పుకార్లు పట్టించుకోను!

పుకార్లు పట్టించుకోను!


‘బాహుబలి’ తెచ్చిన కొత్త ఊపుతో మిల్కీబ్యూటీ తమన్నా ఇప్పుడు ఉత్సాహంగా ఉన్నారు. ఈ ఏడాది రానున్న సినిమాలపై బోలెడంత ఆశాభావంతో కనిపిస్తున్నారు. నాగార్జున కీలకపాత్ర ధరిస్తుంటే, కార్తీ సరసన తమన్నా నటిస్తున్న ‘ఊపిరి’ ఈ వేసవికే రానుంది. ‘‘ ‘ఊపిరి’లో నాకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నా. డబ్బింగ్ చెప్పడం బోలెడంత పెద్ద పని. ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నా’’ అని తమన్నా అన్నారు. ఒకప్పుడు కార్తీతో తమన్నాను జత కట్టి, పుకార్లు వచ్చాయి. మళ్ళీ కార్తీతో జతకట్టడం గురించి అడిగితే, ‘‘పనికిమాలిన పుకార్లు పట్టించుకోను’’ అంటూ, కార్తీతో నటించడం సరదాగా ఉందన్నారు.  

 

 పది నిమిషాల్లో ఫిక్స్!

 2005లో ‘శ్రీ’ సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసిన తమన్నా సరిగ్గా పదేళ్ళ కెరీర్ పూర్తయిన వేళ ఇప్పుడు తెలుగు, తమిళ, హిందీ త్రిభాషా చిత్రంలో ప్రభుదేవా పక్కన నటిస్తున్నారు. ‘‘డ్యాన్స్‌లో నేను ఎంతోకాలంగా ఆరాధించే ప్రభుదేవా పక్కన నటించడం, డ్యాన్స్ చేయనుండడం ఉద్విగ్నంగా ఉంది. దర్శకుడు ఎల్. విజయ్ (నటి అమలాపాల్ భర్త) ఈ చిత్రకథ చెప్పడం మొదలుపెట్టిన 10 నిమిషాల కల్లా ఈ సినిమా తప్పకుండా చేయాలని ఫిక్స్ అయిపోయా’’ అని తమన్నా వివరించారు. ఇటీవలే ముంబయ్‌లో షూటింగ్ మొదలైన ఈ సినిమా అందరూ అనుకుంటున్నట్లు ‘హార్రర్’ కాదనీ, ఒక్క క్షణం కూడా నిస్సత్తువగా అనిపించని ‘ఫన్ థ్రిల్లర్’ అనీ ఈ సుందరీమణి చెప్పుకొచ్చారు.

 

 ‘గ్లోబల్ యాక్టర్’ అనిపించుకోవాలని...

 ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ చిత్రసీమల్లో పనిచేసిన తమన్నా ‘‘ఇవాళ ప్రపంచమే కుగ్రామమైపోయిన వేళ గిరి గీసుకొని ఉండదలుచుకోలేదు. భాష, ప్రాంతం, వయస్సుకు కట్టుబడని గ్లోబల్ యాక్టర్ అనిపించుకోవాలనుంది’’ అని మనసులో మాట బయట పెట్టారు. ‘బాహుబలి’కి ముందు కెరీర్‌లో కొద్దిగా జోరు తగ్గిన ఈ పంజాబీ అమ్మాయి ‘‘నేను నటించిన సినిమాలు ఆడినా, ఆడకపోయినా, భవిష్యత్తు మీద దృష్టి పెట్టి ముందుకు సాగడం మీదే నా ఆలోచన’’ అని అన్నారు. వైఫల్యాలు వచ్చినా నిరాశతో కుంగిపోకుండా, తదుపరి పని మీద దృష్టి పెట్టాలన్న అమ్మడి సూత్రం నిత్యజీవితంలోనూ అందరికీ పనికొచ్చేదే!

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top