‘నిను వీడని నీడను నేనే’ మూవీ రివ్యూ

Sundeep Kishan Ninu Veedani Needanu Nene Movie Review - Sakshi

టైటిల్ : నిను వీడని నీడను నేనే
జానర్ : థ్రిల్లర్‌
తారాగణం : సందీప్‌ కిషన్‌, అన్యా సింగ్‌, వెన్నెల కిశోర్‌, పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ
సంగీతం : తమన్
దర్శకత్వం : కార్తీక్ రాజు
నిర్మాత : సందీప్ కిషన్, సుప్రియ కంచర్ల

నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్‌ కిషన్ హీరోగా సక్సెస్‌ వేటలో వెనుకపడుతున్నాడు. కెరీర్‌లో ఒక్క వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ తప్ప చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేకపోవటంతో తన కెరీర్‌ను గాడిలో పెట్టే బాద్యతను తానే తీసుకున్నాడు. అందుకే స్వయంగా నిర్మాతగా మారి తెలుగు, తమిళ భాషల్లో ‘నిను వీడని నీడను నేనే’ చిత్రాన్ని నిర్మించాడు. తమిళ దర్శకుడు కార్తీక్‌ రాజును టాలీవుడ్‌కు పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా సందీప్‌కు ఆశించిన విజయం అందించిందా..?  హీరోగా, నిర్మాతగా రెండు బాద్యతలను సందీప్ సమర్థవంతంగా పోషించాడా..?

కథ : 
సినిమా కథ 2035లో మొదలవుతుంది. సైకాలజీ ప్రొఫెసర్‌(మురళీ శర్మ) తను డీల్‌ చేసిన ఓ కేసుకు సంబంధించిన విషయాలను చెప్పటం మొదలు పెడతాడు. కథ 2013 సంవత్సరానికి మారుతుంది. అర్జున్ (సందీప్‌ కిషన్‌), మాధవి (ఆన్య సింగ్) భార్య భర్తలు. ఓ బంగ్లాలో నివాసం ఉంటున్న వీరికి ఓ యాక్సిడెంట్ తరువాత కొన్ని భయానక సంఘటనలు ఎదురవుతాయి. వారు అద్దంలో చూసుకున్నప్పుడు వారికి బదులుగా ఇతర వ్యక్తులు రిషీ, దియా ముఖాలు కనిపిస్తుంటాయి. అద్దంలో వేరే వ్యక్తులు కనపడడానికి కారణం ఏంటి.? అద్దంలో కనిపించేది ఎవరు? చివరకు రిషీ, దియాలు ఏమయ్యారు? అన్నదే సినిమా కథ. 

నటీనటులు : 
సందీప్ కిషన్‌ తనదైన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. తనకు బాగా పట్టున్న కామెడీతో పాటు హారర్‌, యాక్షన్‌, సెంటిమెంట్‌ ఇలా అన్ని ఎమోషన్స్‌ను చాలా బాగా పండించాడు. హీరోయిన్ ఆన్య సింగ్ తెలుగులో తొలి సినిమానే అయినా మంచి మార్కులు సాధించింది. లుక్స్‌ పరంగా ఆకట్టుకున్న ఆన్య నటనలోనూ పరవాలేదనిపించింది. మరో కీలక పాత్రలో నటించిన వెన్నెల కిశోర్‌ తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించాడు. ఇతర పాత్రల్లో పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, ప్రగతి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

విశ్లేషణ : 
సందీప్‌ కిషన్‌ తొలిసారిగా నిర్మాతగా మారుతున్న సినిమా కోసం ఆసక్తికర కథను రెడీ చేశాడు దర్శకుడు కార్తిక్‌ రాజు. సినిమా మీద ఉన్న అంచనాలకు తగ్గట్టుగా ఇంట్రస్టింగ్ పాయింట్‌తో సినిమాను స్టార్ట్ చేశాడు. అయితే కీలకమైన మలుపులన్ని ద్వితీయార్థంలో చూపించిన దర్శకుడు ఫస్ట్‌హాఫ్‌లో కథను కాస్త నెమ్మదిగా నడిపించాడు. సెకండ్‌ హాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. వరుస ట్విస్ట్‌లతో ద్వితీయార్థాన్ని ఆసక్తికరంగా మలిచాడు దర్శకుడు. ముఖ్యంగా ఇంటర్వెల్‌ సీన్‌, ప్రీ క్రైమాక్స్‌, క్లైమాక్స్‌లు ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో లాజిక్‌ల కోసం వెతికితే మాత్రం కష్టం. థ్రిల్లర్‌ సినిమాలకు తమన్ ఎప్పుడూ సూపర్బ్‌ మ్యూజిక్‌తో అలరిస్తాడు. ఈ సినిమాలోనూ తమన్ తన మార్క్‌ చూపించాడు. పాటలు పరవాలేదనిపించినా నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచాడు. సినిమాటోగ్రఫి సినిమాకు మరో మేజర్‌ ప్లస్‌పాయింట్‌. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌:
సందీప్ కిషన్
నేపథ్య సంగీతం
కథలో మలుపులు

మైనస్‌ పాయింట్స్‌: 
లాజిక్ లేని సీన్స్
సెకండ్ హాఫ్ కామెడీ

సతీష్‌ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్‌డెస్క్‌.

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top