ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులపై మండిపడ్డ రంగోలీ

Rangoli Chandel React On 65 Filmfare Awards - Sakshi

అత్యంత ప్రతిష్టాత్మక ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులపై బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ సోదరి రంగోలీ చందేల్‌ స్పందించారు. ఈ అవార్డుల్లో ప్రతిభ కలిగిన ఎంతోమందికి అన్యాయం జరిగిందంటూ ట్విటర్‌ వేదికగా ఆమె ఘాటు విమర్శలు చేశారు. 65వ ఫిలింఫేర్‌ అవార్డుల కార్యక్రమం శనివారం అస్సాంలోని గువాహటిలో అ‍ట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఆవార్డుల్లో బాలీవుడ్‌ మూవీ ‘గల్లీబాయ్‌’ చిత్రానికి అవార్డుల పంట పండింది. అత్యధిక విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. అయితే  ఈ సందర్భంగా రంగోలీ అలియాభట్‌పై విమర్శలు గుప్పించారు. అలియా కంటే బాగా నటించే హీరోయిన్లు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారని దుయ్యబట్టారు. ఇక గల్లీబాయ్‌లో ఆమె నటన సాధారణంగా ఉందని.. అలియా ప్రధాన పాత్రలో నటించినప్పటికీ ఆమె సహాయక నటి లాగా కనిపించారని ఆరోపించారు. అలాంటి ఆమెకు ఉత్తమ నటి అవార్డు ఎలా ఇచ్చారని మండిపడ్డారు.  చదవండి: ఘనంగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌.. 'గల్లీ బాయ్‌'కి అవార్డుల పంట

బాలీవుడ్‌లోని మూవీ మాఫియా గురించి కంగన చాలా సందర్భాల్లో స్పందించిందని.. అందుకే తనకు, తాను నటించిన చిత్రాలకు అవార్డులు ఇవ్వలేదని రంగోలీ ఆరోపించారు. అలాగే స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌2 చిత్రానికి గానూ ఉత్తమ డెబ్యూ నటి అవార్డు అనన్యపాండేకు లభించడాన్ని ఆమె తప్పుబట్టారు. ‘పటాఖా’ సినిమాలో నటించిన రాధిక మదన్‌కు ఇస్తే బాగుండేదని అన్నారు. రాధికకు అవార్డు ఇస్తే కొత్త వారిని ప్రొత్సహించినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. రాధిక.. అనన్యపాండే కంటే అద్భుతంగా నటించిందని రంగోలీ ట్వీట్‌ చేశారు. ఇక రంగోలీ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top