Sakshi News home page

సూర్య చిత్ర షూటింగ్‌కు అడ్డంకులు

Published Thu, Oct 12 2017 6:13 AM

Surya Thaana Serntha Koottam Shooting Cancelled

తమిళసినిమా: నటుడు సూర్య, కీర్తీసురేశ్‌ జంటగా నటిస్తున్న తానాసేర్న్‌ద కూటం చిత్రానికి బ్రాహ్మణుల ఎఫెక్ట్‌ తగిలింది. నటుడు సూర్య తన సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ పతాకంపై నిర్మించి కథానాయకుడిగా నటిస్తున్న తానాసేర్న్‌ద కూటం చిత్రానికి విఘ్నేశ్‌శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్‌ బుధవారం ఉదయం తంజావూరు, తిరువైయ్యారు సమీపంలోని కావేరినది తీరంలో అనుమతి పొంది చిత్రీకరణను నిర్వహించారు. సూర్యతో పాటు 200 మంది డాన్సర్లు పాల్గొనగా పాటను చిత్రీకరించారు.

ఆ ప్రాంతంలో పెద్దలకు కర్మకాండలు వంటి పుణ్య కార్యాలు చేయడానికి జనం పోటెత్తారు.అయితే పురోహితులు ఆ కార్యాలను నిర్వహించడానికి తానాసేర్న్‌ద కూటం చిత్ర షూటింగ్‌ ఆటంకంగా మారింది. ఉదయం ఆరు గంటలకే ఆ ప్రాంతానికి చేరుకున్న చిత్ర యూనిట్‌ ఆ ప్రాంతంలో ఇతరులెవరూ రాకుండా అడ్డుకున్నారు. దీంతో అక్కడి పుణ్యకార్యాలను ఆచరించడానికి వచ్చిన పురోహితులు చిత్ర వర్గాలు అడ్డగించడాన్ని తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో అక్కడ ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది.

ఈ సంఘటన తెలిసిన దక్షిణ భారత బ్రాహ్మణ సంఘం, తిరువైయ్యారు శాఖ అధ్యక్షుడు శ్రీనివాసన్,మాజీ అధ్యక్షుడు అండి, కార్యదర్శిశీను తిరువైయ్యారు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తమ వృత్తికి, ప్రజల పుణ్యకార్యాలకు ఆటంకం కలిగించే విధంగా చిత్ర షూటింగ్‌ను నిర్వహిస్తున్నారంటూ ఆరోపించారు. తమని నది నుంచి వారు ఎలా బయటకు పంపుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నిధులకు అనుమతి ఇవ్వకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించడంతో సీఐ శివరాజ్, ఎస్‌ఐ సురేశ్‌ వెంటనే నదీ ప్రాంతానికి వెళ్లి చిత్ర యూనిట్‌ వర్గాలతో చర్చించి షూటింగ్‌ను మధ్యాహ్నం 12 గంటల తరువాతనే నిర్వహించాలని చెప్పడంతో చిత్ర యూనిట్‌ అక్కడ షూటింగ్‌ రద్దు చేసుకోవలసి వచ్చింది.

Advertisement
Advertisement