అషూకు సిగ్గు, శరం లేదు : తమన్నా

Tamanna Simhadri Comments On Ashu Reddy And Ali Reza - Sakshi

డైమండ్‌ టాస్క్‌.. కింగ్‌లా మారడం.. ఇంట్లో అధికారం చెలాయించడం అనే ఆటలో పెద్ద రచ్చ జరిగింది. ఆడవారి వేషం వేయలేనని జాఫర్‌, వరుణ్‌ సందేశ్‌లు ఎదురుతిరగడం.. అలీ రెజా, అషూ రెడ్డిపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు.. వరుణ్‌ సందేశ్‌ ఇంటి మొదటి కెప్టెన్‌గా ఎన్నిక కావడం నేటి ఎపిసోడ్‌లో హైలెట్‌గా నిలిచాయి. సైక్లింగ్‌ టాస్క్‌లో చెత్తగా పర్ఫామెన్స్‌ చేసిన వారేవరు అని బిగ్‌బాస్‌ అడగ్గా వరుణ్‌ తనంతట తానే లేవడంపై హిమజ మాట్లాడటంతో వితికా ఫైర్‌ అయింది.  ఇక విషయంపై అలీ రెజా వచ్చి హిమజతో మాట్లాడటంతో మరింత రచ్చ జరిగింది. 

పవర్‌ గేమ్‌ టాస్క్‌
బజర్‌ మోగిన తరువాత ఎవరైతే.. డైమండ్‌ను చేజిక్కించుకుంటారో వారికి ఇంటిపై పెత్తనం చేసే అధికారం వస్తుందని తెలిపాడు. మళ్లీ బజర్‌ మోగేంతవరకు ఆ హౌస్‌మేట్‌ చెప్పినట్లే మిగతా ఇంటిసభ్యులు పాటించవలసి ఉంటుందని తెలిపాడు. అయితే మొదటి అవకాశంలో వరుణ్‌ సందేశ్‌ డైమండ్‌ను పట్టుకుని కింగ్‌లా మారిపోయాడు. ఈ ప్రాసెస్‌లో వితికాకు, శివజ్యోతికి గాయాలయ్యాయి. అయితే తన మంత్రిగా బాబా భాస్కర్‌ను వరుణ్‌ ఎంచుకున్నాడు. ఇక తన బట్టలను ఉతకవలసిందిగా హిమజను.. బెడ్‌రూంను సరిగా సర్దమని శ్రీముఖి, మహేష్‌లను.. నాగిని డ్యాన్స్‌ వేయాలని తమన్నాను.. ఆమెకు సహాయం చేయాల్సిందిగా బాబా భాస్కర్‌ను ఆదేశించాడు. రంగ రంగస్థలాన పాటను రాహుల్‌ ఆలపించగా.. జాఫర్‌, పునర్నవిలు చేసిన డ్యాన్స్‌ ఆకట్టుకుంది.

అలీ రెజా విలన్‌.. తమన్నా హీరోయిన్‌
రెండో బజర్‌ మోగిన వెంటనే పరిగెత్తిన అలీ రెజా.. డైమండ్‌ను పట్టే క్రమంలో శివజ్యోతిని నెట్టేశాడు. అయితే కిందపడిన శివజ్యోతిని లేపిన అనంతరం ఆమెనే వజ్రాన్ని తీసుకొమ్మన్నాడు. అయితే ఆటలో ఇవన్నీ సహజమేనని.. అలీ రెజాకు శివజ్యోతి కిరీటాన్ని తొడిగింది. దీంతో.. మగవారందరినీ ఆడవారిగా రెడీ కావాలని అలీ ఆదేశించాడు. ఇక ఈ టాస్క్‌లో పాల్గొనలేమని జాఫర్‌, వరుణ్‌ సందేశ్‌, వితికా షెరు, తమన్నాలు పేర్కొన్నారు. వారంతా సైలెంట్‌ కూర్చొని చూస్తుండగా.. మిగతా వారంతా ఆడుతూ పాడుతూ కింగ్‌(అలీ రెజా)ను ఎంటర్‌టైన్‌ చేశారు.

ఇలా జరుగుతూ ఉండగా.. అలీ రెజాపై తమన్నా ఫైర్‌ అయింది. మాటామాటా పెరిగి పెద్ద రచ్చగా మారింది.  తనేమీ మెగాస్టార్‌, సూపర్‌స్టార్‌ కాదనీ, బాడీ ఉన్నంత మాత్రాన సూపర్‌స్టార్‌ కాలేరని అలీ రెజానుద్దేశించి తమన్నా ఘాటుగా విమర్శించింది. తనను సూపర్‌స్టార్‌ కాకుండా అడ్డుకుంటానని తమన్నా పేర్కొంది. ఇక అషూరెడ్డిని సైతం ఘోరంగా విమర్శించింది. అందంగా ఉన్నావు.. సిగ్గు, శరం లేకుండా అక్కడ(అలీ రెజా పక్కన) ఎంత బాగా కూర్చున్నావంటూ అషూ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీంతో హౌస్‌మేట్స్‌ అందరూ తమన్నా తీరును తప్పుబట్టారు. అలీ రెజా విలన్‌ అంటూ.. తాను హీరోయిన్‌ అంటూ జాఫర్‌తో  తమన్నా చెప్పుకొచ్చింది.

మొదటి కెప్టెన్‌గా వరుణ్‌ సందేశ్‌
మూడో బజర్‌ మోగాక.. హిమజ డైమండ్‌ను మొదటగా పట్టుకుంది. ఇంటి సభ్యులు తమ గురించి పరిచయం చేసుకోవాలని ఆదేశించింది. మొదటగా తన గురించి చెప్పాలని తమన్నాను ఆదేశించగా.. తన లైఫ్‌ గురించి చెప్పుకొచ్చింది. అనంతరం బాబా భాస్కర్‌ వచ్చి.. తనకు కోపం ఎక్కువగా ఉండేదని, దానివల్ల ఎన్నో అవకాశాలను కోల్పోయానని తన గురించి చెప్పుకొచ్చాడు. ఇక ఈ టాస్క్‌లో డైమండ్‌ను చేజిక్కించుకుని రాజులుగా మారిన వరుణ్‌ సందేశ్‌, అలీ రెజా, హిమజలను మొదటి కెప్టెన్‌ అయ్యే అవకాశం వచ్చింది. మెజార్టీ సభ్యుల ఓటింగ్‌తో వరుణ్‌ సందేశ్‌ బిగ్‌బాస్‌ హౌస్‌ మొదటి కెప్టెన్‌ ఎన్నికయ్యాడు. మరి కెప్టెన్‌గా ఎన్నికైనందున ఎలిమినేషన్‌లో వరుణ్‌ సందేశ్‌ ఉండకపోవడంతో.. మిగిలిన ఏడుగురిలో ఎవరు ఇంటిని వీడిపోనున్నారో చూడాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top