డబుల్‌ మీనింగ్‌ కాదు.. సింగిల్‌ మీనింగ్‌లోనే రాశాను

Rahul ravindran director interview about manmadhudu-2 - Sakshi

‘‘నేను నటుడిగా చేసినప్పుడు దర్శకుడు ఏది చెబితే అది చేసేవాడిని. దర్శకుడిగా మారాక నాలో మానసిక ఆందోళన పెరిగింది. తర్వాతి రోజు షూటింగ్‌ ఉందంటే నాకు నిద్రపట్టదు. దర్శకుడిగా నేను నిద్రపోవడం నేర్చుకోవాలి’’ అన్నారు నటుడు–దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌. నాగార్జున, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘మన్మథుడు 2’.  నాగార్జున, పి. కిరణ్‌ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా రాహుల్‌ చెప్పిన విశేషాలు.

► నాలుగు తరాలుగా పోర్చుగల్‌లో నివాసం ఉంటున్న ఓ తెలుగు కుటుంబానికి చెందిన కథ ఇది. ఇందులో నాగార్జునగారి క్యారెక్టర్‌కు డబుల్‌ లైఫ్‌ ఉంటుంది. అమ్మాయిలపై గౌరవం ఉంటుంది. కానీ కొన్ని సంఘటనల వల్ల వారితో ఎమోషనల్‌ ఎటాచ్‌మెంట్‌ను ఇష్టపడరు. నా సెకండ్‌ సినిమాకే నాగార్జున వంటి స్టార్‌ హీరోతో చేయడం లక్కీ అనిపించింది.

► మా సినిమాలో కొన్ని డబుల్‌æమీనింగ్‌ డైలాగ్స్‌ ఉన్నాయంటున్నారు. కానీ నేను వాటిని సింగిల్‌ మీనింగ్‌లోనే రాశాను. అవి నాటీగా ఉంటాయి కానీ ఇబ్బందిగా ఉండవు. హై రొమాంటిక్‌ సీన్‌తో టిక్కెట్లు అమ్మాలని ఒక్క షాట్‌ కూడా తీయలేదు. ‘పిల్లలకు కోచింగ్‌ ఇవ్వాల్సిన వయసులో నువ్వు బ్యాటింగ్‌కు దిగుతావా?’ అని రావు రమేష్‌గారు ట్రైలర్‌లో చెప్పిన డైలాగ్‌ కూడా చాలా నార్మల్‌గా రాసిందే. హీరో వయసు గురించి పంచ్‌ వేద్దామని రాసిన డైలాగ్‌ అది. ఓ సీన్‌ని డెవలప్‌ చేస్తున్నప్పుడు సమంత అతిథి పాత్రలో అయితే బాగుంటుందనిపించింది. నాగార్జునగారు కూడా అదే అన్నారు.

► యాక్టర్‌గా నార్మల్‌ సినిమాల్లో నటించను. నా దర్శకత్వంలో దగ్గుబాటి అభిరామ్‌ హీరోగా సినిమా చేయబోతున్నాడనే వార్తల్లో నిజం లేదు. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లో ఓ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి.

చిన్మయి (రాహుల్‌ భార్య) నాకు మంచి ఎమోషనల్‌ సపోర్టింగ్‌ సిస్టమ్‌. తన సపోర్ట్‌ లేకుండా నేను లేను. సంగీతమే ఆమె ప్రపంచం. సోషల్‌ మీడియాలో చిన్మయి ప్రస్తావించిన అంశాలు కొందరికి అర్థం కానప్పుడు స్పందిస్తాను. ప్రతి విషయానికీ స్పందించను.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top