. మనం జీరోలో ఉన్నప్పుడు మనల్ని ఎవరూ పట్టించుకోరు. అలాగే మనం ఏదైనా సాధించగానే అందరూ మనవాళ్ల లాగే మన దగ్గరికి వస్తారు. ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. మన కష్టం, మన యాటిట్యూడ్‌ మాత్రమే మనల్ని మనలా నిలబెడతాయి. అవే మనకెప్పుడూ మనతో పాటు తోడుంటాయి. ఈ ఉగాది సందర్భంగా నేను కొన్ని అనుకొంటున్నాను. అవేంటంటే.. నా సింగింగ్‌తో బాలీవుడ్‌లోకి ఎంటర్‌ అయ్యి మంచి పేరు తెచ్చుకుంటాను. అలాగే ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌ అవుతా. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
– రేవంత్‌

అప్పుడే తీపి విలువ తెలుస్తుంది  
ఉగాది అనగానే మొదట గుర్తొచ్చేది ఉగాది పచ్చడే. ఎందుకంటే నేను భోజన ప్రియుణ్ణి. అందరూ బతకటం కోసం తింటే నేను మాత్రం తినడం కోసమే బతుకుతాను. కోటి విద్యలు కూటి కొరకే అనే సామెత కూడా ఉంది కదా. మా ఇంట్లో అందరం కలిసి భోజనం చేసేటప్పుడు కనీసం ఫోను కూడా క్యారీ చెయ్యం. ఒక్క ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్‌ను కూడా మేం డైనింగ్‌ టేబుల్‌ దగ్గరికి తీసుకురాం. భోజనం చేసేటప్పుడు మనకు ఇష్టమైన మనుషులతో మంచిగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం  చెయ్యాలి.

ఎందుకు ఫుడ్‌ గురించి ఇంత మాట్లాడుతున్నానంటే ఉగాది పండగలోని ఆరు రుచులు మన లైఫ్‌ ఫిలాసఫీని గుర్తు చే స్తాయి. అందులో చేదు రుచిని చూస్తేనే కదా మనకు తర్వాత వచ్చే తీపి విలువ తెలుస్తుంది. 2006 సంవత్సరంలో నేను మొదట ఇండియన్‌ ఐడల్‌ గెలిచిన ఉగాదిని ఎప్పటికీ మరచిపోలేను. ఆ ఉగాది నా కెరీర్‌కే మైల్‌స్టోన్‌ లాంటిది. ఆ తర్వాత ఎన్నో బెస్ట్‌ ఉగాదులు నన్ను పలకరించినా 2017 ఉగాది మాత్రం చాలా స్పెషల్‌. ఎందుకంటే ప్రస్తుతం నాకు సింగింగ్‌ అనేది వృత్తికాదు, ప్రవృత్తి మాత్రమే.

నేను గతేడాది నా సొంత యూట్యూబ్‌ చానల్‌ని ప్రారంభించింది ఉగాది రోజునే. అదిప్పుడు పదిలక్షల మంది సభ్యులకు చేరువలో ఉంది. నా చానెల్‌ కోసం యస్పీ బాలసుబ్రమణ్యం లాంటి వారు వీడియోలు చేయటం నా పూర్వ జన్మసుకృతంగా భావిస్తున్నాను. అలాగే గతేడాది ఉగాది నుండి ఈ ఏడాది ఉగాదికి నేను మూడు పెద్ద పనులు ప్రారంభించాను. అవేంటంటే మొదటిది నాకు నేనుగా నా యూట్యూబ్‌ చానల్‌ కోసం సంగీతం తయారు చేసుకోవటం, రెండోది మా పెద్దనాన్న వాళ్లు చాలా గొప్ప సంగీత విద్వాంసులు.

వారు సొంతంగా తయారు  చేసుకున్న లలిత సంగీతాన్ని ఇప్పటివరకు మా ఇంట్లో మేం మాత్రమే పాడుకున్నాం. అవి బయట వారికి తెలియవు. ఇప్పుడు వాటిని యూట్యూబ్‌ చానల్‌ ద్వారా ప్రజలకు అందజేయటం . ఇక మూడోది కర్ణాటక సంగీత కచేరీలను కూడా మొదలెట్టాను. సినిమాలు కాకుండా ముచ్చటగా ఈ మూడు పనులను ఉగాది నుండి ఉగాది వరకు అన్నట్టు చేసుకున్నాను. ఈ ఉగాదికి ‘సాక్షి’ పాఠకులందరూ ఆరు రుచులతో హాయిగా ఉండాలి.
 – కారుణ్య

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top