
మీ పిల్లలకు ఆ విషయం నేర్పించండి: హీరో
బెంగళూరులో వేలాదిమంది సమక్షంలో మహిళలపై సాగిన కీచకపర్వంపై బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ స్పందించాడు.
ముంబై: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి బెంగళూరులో వేలాదిమంది సమక్షంలో మహిళలపై సాగిన కీచకపర్వంపై బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ స్పందించాడు. తల్లిదండ్రులు తమ కొడుకులకు మహిళలను గౌరవించడం గురించి నేర్పించాలని షారుక్ విజ్ఞప్తి చేశాడు.
'సెలెబ్రిటీలు అయినా, సాధారణ ప్రజలయినా మనమందరం తల్లిదండ్రులం. మహిళలను గౌరవించాలని మగపిల్లలకు చిన్నతనం నుంచే నేర్పించాలి. వారు సరైన మార్గంలో నడిచేలా పెంచాలి. నా హృదయంలో మహిళలకు ప్రత్యేక స్థానం ఉంది. నా కుమార్తె, అమ్మ, అమ్మాయిలందరూ నా హృదయానికి దగ్గరగా ఉన్నారు. ఈ విశ్వంలో వీరందరూ చాలా గౌరమైన వారని మనం గ్రహించాలి. గృహిణులైనా ఉద్యోగులైనా మహిళలందరినీ మనమందరం గౌరవించాలి' అని షారుక్ అన్నాడు. బెంగళూరు కీచక ఘటనపై ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. ఆమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ సహా పలువురు దర్శకులు, నటీనటులు ఈ ఘటనను ఖండించారు.