నింగికేగిన‘రెడ్‌ స్టార్‌’

Revolutionary Actor Madala Ranga Rao Passed Away - Sakshi

విప్లవ నటుడు మాదాల రంగారావు కన్నుమూత 

హృద్రోగ సమస్యతో ఆదివారం తుదిశ్వాస 

అభ్యుదయ చిత్రాలతో సినీరంగంపై చెరగని ముద్ర 

నేడు ఫిల్మ్‌నగర్‌ మహాప్రస్థానంలో అంత్యక్రియలు

సాక్షి, హైదరాబాద్‌/ఒంగోలు కల్చరల్‌:  వెండి తెరకు ‘ఎర్ర’రంగులద్దిన విప్లవ శంఖం మూగబోయింది. సినీ వినీలాకాశంలో ‘రెడ్‌ స్టార్‌’గా వెలుగొందిన ఎర్ర సూరీడు అస్తమించాడు. విప్లవ, అభ్యుదయ భావాలతో ఓ తరాన్ని ఉర్రూతలూగించిన ప్రముఖ నటు డు, నిర్మాత మాదాల రంగారావు (70) ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో అనారోగ్యంతో కన్నుమూశారు. హృద్రోగ సమస్యతో బాధపడుతు న్న ఆయన్ను చికిత్స కోసం 19న స్టార్‌ ఆస్పత్రిలో చేర్చారు. 

ఆయన కుమారుడు డాక్టర్‌ మాదాల రవి, ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ రమేశ్‌ గూడపాటి పర్యవేక్షణలో చికిత్స అందించారు. ఆయన్ను బతికించేందుకు వైద్యులు శతవిధాల ప్రయత్నించినా ఫలి తం లేకపోయింది. రెండు మాసాల కిందట గుండెపోటు రావడంతో రంగారావుకు చైన్నైలో చికిత్స అం దించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమా ర్తె ఉన్నారు. సోమవారం ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో మాదాల అంత్యక్రియలు జరగనున్నాయి. 

నాటకాల నుంచి సినీరంగం వైపు.. 
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం మైనంపాడులో 1948 మే 25న మాదాల రంగారావు భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. ఒంగోలు మున్సిపల్‌ హైస్కూలులో విద్యనభ్యసించారు. అనంతరం కళాకారుల పుట్టినిల్లైన సీఎస్‌ఆర్‌ శర్మ కాలేజీలో బీఏ చదివారు. నల్లూరి వెంకటేశ్వర్లు సాహచర్యంలో కళాకారుడిగా ఎదిగారు. అభ్యుదయ చిత్రాలకు నూతన ఒరవడి దిద్దిన టి.కృష్ణ, పోకూరు బాబూరావు, వందేమాతరం శ్రీనివాస్, నర్రాతోపాటు ధర్మవరపు సుబ్రహ్మణ్యం వంటివారు సినీరంగం వైపు ఆకర్షితులు కావడానికి మాదాలే స్ఫూర్తిగా నిలిచారు. సినీరంగంలోకి వచ్చే ముందు అనేక నాటకాల్లో నటించిన ఆయన మొదటిసారిగా నవతరం ప్రొడక్షన్స్‌ పతాకంపై 1980లో ‘యువతరం కదిలింది’ సినిమా తీశారు. 

ఆ చిత్రం శత దినోత్సవం జరుపుకోవడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బంగారు నంది పురస్కారం గెల్చుకుంది. వామపక్ష భావజాలం కలిగిన రంగారావు.. అవినీతి, అణచివేత లాంటి సామాజిక సమస్యలను ప్రతిబింబిస్తూ అనేక సినిమాలు రూపొందించారు. ‘ఎర్రమల్లెలు’, ‘విప్లవశంఖం’, ‘స్వరాజ్యం’, ‘ఎర్ర సూర్యుడు’, ‘ఎర్ర పావురాలు’, ‘జనం మనం’, ‘ప్రజాశక్తి’తదితర చిత్రాల్లో నటించి రెడ్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. 80వ దశకంలో ప్రేమకథా చిత్రాల హవా నడుస్తున్నా.. విప్లవాత్మక చిత్రాలను నిర్మించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. 

కళ ప్రజల కోసం.. 
ప్రజా కళాకారుడిగా, ప్రజా నాట్యమండలి నీడన మా దాల ప్రజలను చైతన్యపరిచే చిత్రాలనే నిర్మించారు. కళ కళ కోసం కాదు ప్రజల కోసం అనే గరికిపాటి రాజారావు మార్గంలో పయనించారు. సినిమాల ద్వా రా వచ్చిన లాభాలలో కొంత భాగాన్ని కమ్యూనిస్టు పార్టీకి ఇవ్వడంతోపాటు ప్రజాసంక్షేమ కార్యక్రమాల కు, దానధర్మాలకు వెచ్చించేవారు. గతంలో సినిమాలన్నీ స్టూడియోల్లోనే రూపుదిద్దుకునేవి. ఆ సంప్రదాయాన్ని తోసిరాజని సినిమా మొత్తాన్ని ప్రజల మధ్య రూపొందించిన ఘనత మాదాలకే దక్కుతుంది. 

ప్రముఖుల నివాళి 
ఆదివారం ఉదయం మాదాల పార్థివ దేహాన్ని ఫిలింనగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. మంత్రి తలసానితో పాటు సినీ నటులు చిరంజీవి, శ్రీకాంత్, శివాజీరాజా, నరేశ్, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, వందేమాతరం శ్రీనివాస్, వామపక్షాల నేతలు నారాయణ, తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్‌ రెడ్డి ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. పవన్‌ కల్యాణ్‌ ఆయన మృతి పట్ల ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు బాగ్‌ లింగంపల్లిలోని ఎస్వీకేలో అభిమానుల సందర్శనార్థం మాదాల భౌతిక కాయాన్ని ఉంచనున్నారు.


మాదాల రంగారావు పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్న చిరంజీవి

చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానం: జగన్‌ 
మాదాల రంగారావు మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. వామపక్ష భావజాలంతో కూడిన సినిమాలతో కీర్తి గడించిన రంగారావు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును, స్థానాన్ని ఏర్పరచుకున్నారని పేర్కొన్నారు. మాదాల కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

కేసీఆర్‌ సంతాపం 
మాదాల మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సామాజిక స్పృహ కలిగిన చిత్రాలు తీయడం ద్వారా మాదాల అనేక మందికి స్ఫూర్తి కలిగించారని గుర్తు చేసుకున్నారు.

ఉద్యమానికి తీరనిలోటు 
మాదాల రంగారావు మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి, కళారంగానికి తీరని లోటు. అభ్యుదయ, వామపక్ష భావాలు కలిగిన ఎన్నో సినిమాలు నిర్మించి ఆయన ప్రజలను చైతన్యపరిచారు. 
    – తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి


మాదాల రంగారావు పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్న మంత్రి తలసాని, చిత్రంలో మాదాల రవి.

    

 
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top