ఓషోస్‌

Priyanka Chopras next Producing and starring in film on Osho - Sakshi

ఓసోస్‌.. అంత కథ ఉందా!?! ఓషో శిష్యురాలి మీద తీసేంత సినిమా కథ!ప్రతి మగాడి విజయం వెనుకా ఒక స్త్రీ ఉంటుందంటారు. ఈ.. స్త్రీ వెనుక ఓషో ఉన్నాడు. అప్పుడది ఓషో కథ అవుతుంది కానీ.. ఆ స్త్రీ కథ అవుతుందా?అవుతుంది. ఆమె మామూలు స్త్రీ కాదు. అందం చందం, క్రైమ్‌ డివైన్‌ మిక్స్‌ అయిన స్త్రీ. పేరు షీలా. ఆమె పేరు మీదే ప్రియాంకా చోప్రా ఇప్పుడుబయోపిక్‌ తియ్యబోతున్నారు.  

ఈ ఏడాది వాలెంటైన్స్‌డేకి ఒక రోజు ముందు హాలీవుడ్‌ మూవీ ‘ఈజెంటిట్‌ రొమాంటిక్‌’  విడుదల అవుతోంది. సెటైరికల్‌ ఫ్యాంటసీ కామెడీ. నటాలీ అనే బొద్దుగా ఉండే ఒక ఆర్కిటెక్ట్‌.. న్యూయార్క్‌లో తన కెరీర్‌ని నిర్మించుకుంటూ ఉంటుంది. రొమాన్స్, కామెడీ ఉన్న సినిమాలంటే ఆమెకు పిచ్చి. వాటిని చూసి ఊహల్లోకి వెళ్లిపోతుంటుంది. అలాగని ప్రేమంటే ఆమెకు ఇష్టమేమీ ఉండదు. ఓ రోజు సబ్‌వేలో వెళుతుంటే ఓ దొంగను తప్పించుకోబోయి, ఓ గుంజకు కొట్టుకుని కింద పడి స్పృహ కోల్పోతుంది. తర్వాత కళ్లు తెరిచి చూసేసరికి వేరే ఏదో లోకంలో ఉంటుంది. అది ప్రేమలోకం! ఆ లోకంలో కూడా తను ప్రేమలో పడదు.

అయితే తన ప్రేమలో పడే వ్యక్తి కోసం నటాలీ వెదుకుతుంటుంది.  నటాలీ ప్రేమకథకు ఇవాళ్టి మన ‘ఫ్యామిలీ’ స్టోరీకి ఏ కొంచమో తప్ప ఏమాత్రం సంబంధం లేదు. ఆ ‘ఏ కొంచెమో’.. ప్రియాంకా చోప్రా! ‘ఈజెంటిట్‌ రొమాంటిక్‌’ చిత్రంలో ప్రియాంక చిన్న పాత్ర వేశారు. చిన్నదే కానీ, సినిమాకు కీలకమైనది. యోగా అంబాసిడర్‌ క్యారెక్టర్‌. ఇంచుమించు అదే పాత్రలో త్వరలోనే పూర్తి స్థాయి హీరోయిన్‌గా ఓ హాలీవుడ్‌ చిత్రంలో ప్రియాంక నటించబోతున్నారు. అందులో ప్రియాంక ఆధ్యాత్మిక ఆశ్రమవాసిగా కనిపిస్తారు. 76 ఏళ్ల  ఆస్కార్‌ అవార్డు దర్శకుడు బ్యారీ లెవిన్‌సన్‌ ఆ చిత్రానికి డైరెక్టర్‌. నిర్మాత ప్రియాంకే. షూటింగ్‌ మొదలు కాలేదు. టైటిల్‌ ఖరారైంది. 

‘మా ఆనంద్‌ షీలా’! 
‘ఓషో’ భగవాన్‌ రజనీష్‌ భక్తురాలే ఆనంద్‌ షీలా. రజనీష్‌ ఆశ్రమంలో చేరాక ‘మా ఆనంద్‌ షీలా’ అయ్యారామె. షీలా ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో ఉంటున్నారు. ఈ 69 ఏళ్ల వయసులో ఆమె ఎలాంటి జీవితం గడుపుతున్నారో ఎవరికీ తెలియదు. (రెండు నర్సింగ్‌ హోమ్‌లైతే నడుపుతున్నారు). భక్తురాలు ఆధ్యాత్మిక జీవితమే కదా గడుపుతారు. కావచ్చు. అయితే నేరస్థురాలిగా ఆమె గడిపిన జీవితమే ఎక్కువ. ఆ పాపాలేమైనా ఆమెను వెంటాడుతూ ఉంటాయా?! చెప్పలేం. ప్రియాంక నిర్మించబోతున్న షీలా బయోపిక్‌లో షీలా ఆధ్యాత్మిక జీవితంతో పాటు, షీలా నేరగ్రస్థ జీవనం రెండూ మిళితమై ఉండబోతున్నాయి. భక్తిభావం, నేరస్వభావం రెండూ కలగలిసి ఉన్న స్త్రీ మూర్తి షీలాను రెండు సబ్జెక్టులుగా విడదీసి సినిమా తియ్యడం సాధ్యం కాదు కాబట్టి! రజనీష్‌ ధ్యానముద్రలతో ఆయనకు దగ్గరై, ఆయనకు మరింత దగ్గరవడానికి దారి తప్పి తనకు తెలియకుండానే నేర ప్రపంచంలోకి వెళ్లిపోయిన  భక్తురాలు షీలా. 

అటెంప్ట్‌ టు మర్డర్, సెకండ్‌–డిగ్రీ అసాల్ట్, ఇల్లీగల్‌ వైర్‌–టాపింగ్, ఆర్సన్, ఇమిగ్రేషన్‌ ఫ్రాడ్‌.. ఇన్ని కేసులలో ఆమె దోషి. వీటన్నిటికన్నా పెద్ద నేరం మరొకటి ఉంది. మరొక నేరం కాదు. అగ్రరాజ్యాన్నే దిగ్భ్రాంతిపరచిన  నేరం!భారత ప్రధాని ఇందిరాగాంధీ హత్య. 1984లో ప్రపంచానికి పెద్ద వార్త. శ్రీమతి గాంధీ హత్య జరగకుండా ఉండి ఉంటే, అదే ఏడాది యు.ఎస్‌లో జరిగిన ఒక ఘటన ప్రపంచానికి పెద్ద వార్త అయి ఉండేది! ఆ ఏడాది ఒరెగాన్‌ రాష్ట్రంలోని డాలెస్‌ సిటీలో అకస్మాత్తుగా 750 మందికి పైగా మంచాన పడ్డారు. వాళ్లంతా లోకల్‌గా ఉన్న పది రెస్టారెంట్‌లలో సలాడ్‌ తిన్నవారే. అంతకన్నా ముఖ్యం.. వాళ్లంతా వాస్కో కౌంటీ ఎన్నికల్లో ఓటేయవలసిన వాళ్లు.

అయితే ఆ ఈటింగ్‌కి, ఈ ఓటింగ్‌కి మధ్య లింకు ఉంటుందని ఎవరు ఊహిస్తారు?మెడికల్‌ రిపోర్ట్‌లు చూస్తే ఆ పది రెస్టారెంట్‌లలో సలాడ్స్‌ తిని జబ్బున పడిన ఆ ఏడొందల యాభై మందిలో ‘సాల్మొనెల్లా’ బ్యాక్టీరియా బయటపడింది! టైఫాయిడ్‌ వచ్చేది ఈ బ్యాక్టీరియా వల్లనే. తాగిన నీరు, తీసుకున్న ఆహారం కలుషితమైనదైతే సాల్మొనెల్లా ఒంట్లోకి ప్రవేశించి, మనిషిని కుంగదీస్తుంది. నూటనాలుగు డిగ్రీల జ్వరం వస్తుంది. చెమటలు పడతాయి. విరేచనాలు అవుతాయి. చర్మంపై దద్దుర్లు వస్తాయి. ఒంటిపై గులాబీ రంగు మచ్చలు కనిపిస్తాయి. జ్వరం తగ్గనని మొరాయిస్తుంటుంది. లేవలేరు. కూర్చోలేరు. పడుకుని ఉండడమే. ఇంట్లో పడుకుని ఉన్నవాళ్ల దగ్గరికి బ్యాలెట్‌ బాక్సు రాదు కదా. అలా ఆ మొత్తం ఓట్లన్నీ పోలవకుండా అలా మంచంపైనే ఉండిపోయాయి! ఎవరికి లాభం? పోలీస్‌ ఎంక్వయిరీ మొదలైంది.  మొదలైంది కానీ, వెంటనే మొదలు కాలేదు. మొదలు కావాలంటే మొదట అనుమానం రావాలి.

డాలెస్‌ ప్రాంతంలో ఒకేసారి ఇన్ని ఓట్లు ఎందుకు పోల్‌ అవలేదని ఆరా తీస్తే ఈ టైఫాయిడ్‌ కేసులు బయటపడ్డాయి. టైఫాయిడ్‌ ఎందుకొచ్చిందని ఆరా తీస్తే రెస్టారెంట్‌లలో తిన్న ఫుడ్‌ బయటపడింది. రెస్టారెంట్‌లన్నిటిలో ఒకేసారి ఫుడ్‌ ఎలా కలుషితం అయిందని ఆరా దీస్తే ‘మా’ ఆనంద్‌ షీలా’ బయటపడింది. ఆమెను ఇంటరాగేట్‌ చేస్తే.. అసలు విషయం బయటపడింది! ‘మా’ ఆనంద్‌ షీలా.. భగవాన్‌ శ్రీ రజనీష్‌  రైట్‌ హ్యాండ్‌. ఒరెగాన్‌ స్టేట్‌ వాస్కో కౌంటీలో ‘రజనీష్‌పురం’ ఉంది. రజనీష్‌పురంలో రజనీష్‌ లేనప్పుడు ఆదేశాలన్నీ ‘మా’ ఆనంద్‌ షీలావే. అలా ఆమె ఇచ్చిన ఒక రహస్య ఆదేశంతోనే డాలెస్‌ రెస్టారెంట్‌లలోని ఆహార పదార్థాలలోకి ‘సాల్మొనెల్లా’ బ్యాక్టీరియా చేరింది!బ్యాక్టీరియా తనకై తను చేరితే కలుషితం. మనుషులు చేర్చితే.. బయోటెర్రర్‌ ఎటాక్‌. యు.ఎస్‌. ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

అమెరికా చరిత్రలోనే తొలి బయోటెర్రర్‌ ఎటాక్‌! తొలి మాత్రమే కాదు, చివరిది కూడా. మళ్లీ ఇంతవరకు అలాంటి ఎటాక్‌ అక్కడ జరగలేదు. వాస్కో కౌంటీ ఎన్నికల్లో రజనీష్‌ అనుచరులు కొందరు పోటీ చేస్తున్నారు. వారి గెలుపు అవకాశాలను పెంచడానికే ‘మా’ ఆనంద్‌ షీలా బయోటెర్రర్‌ ఎటాక్‌ చేయించారని విచారణలో బయటపడింది. ‘మా’ షీలాకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష పడింది. 39 నెలల శిక్షాకాలం తర్వాత మంచి ప్రవర్తనపై విడుదలైంది. స్విట్జర్లాండ్‌ వెళ్లిపోయింది. శ్రీమతి గాంధీ హత్య జరగకుండా ఉండి ఉంటే అమెరికా బయోటెర్రర్‌ దాడి ఘటన పెద్ద వార్తే అయి ఉండేదని అనుకోవడం ఎందుకంటే.. ప్రపంచానికి బయోటెర్రర్‌ దాడులు కొత్త కాకపోయినా, అమెరికాలో జరగడం కొత్తే. అమెరికాపై అలాంటి ప్రయోగం చెయ్యాలంటే గట్స్‌ ఉండాలి. అయితే ‘మా’ ఆనంద్‌ షీలా కు గట్స్‌ కంటే కూడా భగవాన్‌ రజనీష్‌ మీద ఆరాధనా భావమే ఎక్కువగా ఉంది. అందుకే ఆయన కోసం ఏమైనా చేయాలనుకుంది. చేసింది. 

భగవాన్‌ శ్రీ ‘ఓషో’ రజనీష్‌ది ఇండియా. మధ్యప్రదేశ్‌లో జన్మించారు. అతడికన్నా పద్దెనిమిదేళ్లు చిన్నదైన మా ఆనంద్‌ షీలాది కూడా ఇండియానే. పుట్టింది గుజరాత్‌లో. ఈ రెండు స్వదేశీ ఆత్మలు విదేశాల్లో ఏకమయ్యాయి. షీలా అసలు పేరు షీలా అంబాలాల్‌. రజనీష్‌ ఆశ్రమానికి వచ్చాక ‘మా’ ఆనంద్‌ షీలా అయింది. అతడికి ప్రియ శిష్యురాలైంది. ఈ ఆనంద్‌ ఎవరో తెలీదు. బహుశా షీలాలోని ఆనంద భావన అయుంటుంది. ప్రియాంక ఈమె జీవితకథను సినిమాగా తీయడానికి ఎందుకు ఎంచుకున్నారో వివరాలు వెల్లడి కాలేదు. ‘ఎలెన్‌ షో’ అతిథిగా వెళ్లినప్పుడు మా ఆనంద్‌ షీలాపై తను సినిమా తియ్యబోతున్నట్లు మాత్రమే చెప్పారు.

బహుశా.. ఓషోలోని దివ్యతేజస్సు షీలాను ఆకర్షించిన విధంగానే.. ‘ఈజెంటిట్‌ రొమాంటిక్‌’ చిత్రంలోని యోగా అంబాసిడర్‌ పాత్ర ప్రియాంకను షీలాపై సినిమా తీసేలా ప్రేరేపించి ఉండొచ్చు. ‘ఓషో’ సన్నిధిలో షీలా 1981 నుంచి 1985 వరకు ఉన్నారు. ఆ మధ్యకాలంలో ఆమె చాలా చురుగ్గా ఉన్నారు. వివిధ దేశాలలోని ప్రతినిధులతో ఓషో తరఫున చాలాసార్లు ఆమే సంప్రదింపులు, చర్చలు, సమావేశాలు జరిపేవారు. ఓషో మాటల్లోని ఆకర్షణ శక్తి.. షీలా చూపుల్లోని సమ్మోహన శక్తి ఆ నాలుగేళ్లూ ఈ భూగోళాన్ని ధ్యానముద్ర వేయించాయి. ఓషోపై 1974 నుంచి 2018 వరకు దాదాపు పది సినిమాలు వచ్చాయి. ఏడాది క్రితం కూడా నెట్‌ఫ్లిక్స్‌లో ఓషో జీవితం ‘వైల్డ్‌ వైల్డ్‌ కంట్రీ’ అనే పేరుతో ఆరు పార్టులుగా రిలీజ్‌ అయింది. వాటన్నిటికీ నేరేషన్‌ షీలానే. షీలాపై తొలిసారి వస్తున్న చిత్రం మాత్రం ప్రియాంక తియ్యబోతున్నదే.                      

రజనీష్‌పురం
షీలా తండ్రే షీలాను భగవాన్‌ రజనీష్‌కు పరిచయం చేశారు. ఆ తర్వాత ఆమె ఓషోకు ప్రియ శిష్యురాలు అయ్యారు. పుణెలోని ‘ఓషో మెడిటేషన్‌ సెంటర్‌’కు, ఓరెగాన్‌లోని ‘రజనీష్‌పురం’ ఆశ్రమానికి మధ్య షీలా తరచు ప్రయాణిస్తూ ఓషో సూచనల మేరకు విధులు నిర్వర్తిస్తుండేవారు. యు.ఎస్‌.లోని ఓరెగాన్‌ ప్రశాంతంగా ఉండే విశాలమైన ఎడారి  ప్రదేశం. జనాభా తక్కువ. రజనీష్‌పురంలోని ఆశ్రమం ధ్యానానికి అపరిచితులు వచ్చిపోతుండటంపై.. లోపల అసాంఘిక, అవినీతి కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికులు ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేయడంతో రజనీష్‌పురం ఉనికి కష్టం అయింది.

షీలా రంగంలోకి దిగి, స్థానిక మండలిలో ఎన్నికల్లో ఓషో అనుచరులను పోటీకి నిలబెట్టారు. వాళ్లు గెలిస్తే కనుక ఫిర్యాదులు చేసేవారిని అడ్డుకోవచ్చని ఆమె ఆలోచన. ప్రత్యర్థులకు ఓట్లు పడకుండా ఉండడం కోసం ఆమె చివరికి బయోటెర్రర్‌ ఎటాక్‌కి కూడా తెగించారు. 1990లో రజనీష్‌ చనిపోయాక, అంతకుముందే షీలా స్విట్జర్లాండ్‌ వెళ్లిపోయారు. ఆ తర్వాతి నుంచి రజనీష్‌పురం తన వైభవాన్ని కోల్పోతూ వచ్చి ఆ స్థలం కూడా  చేతులు మారిపోయింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top