‘రంగుల రాట్నం’ మూవీ రివ్యూ

Rangula Ratnam Movie Review - Sakshi

టైటిల్ : రంగుల రాట్నం
జానర్ : రొమాంటిక్ డ్రామా
తారాగణం : రాజ్‌ తరుణ్‌, చిత్రా శుక్లా, సితార, ప్రియదర్శి
సంగీతం : శ్రీచరణ్ పాకల
దర్శకత్వం : శ్రీ రంజని
నిర్మాత : నాగార్జున అక్కినేని

ఉయ్యాల జంపాల సినిమాతో అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై హీరోగా వెండితెరకు పరిచయం అయిన రాజ్‌ తరుణ్‌ లాంగ్ గ్యాప్‌ తరువాత మరోసారి అదే బ్యానర్‌లో నటించిన సినిమా రంగుల రాట్నం. శ్రీ రంజనిని దర్శకురాలిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ పోటి మధ్య ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది..?

కథ :
విష్ణు (రాజ్ తరుణ్‌) బాధ్యత తెలియకుండా పెరిగిన కుర్రాడు. తల్లి(సితార) గారాభం చేయటంతో ఏ పనీ సొంతం గా చేసుకోకుండా అన్నింటికీ తల్లి మీద ఆధారపడుతుంటాడు. పెళ్లి చేస్తే బాధ్యత తెలుస్తుందని అమ్మాయిని చూడటం మొదలు పెడుతుంది విష్ణు తల్లి. అయితే అదే సమయంలో ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో పనిచేసే కీర్తి(చిత్రా శుక్లా) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు విష్ణు, ఆ అమ్మాయితో పరిచయం పెంచుకునేందుకు అమ్మ పుట్టిన రోజు పార్టీ అని కీర్తిని ఇంటికి పిలుస్తాడు. అలా వారిద్దరి పరిచయం స్నేహంగా మారుతుంది. కానీ కీర్తికి ప్రేమ విషయం చెప్పేలోపే విష్ణు తల్లి చనిపోతుంది. తల్లి చనిపోయిన బాధలో ఉన్న విష్ణు ఆ బాధనుంచి ఎలా బయటపడ్డాడు..? కీర్తికి ఎలా దగ్గరయ్యాడు..? కీర్తి ఓకె చెప్పిన తరువాత విష్ణు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు..? చివరకు ఎలా ఒక్కటయ్యారు..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
గత ఏడాది కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు లాంటి సినిమాలతో ఆకట్టుకున్న రాజ్ తరుణ్ కొత్త ఏడాదిలో రంగుల రాట్నం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తనకు అలవాటైన మేనరిజమ్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కథలో బలమైన సన్నివేశాలు లేకపోవటంతో నటుడిగా పెద్దగా ప్రూవ్ చేసుకునే అవకాశం దక్కలేదు. సెంటిమెంట్ సీన్స్‌లో మాత్రం మంచి పరిణతి కనబరిచాడు. హీరోయిన్‌ చిత్రా శుక్లా పరవాలేదనిపించింది. తల్లి పాత్రకు సీనియర్ నటి సితార ప్రాణం పోసింది. హీరో ఫ్రెండ్‌ పాత్రలో ప్రియదర్శి మంచి నటన కనబరిచాడు. అక్కడక్కడ ప్రియదర్శి కామెడీ కాస్త నవ్విస్తుంది.

విశ్లేషణ :
తొలి చిత్రంగా ఎలాంటి ప్రయోగాలకు పోకుండా ఓ సాధారణ ప్రేమకథను ఎంచుకున్న దర్శకురాలు శ్రీరంజని, ఆ కథను ఆసక్తికరంగా తెర మీద ఆవిష్కరించటంలో పూర్తిగా విఫలమయ్యారు. సినిమాను ఆసక్తికరంగా ప్రారంభించినా.. ఏ దశలోనూ ఆడియన్‌ను కథలో లీనం చేయలేకపోయారు. బలమైన ఎమోషన్స్, ఆసక్తికరమైన సన్నివేశాలు లేకపోవటం నిరాశకలిగిస్తుంది. తల్లి కొడుకుల మధ్య ఎమోషనల్ సీన్స్ మరింత బలంగా చూపించేందుకు అవకాశం ఉన్నా.. అలాంటి సన్నివేశాలపై పెద్దగా దృష్టిపెట్టినట్టుగా అనిపించదు. శ్రీచరణ్ అందించిన సంగీతం పరవాలేదనిపిస్తుంది. ఎడిటింగ్ పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :
సితార పాత్ర
నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్ :
కథా కథనం
స్లో నేరేషన్‌

- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top