వైజాగ్‌లో వేడుక చేస్తే సినిమా హిట్టే

Sampath Nandi Special Chit Chat With Sakshi

బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): రచ్చ, బెంగాల్‌ టైగర్‌ వంటి సినిమాలతో సత్తాచాటారు సంపత్‌ నంది. దర్శకుడిగా తెలుగు సినీపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కమర్షియల్, మాస్‌ అంశాలను మేళవించి ప్రేక్షకులకు అందించడంలో ఈయన దిట్ట. తాను సహ నిర్మాతగా రూపొందించిన పేపర్‌బాయ్‌ చిత్రం ఈనెల 31న విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రొమోషన్‌లో భాగంగా నగరానికి వచ్చిన ఆయన ఆదివారం సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు.

పేపర్‌బాయ్‌ ప్రేమలో పడితేఏమిటి అనేది కథ
ప్రేమను గెలిపించుకోవటం కోసం పెద్దలతో గొడవులపెట్టుకోవటం.. ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవటం లేదా ఆత్మహత్యలు చేసుకోవటం వంటివి ఈ రోజుల్లో చూస్తుంటాం. కానీ అలా కాకుండా పెద్దలను ఎలా ఒప్పించి ప్రేమను సాధించుకోవచ్చు అనేదే పేపర్‌ బోయ్‌ సినిమా. నేను బెంగాల్‌ టైగర్‌ సినిమా చేస్తున్నా సమయంలోనే నిర్మాత వెంకట్‌కు ఈ కథ చెప్పాను. కథ అంతా పూర్తిగా సిద్ధం చేయటానికి ఏడాది సమయం పట్టింది. ఆ తరువాత 2017లో షూటింగ్‌ మొదలిపెట్టాం. షూటింగ్‌ చాలా వరకు హైదరాబాద్‌లో చేశాం. కొన్ని సన్నివేషాలు కేరళ, గోవాల్లో జరిగాయి. పేపర్‌బాయ్‌ అంటే ఏదో చదువు రాని వాడు కాదు. బాధ్యతతో బీటెక్‌ చేసిన వ్యక్తి ఎంచుకున్న ఒక వృత్తి ఈ పేపర్‌బాయ్‌. ఒక ఇంటికి రోజు పేపర్‌ వేసే వ్యక్తి ఆ ఇంట్లో ఉన్న అమ్మాయితో ప్రేమలో పడితే తలెత్తే సమస్యలను పేపర్‌బాయ్‌లో చూస్తారు. ఇది విలువులతో కూడినసినిమా. తండ్రి కొడుకులు, తాతలు ఇలా అన్ని సంబంధాలు ఇందులో ఆకట్టుకుంటాయి. ప్రేమ కోసం ఒకరి కోసం ఒకరు చేసుకున్న త్యాగాలు ఈ చిత్రంలో స్పష్టంగా వివరించటం జరిగింది. సాధారణంగా ప్రేమ చిత్రాలు అంటే యూత్‌ మాత్రమే ఇష్టపడతారు. కానీ పేపర్‌బాయ్‌ సినిమా మాత్రం కుటుంబం మొత్తం వెళ్లి చూడదగ్గది. హీరో సంతోష్, హీరోయిన్‌ రియా సుమాన్‌ పాత్రలు మన చుట్టూ ఉన్న మనషులు వలే ఉంటాయి. సినిమా అయినా నిజజీవితంలా ఉంటుంది.

యూ సర్టిఫికెట్‌ సినిమా తీస్తా అనుకోలేదు
నేను ఇప్పటి వరకూ తీసిన ప్రతి సినిమా ఏ సర్టిఫికేట్‌ లేదా ఏ/యూ సర్టిఫికేట్‌వి. కాని మొదటి సారి యూ సర్టిఫికెట్‌ను సెన్సర్‌ బోర్డు ఈ సినిమాకు మంజూరు చేసింది. ఇలాంటి సినిమాలను నేను తీస్తానని అనుకోలేదు. సెన్సర్‌ బోర్డ్‌ సభ్యులు కూడా ఒక కట్‌ లేకుండా అనుమతి ఇచ్చారు. ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. గీతా ఆర్ట్స్‌ బేనర్‌పై ఈ మధ్యకాలంలో కొనుగోలు చేసిన చిత్రం పేపర్‌బాయ్‌. మా సినిమా కథనచ్చి ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ సౌందర్‌ రాజన్‌ ఈ చిత్రానికి పనిచేయటానికి ముందుకు వచ్చారు.

మెగాస్టార్‌తో సినిమా తీస్తా
మెగాస్టార్‌ చిరంజీవితో ఒక సినిమా తీయాలనేది నాకు జీవిత లక్ష్యం. ఎప్పటికైనా ఆయనతో కచ్చితంగా తీసితీరితా. ఆయన కోసం మంచి కథను సిద్ధం చేస్తున్నా. అది పూర్తి అయిన తరువాత ఆయనకు చెప్తాను. మరో పెద్ద హీరోతో కూడా సినిమా తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అన్ని కుదిరితే ఈ సెప్టెంబర్‌లో  షూటింగ్‌ ప్రారంభవుతుంది.

సినీ పరిశ్రమకు వైజాగ్‌ సెంట్‌మెంట్‌
పేపర్‌బాయ్‌ సినిమా ట్రైలర్‌ చూసి మహేష్‌ బాబు, ప్రభాస్‌ ట్వీటర్‌ ద్వారా మెచ్చుకున్నారు. వారి ట్వీట్స్‌తో మా సినిమాకు చాలా ప్రచారం లభించింది. వైజాగ్‌లో సినిమాకు సంబంధించిన ఏదో ఒక కార్యక్రమం చేస్తే హిట్‌ అవటం గ్యారంటీ. ఇది సినిమా పరిశ్రమ అంతా సెంట్‌మెంట్‌గా పెట్టుకుంది. అందుకే ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల కార్యక్రమాలు ఇక్కడే నిర్వహిస్తున్నారు. రచ్చ సినిమా సమయంలో కూడా మేము వైజాగ్‌ వచ్చాం. అది పెద్ద హిట్‌ అయింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top