పరిశ్రమలకు అన్ని విధాలా ప్రోత్సాహం | CM YS Jagan Comments In Review of New Industrial Policy | Sakshi
Sakshi News home page

పరిశ్రమలకు అన్ని విధాలా ప్రోత్సాహం

Jun 6 2020 2:48 AM | Updated on Jun 6 2020 2:40 PM

CM YS Jagan Comments In Review of New Industrial Policy - Sakshi

75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని చట్టం తెచ్చాం. యువతకు అవసరమైన నైపుణ్యాన్ని మనమే కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇది పరిశ్రమలకు అనుకూలంగా ఉంటుంది. స్థానికుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. స్థానికంగానే నైపుణ్యమున్న మానవ వనరులు లభిస్తాయి.

వందలాది కోట్ల రూపాయలను ఖర్చు చేసి పరిశ్రమను పెడుతున్నప్పుడు, అనుకున్న సమయానికి అది ప్రారంభమయ్యేలా చూడాలి. అలా వారి కార్యకలాపాలకు ఊతం ఇవ్వడం ద్వారా ప్రభుత్వం చేదోడుగా నిలవాలి. స్థిరమైన పెట్టుబడులు రావాలన్నా, పది కాలాల పాటు పరిశ్రమలు చక్కగా నడవాలన్నా.. అందుకు అనుకూలంగా పారదర్శక విధానాలు ఉండాలి.
 
పారిశ్రామిక విధానం నిజాయితీగా ఉండాలి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిందే. ఇందులో మరో మాట ఉండకూడదు. గత ప్రభుత్వం మాదిరిగా మోసం చేసే మాటలు అసలే వద్దు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటేనే పోటీలో మనం గెలుస్తాం.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ఇచ్చిన మాట మేరకు అనుకున్న సమయానికి పరిశ్రమ ప్రారంభం అయ్యేలా చూడగలగడమే పెట్టుబడిదారులకు అతిపెద్ద ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి పూర్తిగా అనుకూలమైన పరిస్థితులు కల్పించేలా పారిశ్రామిక విధానం ఉండాలని, పెట్టుబడుల్లో డీ రిస్కింగ్‌ ద్వారా పరిశ్రమలకు పెద్ద ఊతం ఇవ్వాలని చెప్పారు. ఇండస్ట్రియల్‌ పార్కు, క్లస్టర్లకు పెద్ద పీట వేయాలని, ఆ నిర్దేశిత ప్రాంతంలో పరిశ్రమలు పెట్టేలా ప్రోత్సహించాలని స్పష్టం చేశారు. స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ)పై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమలు, పెట్టుబడులకు సంబంధించిన వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి అందజేశారు. కొత్త పారిశ్రామిక విధానం, ఇండస్ట్రీకి అనుమతుల విషయంలో అనుసరించాల్సిన విధివిధానాలపై సమావేశంలో చర్చించారు. పరిశ్రమ కోసం పెట్టుబడులు పెట్టేందుకు ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు ఎలాంటి విధానం ఉండాలన్నదానిపై సీఎం పలు సూచనలు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
నూతన పారిశ్రామిక విధానంపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 
 
ప్రఖ్యాత సంస్థలతో పీసీబీని టై అప్‌ చేయాలి 
► పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డులో కాలుష్య నివారణ పద్ధతుల్లో నిపుణులైన, ప్రఖ్యాత వ్యక్తులతో ఒక కమిటీని నియమించాలి. ఇందులో కనీసంగా నలుగురు సభ్యులు ఉండాలి. ప్రపంచంలోని ప్రఖ్యాత సంస్థలతో పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు(పీసీబీ)ను టై అప్‌ చేయాలి.  
► పరిశ్రమ ఏర్పాటు చేస్తానని ఎవరైనా ముందుకు వస్తే, ముందుగా ఆ ప్రతిపాదన పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డులో ఉన్న నిపుణులకు పంపాలి. ఆ కమిటీ ద్వారా ఇదివరకే టై అప్‌ అయిన సంస్థలు ఆ ప్రతిపాదనపై అధ్యయనం చేయాలి. నివేదిక రాగానే పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధ్యయనం చేసి సిఫార్సులు చేస్తుంది.  
► ఈ కమిటీ సిఫార్సులు సానుకూలంగా వస్తే.. స్టేట్‌ ఇండస్ట్రీస్‌ ప్రమోషన్‌ కమిటీ (ఎస్‌ఐపీసీ) ముందుకు ఆ ప్రతిపాదన వెళ్తుంది. వారు సంబంధిత పరిశ్రమకు చెందిన వ్యక్తులతో సమావేశమవుతారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీని వివరించి అవగాహన కల్పిస్తారు.  
► పెట్టబడుల్లో వారి విశ్వసనీయత, సమర్థతలను ఎస్‌ఐపీసీ పరిశీలించి, ప్రతిపాదనకు అంగీకారం తెలిపితే, తర్వాత ఆ ప్రతిపాదన ఎస్‌ఐపీబీ ముందుకు వస్తుంది. ఎస్‌ఐపీబీ ఆ ప్రతిపాదనపై ప్రజెంటేషన్‌ ఇచ్చాక.. ప్రభుత్వం క్లియరెన్స్‌ ఇస్తుంది.  
► ఆ తర్వాత పరిశ్రమ ఏర్పాటు చేసేవారికి చేయూతగా సింగిల్‌ విండో విధానం నిలుస్తుంది. పరిశ్రమ ఏర్పాటు చేయడంలోనే కాకుండా, తర్వాత కాలంలో కూడా అండగా నిలుస్తాం.  

ఏం చేయగలమో అదే చెప్పాలి 
► ఇండస్ట్రీ పాలసీ నిజాయితీగా ఉండాలి. మోసం చేయకూడదు. పరిశ్రమలకు మాట ఇస్తే అది కచ్చితంగా నెరవేర్చాలి. పరిశ్రమలకు భూమి, నీరు, విద్యుత్‌ లాంటి సదుపాయాలు కల్పిస్తాం. నైపుణ్యం ఉన్న మానవ వనరులను అందిస్తాం. ప్రభుత్వం సానుకూలంగా, వారి పట్ల ప్రో యాక్టివ్‌గా ఉంటుంది.  
► పరిశ్రమలు పెట్టే్ట వారికి ప్రభుత్వం నిజాయితీగా ఏం చేయగలదో అదే చెప్పాలి. ఈ అంశాల ప్రాతిపదికగా పారిశ్రామిక విధానం తయారు చేయాలి. ఎస్‌ఐపీబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాక, ఆ ప్రతిపాదనలన్నీ వాస్తవ రూపంలోకి రావాలి.  

కనికట్టు మాటలొద్దు 
► పరిశ్రమల విషయంలో కనికట్టు మాటలు వద్దు. గత ప్రభుత్వం ఇలాంటి మాటలే చెప్పింది. పరిశ్రమలకు రూ.4 వేల కోట్ల ఇన్సెంటివ్‌లను బకాయి పెట్టింది. ఆ బకాయిలను తీర్చడానికి ఈ ప్రభుత్వం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది.   
► ఎంఎస్‌ఎంఈలకు ఇప్పటికే ఒక విడతలో సగం బకాయిలు చెల్లించాం. మిగిలిన సగం డబ్బును చెల్లించడానికి ప్రయత్నాలు 
చేస్తున్నాం.   
► సమావేశంలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతం రెడ్డి, బొత్స సత్యన్నారాయణ, గుమ్మనూరి జయరాములు, బాలినేని శ్రీనివాసరెడ్డి, కురసాల కన్నబాబు, సీఎస్‌ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.   

పెట్టుబడులు పెట్టే వారికి రిస్క్‌ తగ్గాలి 
► ఈ విధానం కారణంగా పెట్టుబడులు పెట్టే వారికి రిస్క్‌ తగ్గుతుంది. అనుకున్న సమయానికి పరిశ్రమలు ప్రారంభం అయ్యేందుకు వారికి తగిన తోడ్పాటు లభిస్తుంది. ఇదే పెట్టుబడిదారులకు అతిపెద్ద ప్రోత్సాహంగా నిలుస్తుంది. పరిశ్రమలకు, ప్రజలకు మేలు జరిగేలా ఈ విధానం ఉంటుంది. 
► భవిష్యత్తు తరాలు కూడా మనకు ముఖ్యం. పరిశ్రమలు రావడం, తద్వారా ఉద్యోగాల కల్పన ముఖ్యమైన అంశం. అదే సమయంలో ప్రజలకు, పర్యావరణానికి హాని జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. 
► ఇండస్ట్రియల్‌ పార్కులు, క్లస్టర్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఏ పరిశ్రమలు ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలన్న దానిపై ప్రభుత్వం నిర్దేశిస్తుంది. దీని వల్ల వారికి భవిష్యత్తులో కార్యకలాపాల పరంగా గానీ, పర్యావరణం పరిరక్షణ పరంగా గానీ.. ఎలాంటి ఇబ్బందులు రాకుండా సజావుగా నడుపుకోవచ్చు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement