‘శ్రీనివాస కళ్యాణం‌’ మూవీ రివ్యూ

Srinivasa Kalyanam Telugu Movie Review - Sakshi

టైటిల్ : శ్రీనివాస కళ్యాణం
జానర్ : ఎమోషనల్‌ ఫ్యామిలీ డ్రామా
తారాగణం : నితిన్‌, రాశి ఖన్నా, నందితా శ్వేత, జయసుధ, రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాష్‌ రాజ్‌
సంగీతం : మిక్కీ జే మేయర్‌
దర్శకత్వం : సతీష్‌ వేగేశ్న
నిర్మాత : దిల్‌ రాజు, లక్ష్మణ్‌, శిరీష్‌

శతమానం భవతి సినిమాతో సూపర్ హిట్ సాధించిన దర్శకుడు సతీష్ వేగేశ్న మరోసారి దిల్ రాజు నిర్మాణంలోనే శ్రీనివాస కళ్యాణం సినిమా చేశారు. శతమానం భవతి సినిమాలో కుటుంబ బంధాలు, ప్రేమల విలువలు చెప్పిన దర్శకుడు, ఈ సారి తెలుగింటి సాంప్రదాయాలు, పెళ్లి విలువలు ఈ తరానికి పరిచయం చేసే ప్రయత్నం చేశారు. పెళ్లి అనేది ఓ ఈవెంట్‌లా మారిపోతున్న ఈ రోజుల్లో పెళ్లి బంధుమిత్రులతో కలిసి జరుపుకునే ఓ అందమైన జ్ఞాపకం అని తెలియజేసే ప్రయత్నమే శ్రీనివాస కళ్యాణం. మరీ శ్రీనివాస కళ్యాణం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది..?

కథ ;
శ్రీనివాస రాజు (నితిన్‌) ఉమ్మడి కుటుంబంలో పెరిగిన కుర్రాడు. చిన్నప్పటి నుంచి తెలుగు సాంప్రదాయలు, పెళ్లి విలువ గురించి నాన్నమ్మ (జయసుధ) చెప్పిన మాటలు విని పెరిగిన శ్రీనివాస్‌ తన పెళ్లి కూడా నాన్నమ్మకు నచ్చినట్టుగా పండుగలా చేసుకోవాలనుకుంటాడు. చంఢీఘర్‌లో ఆర్కిటెక్ట్‌గా పనిచేసే శ్రీనివాస్‌కు ఆర్కే గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌కు చెందిన ఆర్కే (ప్రకాష్ రాజ్‌) కూతురు శ్రీదేవి(రాశి ఖన్నా)తో పరిచయం అవుతుంది. శ్రీను తన ఫ్యామిలీని, సాంప్రదాయాలను గౌరవించే విధానం నచ్చిన శ్రీదేవి.. అతడితో ప్రేమలో పడుతుంది. ప్రేమా.. పెళ్లి లాంటి విషయాలను కూడా బిజినెస్‌ లా డీల్ చేసే ఆర్కే... శ్రీనివాస్‌, శ్రీదేవిల పెళ్లికి అంగీకరించాడా..? శ్రీను తన నాన్నమ్మ కోరుకున్నట్టుగా వారం రోజుల పాటు పెళ్లి వేడుకకు అందరినీ ఒప్పించగలిగాడా..? తన జీవితంలో ప్రతీ నిమిషాన్ని డబ్బుతో లెక్కించే ఆర్కే, తన పనులన్ని పక్కనపెట్టి కూతురి పెళ్లి కోసం వారం రోజులు సమయం కేటాయించాడా..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
కుటుంబ బంధాలు సాంప్రదాయల విలువ తెలిసిన కుర్రాడిగా నితిన్‌ బరువైన పాత్రలో కనిపించాడు. తన లవర్‌ బాయ్ ఇమేజ్‌ను కాపాడుకుంటూనే ఎమోషనల్‌ సీన్స్‌లోనూ మెప్పించాడు. శ్రీదేవి పాత్రలో రాశిఖన్నా ఒదిగిపోయింది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. పద్మావతిగా నందిత శ్వేతకు ప్రాధాన్యమున్న పాత్ర దక్కింది. ఫస్ట్‌ హాఫ్‌లో అల్లరి అమ్మాయిగా అలరించిన నందిత సెంకడ్‌ హాఫ్‌లో ఎమోషనల్‌ సీన్స్‌లోనూ మెప్పించింది. బిజీ బిజినెస్‌మేన్‌గా ప్రకాష్ రాజ్‌ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నారు. రాజేంద్ర ప్రసాద్‌, నరేష్‌, జయసుధ, సితార, విద్యుల్లేఖ రామన్‌, ప్రవీణ్ ఇలా అంతా రొటీన్‌ పాత్రల్లో కనిపించారు.

విశ్లేషణ ;
శతమానం భవతి సినిమాతో యూత్‌ ఆడియన్స్‌ను కూడా ఫ్యామిలీ సినిమాకు కనెక్ట్ చేసిన దర్శకుడు సతీష్‌ వేగేశ్న. మరోసారి ఈ దర్శకుడి నుంచి దిల్ రాజు బ్యానర్‌లో సినిమా వస్తుందంటే భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. అయితే ఆ అంచనాలు అందుకోవటంలో సతీష్ ఫెయిల్‌ అయ్యారు. పెళ్లి నేపథ్యంలో కథను తయారు చేసుకున్న దర్శకుడు, ఆ కథను మనసును తాకేలా తెరకెక్కించలేకపోయారు. ఫస్ట్‌ హాఫ్ హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు కాస్త ఆసక్తి కరంగా అనిపించినా సెకండ్‌ హాప్‌లో లో పెళ్లి పనులు మొదలైన తరువాత కథనం మరింత నెమ్మదించింది. పెళ్లింట్లో కామెడీ, ఎమోషన్స్‌ మరింతగా పండించే అవకాశం ఉన్నా.. దర్శకుడు ఎక్కువగా పెళ్లి గొప్పతనాన్ని చెప్పడానికి సమయం తీసుకున్నారు. (సాక్షి రివ్యూస్‌) ఈ నేపథ్యంలో రచయితగా సతీష్ ఆకట్టుకున్నారు. పెళ్లి మంత్రాల్లోని అంతరార్థం చెప్పే డైలాగ్స్‌తో పాటు ‘వద్దనుకుంటూ వెళ్లిపోతే అనుబంధాలు.. వదులుకుంటూ వెళ్లిపోతే సాంప్రదాయాలు మిగలవ్‌’ లాంటి డైలాగ్స్‌ ఆకట్టుకుంటాయి. మిక్కీ జే మేయర్‌ సంగీతం కూడా ఆశించిన స్థాయిలో లేదు. ఒక్క పెళ్లి పాట తప్ప మరే పాట మెప్పించేలాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. సమీర్‌ రెడ్డి సినిమాటోగ్రఫి పెళ్లి వేడుకకు మరింత అందం తీసుకువచ్చింది. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :
సినిమాటోగ్రఫి
కొన్ని డైలాగ్స్‌

మైనస్‌ పాయింట్స్‌ ;
స్లో నేరేషన్‌
పాటలు

సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్‌ డెస్క్‌.

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top