ప్రముఖ సినీ నిర్మాత కన్నుమూత

Tollywood Producer Kotipalli Raghava Passes away - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ సినీ నిర్మాత కోటిపల్లి రాఘవ ఇకలేరు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. ఈయన వయసు 105 సంవత్సరాలు. 1913 డిసెంబర్‌ 9న జన్మించిన కే.రాఘవది తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లి గ్రామం. ఆయన ప్రతాప్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్‌పై 30కి పైగా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. తరంగిణి, తూర్పు పడమర వంటి పలు చిత్రాలు అందించిన రాఘవ.. 1972లో తాతమనవడు, 1973లో సంసారం సాగరం సినిమాలకు నంది అవార్డు అందుకున్నారు.

తొలి తెలుగు సినిమా 1931లో నిర్మాణం జరుపుకోగా అంతకు ముందే ఆయన సినీరంగంలో అడుగుపెట్టారు. కొల్‌కతాలో సినిమా షూటింగ్‌లలో ట్రాలీ పుల్లర్‌గా సినీ జీవితాన్ని ప్రారంభించిన రాఘవ ఎన్నో అద్భుత చిత్రాలకు నిర్మాతగా ఎదిగారు. సినిమా రంగంలో చోటు చేసుకున్న అన్ని మార్పులను ఆయన దగ్గరుండి చూశారు. ఎనిమిదేళ్ల వయసులో తండ్రితో గొడవ పడి కొల్‌కతా వెళ్లిపోయిన రాఘవ, సైలెంట్‌ పిక్చర్స్‌లో ట్రాలీపుల్లర్‌గా చేరారు.

తరువాత విజయవాడలోని మారుతి టాకీస్‌లో కొంత కాలం పనిచేశారు. తెలుగు సినీ పితామహుడు రఘుపతి వెంకయ్య ఆఫీస్‌లో బాయ్‌గానూ కొంతకాలం పనిచేశారు. మిర్జాపురం రాజా వారు సినీ నిర్మాణంలోకి అడుగుపెడుతున్న సమయంలో ఆయనకు సహాయకుడిగా చేరారు. రాజా వారి నిర్మాణంలో తెరకెక్కిన పల్నాటి యుద్ధం సినిమా క్లైమాక్స్‌ దశలో చిత్ర దర్శకుడు మరణించటంతో ఎల్వీ ప్రసాద్‌కు తొలిసారిగా దర్శకుడిగా అవకావం ఇప్పించారు.

పాతాలభైరవి సినిమాలోని పోరాట సన్నివేశాలకు స్టంట్ డైరెక్టర్‌గానూ పనిచేశారు. తరువాత కొంత కాలం ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌ గా పనిచేసిన రాఘవ నిర్మాతగా మారారు. సినీ శిఖరంగా ఎదిగిన ఆయన ఎనిమిది భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. 

అక్కినేని జీవిత సాఫల్య పురస్కారం, 2012లో రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డు సైతం అందుకున్నారు. సినీ దిగ్గజాలైన దాసరి నారాయణరావు, రావుగోపాలరావు, కోడి రామకృష్ణ, గొల్లపూడి మారుతీరావు, ఎస్పీ బాలు, సుమన్‌, భానుచందర్‌లను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. జూబ్లీహిల్స్‌ మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top