బాహుబలి తర్వాత శరభ

R Narayana Murthy Emotional Speech about Sarabha Movie Trailer launch - Sakshi

ఆర్‌. నారాయణమూర్తి

‘‘నరసింహారావు నా సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశారు. ఆయన దర్శకత్వం వహించిన ‘శరభ’ సినిమాలో విజువల్‌ ఎఫెక్ట్స్‌ అద్భుతంగా ఉన్నాయి. ‘బాహుబలి’ తర్వాత నాకు విజువల్‌ పరంగా బాగా నచ్చిన చిత్రం ‘శరభ’’ అని నటుడు–దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి అన్నారు. డా.జయప్రద, ఆకాశ్‌కుమార్, మిస్తి చక్రవర్తి, నెపోలియన్, నాజర్, పునీత్‌ ఇస్సార్, తనికెళ్ల భరణి, ఎల్బీ శ్రీరామ్, పొన్‌వణ్ణన్, సాయాజీ షిండే, అవినాష్, పృథ్వీ తదితరులు కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘శరభ’.

యన్‌. నరసింహారావు దర్శకత్వంలో అశ్వనీకుమార్‌ సహదేవ్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ చిత్రం మేకింగ్‌ వీడియోను ఆర్‌.నారాయణమూర్తి, ట్రైలర్‌ను నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు రిలీజ్‌ చేశారు. నరసింహారావు మాట్లాడుతూ– ‘‘కొత్త తరహా చిత్రమిది. ‘భక్త ప్రహ్లాద’ తర్వాత అంత గొప్పగా ఆడుతుందని నమ్ముతున్నా. ఈ సినిమా టెక్నీషియన్లందరూ కలిసి నన్ను శంకర్‌ స్థాయిలో నిలబెట్టేలా కృషి చేశారు’’ అన్నారు. ‘‘ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా’’ అన్నారు అశ్వనీకుమార్‌ సహదేవ్‌. ‘‘సినిమా వాడిగా పుట్టడం గొప్ప విషయం.

నా బ్యానర్‌లో తొలి సినిమాగా ఎన్టీఆర్‌గారి ‘జీవిత ఖైదు’ విడుదల చేశాను. ఏఎన్నార్‌గారితోనూ చేశాను. మధ్యలో చాలా సినిమాలు చేశా. ఇప్పుడు ‘శరభ’ రిలీజ్‌ చేస్తున్నా. నేను జయప్రదగారికి పెద్ద ఫ్యాన్‌’’ అని చదలవాడ శ్రీనివాసరావు అన్నారు. ‘‘నేను ఫోన్‌ చేయగానే నా మీద నమ్మకంతో ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్న చదలవాడ శ్రీనివాసరావుగారికి ధన్యవాదాలు. నేను తెలుగమ్మాయిని అని చెప్పుకోవడానికి గర్వపడతాను. ఎన్ని భాషల్లో నటించినా తెలుగులో నటించినప్పుడు ప్రత్యేకమైన సంతృప్తి ఉంటుంది. నాకు తెలుగు ఇండస్ట్రీ అమ్మలాంటిది’’ అన్నారు జయప్రద. మిస్తి చక్రవర్తి పాల్గొన్నారు.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top