
తనుశ్రీ దత్తా, వివేక్ అగ్నిహోత్రి
‘చాకోలెట్’ సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ముంబై: ఆషిక్ బనాయా అప్నేతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన తనుశ్రీ దత్తా పరిశ్రమలో తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి మరోసారి గళం విప్పారు. 2009లో వచ్చిన ‘హార్న్ ఒకే ప్లీజ్’ సినిమా చిత్రీకరణ సమయంలో నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తనుశ్రీ బుధవారం ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిపై కూడ ఆమె అలాంటి ఆరోపణలే చేశారు. ‘చాకోలెట్’ సినిమా షూటింగ్ సమయంలో వివేక్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ( చదవండి :నానా పటేకర్ నన్ను వేధించాడు : తనుశ్రీ దత్తా )
‘చాకోలెట్’ సినిమా షూటింగ్ సమయంలో హీరో ఇర్ఫాన్‌ఖాన్‌పై క్లోజప్ షాట్ తీయాల్సి ఉండగా.. అనవసరంగా నన్ను డైరెక్టర్ వివేక్ టార్గెట్ చేశాడని అన్నారు. సీన్‌లో నా అవసరం లేకున్నా.. ఇర్ఫాన్ ఎదురుగా డ్యాన్స్ చేయాలని అసభ్య పదజాలంతో చెప్పాడని ఆవేదన వ్యక్తం చేశారు. డైరెక్టర్ మాటలతో షాక్‌కు గురయ్యానని తెలిపారు. అసభ్యంగా మాట్లాడిన వివేక్‌పై ఇర్ఫాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడని వెల్లడించారు. ‘నాకు యాక్టింగ్ వచ్చు.. ఆమెను ఇబ్బంది పెట్టొద్దు’అని ఇర్ఫాన్ తనకు మద్దతుగా నిలిచాడని తనుశ్రీ గుర్తుచేసుకున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో నటుడు సునీల్ శెట్టి కూడా సెట్‌లో ఉన్నాడని ఆమె తెలిపారు. తనుశ్రీ తెలుగులో వీరభద్ర సినిమాలో బాలయ్య సరసన నటించారు.