సెన్సేషనల్‌ న్యూస్‌

Rajinikanth Movie in Kamal Haasan Production Soon - Sakshi

సినిమా: ప్రతి చిన్న విషయానికి సంచలనం అంటుంటాం. అన్నంత మాత్రాన ప్రతిదీ సంచలనం కాదు. ఇప్పుడు చెప్పేది నిజంగా సంచలన వార్తే అవుతుంది. అది ఏమై ఉంటుంది? కమలహాసన్‌ రాజకీయాల గురించా? లేక రజనీకాంత్‌ రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు వార్తా? లేక కమల్, రజనీ రాజకీయపరంగా కలిసి పని చేయబోతున్నారా? ఇవన్నీ ఇంతకుముందు విన్నవే కదా! మరేంటి సంచలన న్యూస్‌? అంటే కచ్చితంగా కమల్‌హాసన్, రజనీకాంత్‌లకు సంబధించినదే. కమలహాసన్‌ మక్కళ్‌ నీది మయ్యం పార్టీని ప్రారంభించి ఇప్పటికే రాజకీయాల్లో ఉన్న విషయం తెలిసిందే. అయినా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన శంకర్‌ దర్శకత్వంలో ఇండియన్‌–2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే చిత్రీకరణలో ఉంది. దీని తరువాత కూడా తలైవన్‌ ఇరుకిండ్రాన్‌ చిత్రాలో నటించనున్నట్లు కమలహాసన్‌ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఆ తరువాత నటనకు స్వస్తి చెప్పి పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక రజనీకాంత్‌ విషయానికి వస్తే ఈయన రాజకీయాల్లోకి వస్తున్నానంటున్నారు. అయితే ఇంకా పార్టీని మాత్రం ప్రకటించడంలో నాన్చుడు ధోరణిని అవలంబిస్తూనే ఉన్నారు.

ప్రస్తుతం ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో దర్బార్‌ చిత్రాన్ని పూర్తి చేసిన రజనీకాంత్‌ తాజాగా శివ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రం గురించి ఇప్పటికే అధికారం, అనధికారం అంటే బోలెడంత ప్రచారం హోరెత్తుతోంది. అయితే ఈ చిత్రం తరువాత కూడా రజనీకాంత్‌ నటించనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే మరో పక్క 2021లో జరగనున్న శాసనసభ ఎన్నికలకు రజనీకాంత్‌ సిద్ధం అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. కాగా ఇటీవల కమలహాసన్‌ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో రజనీకాంత్‌ పాల్గొన్నారు. అప్పుడు పలు ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి. ఆ వేదికపై రజనీకాంత్‌ గురించి కమలహాసన్‌ మాట్లాడుతూ తమది 40 ఏళ్ల స్నేహం అని పేర్కొన్నారు. అంతేకాదు రజనీకాంత్‌ రాజకీయరంగ ప్రవేశం చేసినా, నటనను కంటిన్యూ చేస్తారని చెప్పారు. ఇక రజనీకాంత్‌ కూడా రాబోయే కాలంలో పలు ఆసక్తి కరమైన సంఘటనలు జరుగుతాయని అన్నారు. అంతటితో ఆగకుండా అవసరం అయితే తామిద్దరం కలిసి పనిచేస్తామని పేర్కొంటూ రాజకీయవర్గాల్లో ప్రకంపనలు సృష్టించారు. కాగా రాజకీయంగా కమల్, రజనీ కలుస్తారో? లేదో గానీ, సినిమాలో మరోసారి కలవనున్నారన్నది తాజా సంచలన వార్త.

కమలహాసన్, రజనీకాంత్‌ ఆదిలో పలు చిత్రాల్లో కలిసి నటించారు. అయితే కొంతకాలం తరువాత ఎవరికి వారు సొంత ఇమేజ్‌ను సంపాదించుకోవడంతో ఇకపై కలిసి నటించకూడదని వారిద్దరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు. అలా 40 ఏళ్ల నుంచి విడి విడిగానే నటిస్తున్నారు. అలాంటిది ఇప్పుడు ఒక చిత్రంలో కలిసి పనిచేయడానికి సిద్ధం అవుతున్నట్లు తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న వార్త. కాగా యువ నటుడు లోకేశ్‌ కనకరాజ్‌ కార్తీ హీరోగా తెరకెక్కించిన ఖైదీ చిత్రం ఆ మధ్య విడుదలై మంచి విజయంతో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఈ చిత్రాన్ని చూసిన రజనీకాంత్‌ ఫోన్‌లో దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌ను అభినందించారు. నటుడు విజయ్‌ 64వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న లోకేశ్‌ కనకరాజ్‌ ఈ చిత్ర షెడ్యూల్‌ పూర్తి అయిన తరువాత తనను అభినందించిన నటుడు రజనీకాంత్‌ను నేరుగా కలిసి కృతజ్ఞతలు చెప్పారు. అయితే వీరి కలయిక ఆసక్తిని రేకెత్తించింది.

రజనీని దర్శకత్వం వహించనున్న లోకేశ్‌ కనకరాజ్‌ వంటి ప్రచారం హల్‌చల్‌ చేసింది. అయితే అప్పుడు వారి కలయికలో చాలా విషయాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. అందులో ముఖ్యంగా దర్శకుడు లోకేశ్‌కనకరాజ్‌ నటుడు రజనీకాంత్‌కు ఒక కథ వినిపించినట్లు, అది ఆయనకు నచ్చినట్లు టాక్‌. ఇక మరో సంచలన అంశం ఏమిటంటే లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ నటించే చిత్రాన్ని కమలహాసన్‌ తన రాజ్‌కమల్‌ సినీ ఇంటర్నేషనల్‌ సంస్థలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. అంతే కాదు ఈ సంచలన చిత్రంలో కమల్‌ కూడా గెస్ట్‌ పాత్రలో మెరవనున్నట్లు టాక్‌ స్ప్రెడ్‌ అవుతోంది. శివ దర్శకత్వంలో నటించిన తరువాత రజనీకాంత్‌ ఈ సెన్సేషనల్‌ చిత్రంలో నటించే అవకాశం ఉందని టాక్‌ వైరల్‌ అవుతోంది. మరి ఇందులో నిజం ఎంత అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top