తూత్తుకూడి ఘటన : ఆ సినిమాలకు సిగ్గు పడుతున్నా

Sathankulam Custodial Deaths : Deeply Regretted Making Five Films Singam director - Sakshi

సింగం డైరెక్టర్ హరి సంచలన నిర్ణయం

ఇకపై అలాంటి సినిమాలు  చేయను  

సాక్షి, చెన్నై: దేశవ్యాప్తంగా ప్రకంపనలు  రేపిన తమిళనాడులోని తూత్తుకూడి, సాతాంకుళంలో పోలీసుల కస్టడీలో తండ్రీ కొడుకుల హత్య ఆరోపణల కేసులో ప్రముఖ తమిళ దర్శకుడు హరి గోపాలకృష్ణన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విధి నిర్వహణలో పోలీసుల సవాళ్లు, వారి ధైర్యసాహసాలను హైలైట్ చేసిన చిత్ర దర్శకుడిగా పేరుగాంచిన  హరి ఇకపై  అలాంటి సినిమాలను చేయనంటూ కీలక ప్రకటన విడుదల చేశారు.(తండ్రీకొడుకుల అనూహ్య మరణం!)

జయరాజ్, బెన్నిక్స్ దారుణ హత్యలపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన హరి ఇలాంటి సంఘటనలు మళ్లీ తమిళనాడులో జరగకూడదు. కొద్దిమంది అధికారుల కారణంగా, మొత్తం పోలీసు శాఖ ప్రతిష్ఠ దెబ్బతింటోందని వ్యాఖ్యానించారు. పోలీసులను ప్రశంసిస్తూ ఐదు సినిమాలు చేసినందుకు చింతిస్తున్నానని ఆయన తన ప్రకటనలో తెలిపారు. హరి దర్శకత్వంలో వచ్చిన సింగం, సింగం-2, సింగం-3, సామి, సామి-2  సినిమాలు  బాక్సాఫీసు వద్ద భారీ విజయాలను నమోదు చేశాయి.  (కస్టడీలో తండ్రి కొడుకుల మృతి‌; ఆందోళనలు)

తమిళనాడులో పోలీస్ కస్టడీలో తండ్రీకొడుకులు మరణించడంపై ప్రజాగ్రహం పెల్లుబికింది. తమిళ సినీ పరిశ్రమ ప్రముఖులు కూడా ఘటనపై ఆగ్రహం  వ్యక్తంచేశారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్  బాధితుల కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే  సింగం హీరో సూర్య ఈ సంఘటనను వ్యవస్థీకృత నేరంగా పేర్కొనగా, ప్రముఖ నటి కుష్బూ దీనిపై విచారణ  చేపట్టి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోవైపు  స్వరకర్త డి ఇమ్మన్ కూడా  ఈ అమానవీయ హింసపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లిద్దరూ భారతదేశపు జార్జ్ ఫ్లాయిడ్స్ అంటూ ఇమ్మన్ ట్వీట్ చేశారు.  కాలా దర్శకుడు పా రంజిత్ స్పందిస్తూ పోలీసుల క్రూరత్వానికి  మరో ప్రాణం కోల్పోకుండా చూసుకోవడం మన కర్తవ్యం. ఎలాంటి భయం లేకుండా ప్రజలపై హింసను ప్రయోగిస్తున్న ప్రతీ పోలీసు అధికారిని నేరస్థుడిగా భావించాలన్నారు.  వీరితోపాటు  హీరోయిన్లు సమంతా, కాజల్ అగర్వాల్, హన్సిక,   అలాగే హీరో విష్ణు విశాల్ కూడా సంతాపం వ్యక్తం చేశారు.  పోలీసుల దారుణాన్ని ఖండించారు.

కాగా లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లఘించారంటూ పి జయరాజ్ (59), ఆయన కుమారుడు బెన్నిక్స్ (31)లను పోలీసులు అరెస్టు చేయగా, రెండు రోజుల అనంతరం పోలీస్ కస్టడీలో అనుమానాస్పద పరిస్థితుల్లో వీరు మరణించడం కలకలం రేపింది. గుండెపోటుతో మరణించారని పోలీసులు ప్రకటించగా, తీవ్రంగా హింసించి, చంపేశారంటూ నిరసనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top