కటౌట్‌ ఎవరిది?

Rajinikanths Petta and Ajiths Viswasam movies release - Sakshi

ఎవరి స్టోరీ వారిదే.. ఎవరి స్టైల్‌ వారిదే. ఎవరి ప్లే వారిదే.. ఎవరి పవర్‌ వారిదే.కానీ ఏదో మ్యాచ్‌ అయింది. ఎక్కడో కంపారిజన్‌ మొదలైంది.రజనీ డైలాగ్స్‌ అజిత్‌ ఫ్యాన్స్‌కి వచ్చి తగిలాయి. అజిత్‌ డైలాగ్స్‌ రజనీ ఫ్యాన్స్‌ని టార్గెట్‌ చేశాయి.నిజానికి ఎవరూ ఎవర్నీ టార్గెట్‌ చెయ్యలేదు. ఫ్యాన్సే వెళ్లి టార్గెట్‌ అయ్యారు. పేట్ట, విశ్వాసం.. ఒకే రోజు రిలీజ్‌ అవడంతో..హీరోలకేం కాలేదు కానీ..ఫ్యాన్స్‌ అనే పెద్ద కటౌట్‌ కూలిపోయింది!

‘‘ఇరవైమందిని పంపించాను. అందర్నీ చితక్కొట్టి తరిమాడు.’’ ‘‘ఎవర్రా వాడు?’’‘‘పేరు కాళీ. ఇంకే డీటెయిల్స్‌ తెలీదు.’’ ‘‘వాడు కూర్చున్న తీరును బట్టే పసిగట్టగలను. వాడు భయపడేవాడా కాదా అని.’’ ‘‘వీడు మామూలోడు కాదు మయీ’’ అవును మామూలోడు కాదు! వాడికి సెంటిమెంట్‌లు ఉండవు. ‘‘రేయ్‌.. ఎవరికైనా పెళ్లాం పిల్లలని సెంటిమెంట్‌లు ఉంటే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోండి. మండిపోతుందిక్కడ. దొరికారా.. భస్మమే’’  కుర్చీలో కూర్చొని తల వెనక్కి చేతులు పెట్టుకుని ఊగిపోతున్నాడు. ఆ డైలాగ్‌కి నిన్నట్నుంచీ తమిళనాడు ఊగిపోతోంది. ‘పేట్ట’ (తెలుగులో పేట) లోని ఆ ఇరవైమందిని కొట్టినవాడు, కాళీ అనే పేరు తప్ప ఇంకే డీటెయిల్సూ తెలియనివ్వనివాడు, ప్రత్యర్థి దొరికితే మాడ్చి మసిచేసేవాడు.

అతడే.. రజనీకాంత్‌. ∙ ∙ ‘‘పేరు తూకు దొరై. ఊరు కొడువులపట్టి. తేని డిస్ట్రిక్ట్‌. భార్య నిరంజన. కూతురు పేరు శ్వేత. రా రా చూసుకుందాం’’అడ్రస్‌ చెప్పేశాడు. ఎవరిని అతడు చాలెంజ్‌ చేసింది? ‘‘నిన్ను వేసేస్తా’’నని తిరుగుతున్నవాడిని. ఎవరు ఆ తిరుగుతున్నది? తన కథలో తనే హీరో అని చెప్పుకున్నవాడిని. మరి చాలెంజ్‌ చేసినతను? తన కథలో తను విలన్‌ అని చెప్పినవాడు. ‘కంటి చుక్క రాలిపడని సంపన్నుడు లేడు. జీవితంలో ఒక్కసారైన నవ్వని నిరుపేద లేడు’.. విలన్‌ ఫిలాసఫీ. మనిషి భూమిని నమ్ముకుని నిలబడితే, భూమి నమ్ముకున్న మనిషి పక్కన నిలుచుని, ఆ మనిషి కోసం రక్తాన్ని కన్నీటిలా కురిపించిన చల్లని మేఘం ఆ విలన్‌.  సడన్‌గా ఓ రోజు..తన కథలో తనే హీరో అయినవాడు వచ్చాడు లాండ్‌ లాగేసుకోడానికి. తన కథలో తనే విలన్‌ అయినవాడూ వచ్చాడు ‘‘దిస్‌ లాండ్‌ బిలాంగ్స్‌ టు పేదవాళ్లు. చెయ్యేస్తే నరికేస్తా. స్టాంప్‌ పేపర్లు చింపేస్తా’’ అని. మాటా మాటా నడిచింది. ఫైటింగ్‌కి మొదలవబోతోంది. ‘నెంబర్‌ వన్‌ పొజిషనే నా ఐడెంటిటీ’ అన్నాడు సెల్ఫ్‌ స్టెయిల్డ్‌ హీరో. నవ్వాడు విలన్‌. ఇద్దరికీ పడింది. థియేటర్‌ అదిరిపోయింది.

నిన్నట్నుంచీ తమిళనాడు అదిరిపోతూనే ఉంది. హీరోనని చెప్పుకున్న విలన్‌.. జగపతిబాబు.విలన్‌నని చెప్పుకున్న హీరో.. అజిత్‌. సినిమా పేరు ‘విశ్వాసం’ అదీ నిన్ననే రిలీజ్‌ అయింది. ∙ ∙  ‘పేట్ట’, ‘విశ్వాసం’.. రెండూ బాక్సులు బద్దలు కొట్టేస్తున్నాయి. ‘పేట్ట’లో రజనీ పాత రజనీలా రెచ్చిపోయాడు. ‘విశ్వాసం’లో అజిత్‌ కొత్త అజిత్‌లా ఉత్సాహం తెచ్చాడు. మరి.. బాక్సులు బద్దలవుతుంటే.. ఫ్యాన్స్‌ కదా విజిల్స్‌ వెయ్యాలి? పోలీసులెందుకు విజిల్స్‌ వేస్తున్నారు. ఎందుకు లాఠీచార్జి చేస్తున్నారు. ఎందుకు డిస్పర్స్‌ అంటున్నారు. ఎందుకు వన్‌ఫార్టీఫోర్‌ సెక్షన్‌ విధించారు. ఎందుకంటే.. బాక్సు బద్దలయ్యే చప్పుడును మించిపోయింది ఫ్యాన్స్‌ గొడవ. మా హీరో గొప్పంటే మా హీరో గొప్పనడంతో మొదలైంది స్ట్రీట్‌ ఫైట్‌. కటౌట్‌లు విరిగాయి. వాల్‌పోస్టర్‌ల మీద పేడముద్దలు పడ్డాయి.

రజనీ, అజిత్‌.. ఎవరో ఒకరే ఉండాలి స్టేట్‌లో అన్నంతగా ఆయన అభిమానులు, ఈయన అభిమానులు కత్తిపోట్లు పొడుచుకున్నారు. వేలూరులోని ఒక థియేటర్‌ బయటి కొట్లాట ఇది. పదిహేను మందికి గాయాలయ్యాయి. నలుగురు హాస్పిటల్‌ పాలయ్యారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. నిన్న విడుదలైన రెండు పిక్చర్‌లూ హిట్‌ కొట్టినట్లే. రజనీ, అజిత్‌ హ్యాపీగా ఉండి ఉంటారు. అభిమానులు కూడా సినిమా ఎంజాయ్‌ చేసి హ్యాపీగా ఉంటే బాగుండేది. ∙ ∙  రజనీ, విజయ్‌సేతుపతి, నవాజుద్దీన్‌ సిద్ధికీ, సిమ్రాన్, త్రిష, సింహా, శశికుమార్, సనంత్, మేఘా ఆకాష్, మోమనన్‌.. మంచి స్టారింగ్‌ ఉంది పేట్టాలో. సంగీతం అనిరు«ద్‌. కెమెరా తిరునావక్కరుసు. ఫ్యాన్స్‌కి కిక్‌ ఎక్కించే టీమ్‌ ఇదంతా. ‘‘నా పని అయిపోయిందనుకున్నార్రా?’ అని అడుగుతారు రజనీ ఎంట్రీ ఇస్తూ. ఆ ప్రశ్న కథలోని విలన్‌ని అడిగినట్లు ఉండదు రజనీ ఫ్యాన్స్‌కి. అజిత్‌ ఫ్యాన్స్‌ని అడిగినట్లు ఉంటుంది. అజిత్‌ ఫ్యాన్స్‌ రజనీ సినిమాలను చాలాకాలంగా ట్రోల్‌ చేస్తున్నారు. అందుకు రిటార్ట్‌గా ఈ డైలాగ్‌ కొట్టినట్టు ఫ్యాన్స్‌ అర్థం చేసుకున్నట్లున్నారు! బయటికొచ్చి, అజిత్‌ ఫ్యాన్స్‌ని చూసి సేమ్‌ డైలాగ్, సేమ్‌ అదే స్టెయిల్‌లో కొట్టారు.

అజిత్‌ అభిమానులకు రోషం వచ్చింది. అసలే ఈ సినిమా తీసింది రజనీ ‘డైహార్డ్‌ ఫాన్‌’ కార్తీక్‌ సుబ్బరాజ్‌. కనుక తమనే టార్గెట్‌ చేశాడని అజిత్‌ అభిమానులు అనుకున్నారు. పేట్ట ఫ్లెక్సీలను చింపేయడం కోసం తీసిన కత్తుల్ని పేట్ట ఫ్యాన్‌ వైపు తిప్పారు. అభిమానం షార్ప్‌గా ఉంటుంది కానీ, ఇంత షార్ప్‌గా ఉండడం తగదు. ∙ ∙  ‘విశ్వాసం’ చిత్రంలో మీసం తిప్పుతాడు అజిత్‌. పంచె ఎగ్గడతాడు. కత్తులు దూస్తాడు. నడక స్టెయిల్‌గా ఉంటుంది. అవన్నీ రజనీకి దీటుగా ఉంటాయి! అతడి కోపం రజనీ కోపంలా ఉంటుంది. అతడి డైలాగ్‌ డెలివరీ రజనీ డెలివరీలా ఉంటుంది. అతడి ఫైటింగ్, అతడి నవ్వు, అతడి రొమాన్స్, ఆ థ్రిల్స్‌ అవన్నీ! రజనీలా అంటే.. రజనీ ఫ్యాన్స్‌ని లక్ష్యం చేసినట్లుగా. అయితే అది నిజం కాదు. స్టోరీ, స్క్రీన్‌ప్లే అలాంటివి. రజనీకీ, అజిత్‌కీ ఒకేలా వర్కవుట్‌ అయ్యేలా ఉన్నాయి. కథను ఐదుగురు రాశారు. శివ, మణికందన్, శావరి, భాగ్యరాజ్, చంద్రన్‌. శివ మెయిన్‌గా డైరెక్షన్‌.

కెమెరా వేత్రి. ఆయనదంతా యాక్షన్‌ టేకింగ్‌. సైలెన్స్‌ని కూడా తన లెన్స్‌లతో యాక్ట్‌ చేయిస్తారు. ‘పేట్ట’లో నవాజుద్దీన్‌ సిద్ధికీతో రజనీ, ‘విశ్వాసం’లో జగపతిబాబుతో అజిత్‌ తలపడడం, సవాల్‌ విసరడం, పంచ్‌ డైలాగ్స్‌ కొట్టడం పోటా పోటీగా ఉంటాయి. అందుకే ఫ్యాన్స్‌కి తమ హీరో సినిమా మీదకన్నా, అవతలి వాళ్ల హీరో మూవీ మీద ధ్యాస పడి కంపేరిజన్‌ ఎక్కువైంది. కాన్‌ఫ్లిక్టూ మొదలైంది. ∙ ∙  అభిమానించడం మంచి విషయం. ఆ రెండు గంటల సినిమా చూసి ఎంజాయ్‌ చేసి వచ్చేడం మరీ మంచి విషయం. అభిమానాన్ని దురభిమానం స్థాయికి పెంచుకుని అవతలి హీరోని కించపరచడం, ఆ హీరో అభిమానుల్ని రెచ్చగొట్టడం మంచి విషయం కాదు. కథ కోసం రాసిన ఆవేశాన్ని, కోపాన్ని, ప్రతీకారాన్నీ, పంటికి పన్నును, కంటికి కన్నును అభిమానానికి అప్లయ్‌ చేసుకోకూడదు. 
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top