నా జాతీయ అవార్డు వెనక్కి తీసేసుకోండి | take back my award if you want, says akshay kumar | Sakshi
Sakshi News home page

నా జాతీయ అవార్డు వెనక్కి తీసేసుకోండి

Apr 25 2017 8:10 AM | Updated on Sep 5 2017 9:40 AM

నా జాతీయ అవార్డు వెనక్కి తీసేసుకోండి

నా జాతీయ అవార్డు వెనక్కి తీసేసుకోండి

రెండున్నర దశాబ్దాలుగా బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్న అక్షయ్‌కుమార్‌కు ఎట్టకేలకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది.

రెండున్నర దశాబ్దాలుగా బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్న అక్షయ్‌కుమార్‌కు ఎట్టకేలకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది. అయితే దాని గురించి ఒక్కోరూ ఒక్కోలా మాట్లాడుతుండటంతో అక్షయ్‌కి ఎక్కడలేని కోపం వచ్చింది. 'మీరు కావాలనుకుంటే దాన్ని వెనక్కి తీసేసుకోండి' అంటూ తీవ్రంగా మండిపడ్డాడు. 'గత పాతికేళ్లుగా నేను వింటూనే ఉన్నాను. ఎప్పుడైనా ఎవరికైనా అవార్డు వచ్చిందంటే దానిమీద బోలెడంత చర్చ మొదలుపెడతారు. ఎవరో ఒకరు ఏదో రకంగా వివాదం సృష్టిస్తారు. ఆ అవార్డు అతడికి వచ్చి ఉండకూడదు.. వేరేవాళ్లకు రావాల్సింది అంటారు. నాకు 26 ఏళ్ల తర్వాత ఈ అవార్డు వచ్చింది. ఇది కూడా మీకు నచ్చకపోతే వెనక్కి తిరిగి తీసేసుకోండి' అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు.

రుస్తుం సినిమాలో నటనకు గాను అక్షయ్‌కుమార్‌ ఈ ఏడాది ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్నాడు. దీనిపై చాలామంది కామెంట్లు చేశారు. దంగల్ సినిమాలో ఆమిర్ ఖాన్, అలీగఢ్ సినిమాలో మనో్జ్ బాజ్‌పాయి లాంటి వాళ్ల కంటే అక్షయ్ ఏమంత గొప్పగా చేశాడంటూ విమర్శించారు. ఇంతకుముందు అక్షయ్ నటించిన హేరా ఫేపరీ, భాగమ్ భాగ్ సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రియదర్శన్ ఇప్పుడు జాతీయ అవార్డుల జ్యూరీకి చైర్మన్‌గా ఉండటం వల్లే అక్షయ్‌కి అవార్డు వచ్చిందని కూడా వ్యాఖ్యానించారు.

ఇంతకుముందు రమేష్ సిప్పీ చైర్మన్‌గా ఉండగా అమితాబ్ బచ్చన్‌కు అవార్డు వచ్చిందని, అలాగే ప్రకాష్ ఝా చైర్మన్‌గా ఉండగా అజయ్ దేవ్‌గణ్‌కు వచ్చిందని, అప్పుడెవరూ ప్రశ్నించరు గానీ ఇప్పుడు మాత్రం ఇలాంటి ప్రశ్నలు ఎలా వస్తాయని అక్షయ్ కుమార్ మండిపడ్డాడు. వాస్తవానికి అక్కీకి ఈ అవార్డు ఎప్పుడో వచ్చి ఉండాల్సిందని ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ అన్నాడు. అతడు చాలా టాలెంట్ ఉన్న, కష్టపడే, నిబద్ధత కలిగిన నటుడని.. ఇప్పటికైనా అతడిని గుర్తించి అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని, ఆ అర్హత అక్షయ్‌కి ఉందని చెప్పాడు. తన భార్య ప్రేమికుడిని హత్యచేసి విచారణ ఎదుర్కొన్న నౌకాదళ అధికారిగా రుస్తుం సినిమాలో అక్షయ్ నటించాడు. ప్రస్తుతం తన భార్య ట్వింకిల్ ఖన్నా నిర్మాతగా సోనమ్ కపూర్, రాధికా ఆప్టే నటిస్తున్న పద్మన్, రజనీకాంత్ హీరోగా చేస్తున్న రోబో 2.0 సినిమాలలో అక్షయ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement