బుల్లితెర ‘గుండన్న’ మనోడే

Telugu Tv  Serial Artist Madhukar Is Belongs To Adilabad - Sakshi

‘దేవమ్మా..దేవమ్మా...అంబిక ఇంటివద్ద ఇద్దరమ్మాయిలను చూశాను. ఒకవేళ వారు మీ పిల్లలై ఉంటారేమోనమ్మా...ఆవు చేన్లో మేస్తే దూడ గట్టులో మేస్తుందా... మీ అత్తమ్మలా నీవు అబద్దాలు చెబుతున్నావ్‌... నా కళ్లు నన్ను మోసం చేయలేవు శ్రీవల్లీ.. ఆడపిల్లల్ని చూశాక నాకనిపించింది. వాళ్లు దేవమ్మ పిల్లలేనని.. అంటూ ఈ టీవీలో ప్రసారమైన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సీరియల్‌లో దేవమ్మ అనుచరుడి పాత్ర పోషించిన గుండన్న మనోడే.

సాక్షి, ఆదిలాబాద్‌ : ‘కలలు కనాలి.. వాటిని సాకారం చెయ్యాలి’ అని అన్నపెద్దల మాటలు నిజమని నిరూపించాడు.. సంకల్పానికి, ప్రతిభకు పేదరికం అడ్డురాదని తెలియజేశాడు ఈ యువకుడు. కెరమెరి మండలంలోని బారేమోడి గ్రామానికి చెందిన నికోడే సానాజి, కమలాబాయి దంపతులకు ముగ్గురు కూతుర్లు, ఇద్దరు కుమారులు. వారిలో చిన్నవాడు మధూకర్‌ అలియాస్‌ మధు. ప్రాథమిక విద్యాభ్యాసం బారేమోడిలో, 6వ తరగతి కెరమెరిలోని నవో దయ, 8వ సిర్పూర్‌(టీ)లో, 9,10వ కెరమెరి ఉన్నత పాటశాలలో, ఇంటర్‌ ప్రభుత్వ జూని యర్‌ కళాశాలలో పూర్తి  చేశాడు. పదోతరగతి చదువుతుండగా పేపర్‌లో వచ్చిన యాడ్‌ చూసి సినిమా రంగంలో నటించేందుకు పాస్‌ఫొటో పంపించాడు. కానీ మూడేళ్ల వరకు ఎలాంటి సమాధానం రాలేదు.. 2010 వరంగల్‌ లో డిగ్రీ చదువుతుండగా తరచూ హైదరాబాద్‌లోని ఆయా స్టూడియోల్లోకి వెళ్లి వస్తుండేవాడు. (తెలంగాణ : అడ్డదారిలో ఎక్స్‌టెన్షన్లు)

దిల్‌ రాజు కార్యాలయం చుట్టూ 50కి పైగా చక్కర్లు
సినిమా, సీరియల్‌ పై ఉన్న మోజుతో హైదరాబాద్‌లోని ప్రముఖ దర్శక, నిర్మాత దిల్‌ రాజు కార్యాలయానికి 50కి పైగా చక్కర్లు కొట్టాడు. కానీ ఎవ్వరూ దరి చేరనివ్వలేదు. ఇలా కాదని 2011 లో సినిమా కార్యాలయంలో శిక్షణ కోసం రూ.5000 చెల్లించాడు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అనంతరం ఇతనిలో ఉన్న పట్టుదల చూసి “సాయిబాబా’ సినిమాలో ఓపాత్ర కోసం రూ.లక్ష కట్టామన్నారు. అంత స్థోమత లేకపోవడంతో ఆ అవకాశం కూడా చేజారి పోయింది. (పరిశ్రమలకు అన్ని విధాలా ప్రోత్సాహం)

నాటకరంగంలో అడుగు
2017లో తెలంగాణ ప్రభుత్వం భాషా సంఘం ఆధ్వర్యంలో రంగస్థల నటుడిగా 40రోజులు శిక్షణ పొందాడు. అనంతరం ‘నక్షత్రం’ ‘ఫిదా’ సినిమాలో క్యారెక్టర్‌ పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన తెలంగాణం నాటకం రజాకార్ల పాత్రలో పోషించి ఆహూతుల నుంచి మన్ననలు పొందాడు. ఆదిలాబాద్, బాసర, నిర్మల్‌ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో నిర్వహించిన కుమురం భీం, పోలీస్‌ తదితర నాటకాల్లో ప్రతిభ కనబర్చాడు. హైదరాబాద్‌లోని క్రిష్ణానగర్‌లో ఉంటూ టెక్నీషియన్‌గా పనిచేశాడు. ఈ తరుణంలోనే సొంతంగా 80 వీడియోలు తయారు చేశాడు. వాటిని డైరెక్టర్, ప్రొడ్యూసర్లకు చూపించాడు. దీంతో ఆయనలో ఉన్న ప్రతిభను గుర్తించి 2019లో ‘నిన్నే పెళ్లాడతా’ సీరియల్‌లో రౌడీ క్యారెక్టర్‌ ఇప్పించారు. అక్కడి నుంచి అతని ప్రయాణం ప్రారంభమైంది. (15 రోజుల్లోగా పంపేయండి )

మధు నటించిన సీరియల్లు
ప్రస్తుతం జీటీవీలో వస్తున్న ‘నిన్నే పెళ్లాడతా’ లో రౌడీ పాత్ర, స్టార్‌మాలో వస్తున్న ‘కథలో రాజకుమారి’ లో తండ్రి పాత్ర, జీ తెలుగులో వస్తున్న ‘అత్తారింట్లో అక్కా చెల్లెల్లు’ లో రౌడీ క్యారెక్టర్, ఈ టీవీలో వస్తున్న మిష్టర్‌ అండ్‌ మి సెస్‌ భాను’లో పోలీస్‌ పాత్రలో, మ్యాంగో వెబ్‌ సిరీస్‌లో మాంత్రికుడి పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నాడు.

తపన, దృఢసంకల్పం కావాలి
ప్రతి మనిషిలో ఏదో ఒక గుణం ఉంటుంది. అదేమిటో మనకు తెలుసు.  దాన్ని సాధించాలంటే తపన, కృషి, దృఢసంకల్పం తప్పనిసరి. పదోతరగతిలో ఉన్నప్పుడు శ్రీ మంజూనాథ సినిమా చూసి ఇంప్రెస్‌ అయ్యా. నేనెందుకు తెరపై కనిపించకూడదని అనుకున్నా. అప్పుడే నా ప్రయాణం మొదలైంది. అప్పుడే స్క్రీన్‌ పై కనిపించాలనే తపన నన్ను మీ ముందుకు తెచ్చింది.                                              – నికోడే మధూకర్‌(మధు), ఆర్టిస్ట్‌   

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top