వేసవిలో సవారి

Savari Movie Trailer Launch - Sakshi

నందు, ప్రియాంకా శర్మ జంటగా సాహిత్‌ మోత్కూరి దర్శకత్వంలో సంతోష్‌ మోత్కూరి, నిషాంక్‌ రెడ్డి నిర్మించిన చిత్రం ‘సవారి’. ఫిబ్రవరి 7న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. హీరో శ్రీ విష్ణుతో కలిసి ట్రైలర్‌ను విడుదల చేసిన సుధీర్‌బాబు మాట్లాడుతూ– ‘‘నేను హీరోగా నటించిన ‘సమ్మోహనం’ చిత్రంలో నందు నటించాడు. మొదట అతని పాత్రకు వేరొకరని తీసుకుందామని దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణను అడిగాను. కానీ ఆ పాత్రను నందూయే చేయాలన్నారు. నందు బాగా నటించాడు. నేను, తను దాదాపు ఒకేసారి ఇండస్ట్రీలోకి వచ్చాం.

నందు ఎలాంటి క్యారెక్టర్‌లో అయినా ఒదిగిపోగలడు. ఈ చిత్రదర్శకుడు సాహిత్‌ నాకో కథ చెప్పాడు. ఆ కథ నచ్చినప్పటికీ సినిమా చేయలేకపోయాం. ‘సవారి’ కంటెంట్‌ ఉన్న సినిమాలా కనిపిస్తోంది. సాహిత్‌ భవిష్యత్‌లో పెద్ద దర్శకుడు అవుతాడు’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం నందు పడ్డ కష్టం ఎక్కడికీ పోదు. విడుదల తర్వాత ‘సవారి’ చిత్రం పెద్ద సినిమాగా నిలవాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా పాటలు నాకు బాగా నచ్చాయి’’ అన్నారు శ్రీ విష్ణు. ‘‘డబ్బుల కోసం నేను చాలా సినిమాలు చేశాను.

నటుడిగా అవి నాకు మంచి అనుభవాన్ని ఇచ్చాయి. ‘సమ్మోహనం’ తర్వాత మంచి సినిమా చేయాలనే ఉద్దేశంతో ఏడాది గ్యాప్‌ తీసుకుని ‘సవారి’ చిత్రం చేశాను. తొలి పోస్టర్‌ రిలీజ్‌ నుంచే ఈ సినిమాకు మంచి బజ్‌ వస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఇక నుంచి మంచి సినిమాలే చేస్తాను’’ అన్నారు నందు. ‘‘ఈ సినిమా కోసం అందరం చాలా కష్టపడ్డాం. ఈ సినిమాను మా అన్నయ్య, స్నేహితుడు కలిసి నిర్మిస్తున్నారు. ఇందులోని రెండు పాటలకు 10 మిలియన్‌ (కోటి) వ్యూస్‌ రావడం చిన్న విషయం కాదు’’ అన్నారు సాహిత్‌ మోత్కూరి. ఈ కార్యక్రమంలో శివ, జీవన్, మ్యాడీ, శ్రీకాంత్‌ రెడ్డి, బల్వీందర్, పూర్ణాచారి, కరిముల్లా, ఎడిటర్‌ సంతోష్‌ మేనం పాల్గొన్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top