విద్యావ్యాపారంపై దొంగ దెబ్బ ‘జెంటిల్‌మేన్‌’

special  story to  old movie gentleman - Sakshi

డబ్బింగ్‌ క్లాసిక్స్‌– 11

ఉదయం ఎనిమిది గంటలకు వ్యాన్‌ వస్తుంది. ఆయా తోడు ఉండి తీసుకువెళుతుంది. మధ్యాహ్నం స్కూల్లోనే లంచ్‌ ఇస్తారు. సాయంత్రం ఇంటర్వెల్‌కు ముందు స్నాక్‌ ఇస్తారు. క్యాంపస్‌ కాస్త పరిశుభ్రంగా ఉంటుంది. పాఠాలు కొంచెం నదురుగా చెప్తారు. ఈ మాత్రం దానికి హైదరాబాద్‌లో ఎల్‌.కె.జిలో జాయిన్‌ అయ్యి చదవాలంటే ఎనభై వేలు  అవుతుంది. ఇంకా మంచి స్కూల్‌ అంటే లక్షన్నర. ఆ 
పైస్థాయికి రెండు లక్షలు. అందరూ పిల్లలే.  అందరికీ ఈ మాత్రం స్కూల్, చదువు అందుబాటులో ఉండాలి. కాని పేదవాడి పిల్లలు ఇలాంటి స్కూల్‌ను ఊహించలేరు. డబ్బున్న పిల్లలకు పగిలిపోయిన పలకతో వచ్చే పిల్లాడి దుఃఖం ఎప్పటికీ తెలియదు.  2018లో అంతే. 1993లో అంతే. అయితే కాలం కలకాలం దోచుకునేవాళ్ల చేతిలో కరవాలం కాదు. తిరగబడేవాడు వస్తాడు. బందిపోటులా దాడి చేస్తాడు. ఇనప్పెట్టెలను ఖాళీ చేసి పట్టుకుపోయి పేదవాళ్లకు పంచి పెడతాడు. గతంలో అతణ్ణి రాబిన్‌హుడ్‌ అన్నారు. తమిళ  సినిమాలో ‘జెంటిల్‌మేన్‌’ అన్నారు.
 

ఇప్పుడంటే ఇంజనీరింగ్‌ కాలేజీలు చాలా వచ్చాయి. సీట్లు దొరుకుతున్నాయి. కాని మెడికల్‌ సీట్లు ఇప్పుడూ కష్టం.  1990ల కాలంలో ఇంకా కష్టం. బి.ఏ, బి.కాం, బిఎస్సీలు దివాలా తీసిన కాలం అది. ఆ డిగ్రీలకు విలువ లేదు. ఇంజనీరింగ్‌ కానీ మెడిసిన్‌ కానీ చేయాలి. ప్రతిభావంతులైన అందరు  విద్యార్థుల కల అదే. అలాంటి కాలంలో వినీత్, అర్జున్‌లు ఇంటర్‌లో స్టేట్‌ ఫస్ట్, సెకండ్‌ ర్యాంకులలో పాస్‌ అవుతారు. డాకర్లు కావాలనేది వారి కల. కాని మెడికల్‌ కాలేజీలో సీటు రాదు. దాని కోసం మంత్రిని కలుస్తారు. మెడికల్‌ కాలేజీ సీటంటే బజారులో దొరికే బొరుగుముద్ద కాదనీ ఒక్క సీటుకు లక్షన్నర కట్టాలని చెప్తాడు. లక్షన్నర. వెయ్యి రూపాయల జీతంతో మధ్యతరగతి జీవితం గడిచిపోయే రోజులు అవి. వీళ్లు పేదవాళ్లు. లక్ష రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి. వినీత్‌కు మెడికల్‌ కాలేజీ అంటే పిచ్చి. కానీ తండ్రి దాని మీద ఆశలు వదలుకొమ్మని అప్పడాలు అమ్ముకురమ్మని చెప్తాడు. వినీత్‌ భరించలేకపోతాడు. కదిలే బస్సు కింద తలను పరుస్తాడు. ఎన్నో ఆశలు ఆకాంక్షలు ఉన్న మెదడు ఆ కఠినమైన లోక
వాస్తవం కింద చితికిపోతుంది. మరోవైపు స్కూల్లో వంటామెగా పని చేసే అర్జున్‌ తల్లి నష్టపరిహారం ఏదైనా వచ్చి కొడుకు  చదువుకు ఉపయోగపడుతుందని చెప్పి ఒంటికి నిప్పు పెట్టుకుంటుంది. ఇద్దరు విద్యార్థుల న్యాయమైన కోరిక వికృత వ్యాపార క్రీడ వల్ల రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. వ్యవస్థను న్యాయంగా ఎదుర్కోలేనప్పుడు దొంగదెబ్బ తీసి మెడలు వొంచాలి. అర్జున్‌ అదే నిర్ణయించుకుంటాడు. గజదొంగగా మారుతాడు. పగలు అప్పడాల కంపెనీ నడిపే యజమానిగా రాత్రిళ్లు ప్రభుత్వ సొమ్మును, బలిసినవాళ్ల ధనాన్ని దోచుకెళ్లే దొంగగా మారతాడు. 50 కోట్ల రూపాయల లక్ష్యం. ఎందుకు? ప్రజా విశ్వవిద్యాలయం నిర్మించడానికి. రాజైనా పేదైనా పెద్ద కులం వాడైనా చిన్న కులం వాడైనా హిందువైనా ముస్లిం అయినా అర్హమైన చదువు చదువుకోవాలంటే ఆ విశ్వవిద్యాలయంలో ఉచితం. అలాంటి విశ్వవిద్యాలయం కడతాడు. కాని చట్టం ఊరికే ఉండదు. తన పని తాను చేసుకుపోతుంది. అర్జున్‌ను అరెస్ట్‌ చేస్తుంది. ఆరేళ్ల జైలు శిక్ష. కాని ఒక ఉదాత్తమైన ఆశయం ఎదుట ఆ శిక్ష ఏపాటి? అర్జున్‌ విడుదలవుతాడు. ప్రజా విశ్వ విద్యాలయం ఉనికిలోకి వస్తుంది. కాని అదొక్కటే ఏం సరి పోతుంది? ఎక్కడని సరిపోతుంది. యోగ్యులైన విద్యార్థులు అర్హమైన విద్య కోసం ఆక్రందనలు చేస్తూనే ఉన్నారు.
బహుశా చేస్తూనే ఉంటారు.

ఎస్‌.ఏ.చంద్రశేఖర్‌ అని తమిళంలో ఒక దర్శకుడు ఉన్నాడు. ఇప్పుడు సూపర్‌స్టార్‌గా వెలుగుతున్న విజయ్‌ తండ్రి. తమిళంలో ‘సట్టమ్‌ ఒరు ఇరుట్టరై’ అనే సినిమా తీశాడు. హీరో తన తల్లిదండ్రులను చంపిన హంతకులను చట్టానికి దొరక్కుండా చంపుతాడు. అదీ కథ. పెద్ద హిట్టయ్యి ఆ సినిమాలో నటించిన విజయ్‌కాంత్‌ని హీరోని చేసింది.  తెలుగులో ‘చట్టానికి కళ్లులేవు’గా, హిందీలో ‘అంధా కానూన్‌’గా పెద్ద హిట్‌ అయ్యింది. ఆ చంద్రశేఖర్‌ శిష్యుడే  దర్శకుడు ఎన్‌.శంకర్‌. చట్టం లొసుగులను గురువు పర్సనల్‌ కారణాలకు వాడుకుంటే శిష్యుడు సంఘపరమైన కారణాలకు వాడుతూ తన తొలి సినిమాగా ‘జెంటిల్‌మేన్‌’ తీశాడు. ఆ తర్వాత శంకర్‌ ధోరణి అంతా ఈ బాణీలోనే సాగింది.  సమాజానికి మేలు చేయడం కోసం చట్టం అంగీకరించని పద్ధతిలో హీరో తిరగబడటమే అతడి కథలు. ‘జెంటిల్‌మేన్‌’ మొదటిసారి ఒక సామాజిక దురవస్థను చర్చించడం వల్ల అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే నీతిని కూడా రంజింప చేస్తూ చెప్పాలి. శంకర్‌ అలా చెప్పడం వల్లే సినిమా నిలిచింది.
 

‘జెంటిల్‌మేన్‌’లో గగుర్పాటు కలిగించే సన్నివేశాలున్నాయి. వినీత్‌ ఆత్మహత్య చేసుకుని మరణించాక అర్జున్‌ నిశ్చేష్టుడై వచ్చి శవానికి చుట్టిన బ్యాండేజ్‌ విప్పితే తల నుంచి మెదడు బయటకు వస్తుంది. దానిని పట్టుకుని తిరుగుతూ అందరికీ చూపుతూ విలపిస్తాడు అర్జున్‌. అలాగే ఆత్మహత్య చేసుకోబోయే ముందు మనోరమ ఒకసారి కొడుకుని పిలిచి కళ్లారా చూసుకోవడం కంటిచెమ్మను తెప్పిస్తుంది.ఇలాంటి సన్నివేశాలు రాసుకున్న శంకరే హీరోయిన్‌ మధుబాల చెల్లెలుగా శుభశ్రీని ప్రవేశపెట్టి కుర్రాళ్లకు హుషారు కలిగించే సన్నివేశాలు అల్లుతాడు. హాస్యజంట గౌండర్‌మణి, సెంథిల్‌ తమ చెణుకులతో నవ్విస్తారు. సూపర్‌మాల్‌లో దొంగతనం చేసి పారిపోతుండగా పోలీసులు వెంటపడితే గౌండర్‌ మణి హడావిడిగా ఒక బట్టలషాపులో దూరగా సేల్స్‌ గర్ల్‌ వచ్చి ‘వాడ్డూయు వాంట్‌ సార్‌’ అంటుంది. గౌండర్‌ మణి  చటుక్కున ‘పీస్‌ ఆఫ్‌ మైండ్‌’ అంటాడు. దీనిని త్రివిక్రమ్‌ వాడాడు. శంకర్‌కు పదార్థం వండటం తెలుసు. దాని మీద  ఆకర్షణగా తగరపు కాగితం అద్దడం కూడా తెలుసు. ఈ రెండూ కలిసి రుచి కలిగించిన సినిమా ‘జెంటిల్‌మేన్‌’.
 

ఫిబ్రవరి మార్చ్‌ నెలలు వస్తే న్యూస్‌ పేపర్లలో తల్లి దండ్రుల సంఘాలు ‘స్కూళ్ల ఫీజులు తగ్గించమని’ ప్రభుత్వానికి వినతి చేస్తున్న వార్తలు కనిపిస్తాయి. ప్రభుత్వం కూడా తగిస్తాం, చర్యలు తీసుకుంటాం అంటూ ఉంటుంది. స్కూలు యాజమాన్యాలు మాత్రం చక్కగా కాఫీలు తాగుతూ సెల్‌ఫోన్లు చూసుకుంటూ దండాల్సిన దానికి రూపాయి తగ్గకుండా  దండుకుంటూ ఉంటాయి. ఖరీదైన వస్తువును కొనుక్కున్నంత కష్టంగా మెరుగైన  చదువును కొనుక్కునే దురవస్థ మారలేదు. లాంగ్‌ కోట్‌ వేసుకొని నల్ల కళ్లద్దాలతో ‘జెంటిల్‌మేన్‌’ వస్తే బాగుండు. కొల్లగొడితే బాగుండు. కమాన్‌ జెంటిల్‌మేన్‌.

శంకర్‌ ఫార్ములా 
తమిళంలో భారీ నిర్మాతగా పేరుబడ్డ కుంజుమోహన్‌   శంకర్‌కు దర్శకుడిగా  అవకాశం ఇచ్చి 1993లో తీసిన సినిమా ‘జెంటిల్‌మేన్‌’. అదే పేరుతో ఏ.ఎం.రత్నం అనువదించగా ఇక్కడ కూడా సూపర్‌ హిట్‌ అయ్యింది. అప్పటికి ఉన్న ఇతివృత్తాలకు భిన్నంగా ఈ సినిమా ఇతివృత్తం ఉండటంతో ప్రేక్షకులు సినిమాను భారీగా ఆదరించారు. దానికి తోడు భారీ ఖర్చు పెట్టి సినిమా తీయడం కూడా లాభించింది. షోలే తరహాలో సినిమా ప్రారంభంలోనే రైలు మీదుగా ఎగిరే మోటర్‌ సైకిళ్లు, జీపుల వంటి భారీ చేజ్‌ పెట్టి ప్రేక్షకులకు షాక్‌ ఇస్తాడు శంకర్‌. ఈ సినిమాతో మొదలైన శంకర్‌–ఏ.ఆర్‌.రెహమాన్‌ జోడి ఇప్పటికీ కొనసాగుతోంది. మొదటిసారి తెలుగువారు బాలూ గొంతు కాకుండా సురేశ్‌ పీటర్స్, షావుల్‌ హమీద్‌ వంటి ఇతర గాయకుల గొంతును విన్నారు. ఈ సినిమాలోని ‘చికుబుకు చికుబుకు రైలే’ పాట సినిమా హిట్‌ కావడానికి ఒక ప్రధాన కారణమైంది. అందులో ప్రభుదేవా, ఐటమ్‌ గర్ల్‌గా గౌతమి కనిపించి ఊపు తెచ్చారు. పాట మధ్యలో రాజు సుందరం కనిపించి తన మార్కు స్టెప్పులు వేసి అలరిస్తాడు. ఈ సినిమా చిరంజీవి హీరోగా మహేశ్‌భట్‌ దర్శకత్వంలో హిందీలో రీమేక్‌ అయిన సంగతి ఎంతమందికి గుర్తుందో చెప్పలేము. ఒకప్పుడు భారీ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన కుంజుమోహన్, ఏ.ఎం.రత్నంలు ఆ స్థాయి సినిమాలకు దూరమవడం ఒక వాస్తవం. శంకర్‌ 2.0 నుంచి ఏదో ఒకనాటికి విడుదలవుతాడనే ఆశిద్దాం. 
– కె

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top