
ప్రియాంకకు కష్ట సమయం..
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నివాసంలో విషాదం చోటుచేసుకుంది.ఆమె అమ్మమ్మ శుక్రవారం ఉదయం మృతి చెందింది.
ముంబై : బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నివాసంలో విషాదం చోటుచేసుకుంది. ఆమె అమ్మమ్మ శుక్రవారం ఉదయం మృతి చెందింది. చిన్నప్పటి నుంచి ప్రియాంక 'నానీ'కి చాలా క్లోజ్. షూటింగుల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆమె తన అమ్మమ్మకు సంబంధించి ప్రతి విషయంలో శ్రద్ధ తీసుకుంటుంది. వీలు కుదిరినప్పుడల్లా నానీ కోసం సమయం కేటాయించేది. ఇటీవల ప్రియాంక పద్మశ్రీ అవార్డు అందుకుంటున్న సమయంలో కూడా ఆమె అమ్మమ్మ అక్కడే ఉన్నారు. ఎన్నోసార్లు తన నానీతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతుంటుంది ప్రియాంక.
కాగా ప్రియాంక తండ్రి క్యాన్సర్ తో 2013 జూన్లో మరణించారు. ఆమె తన తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. నాన్నతో కలిసున్న ఓ మరపురాని ఫొటోని గురువారం తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది ప్రియాంక. అంతలోనే ఆమెకు ఎంతో అనుబంధం ఉన్న నానీ శాశ్వతంగా దూరమవడం విచారకరం. ప్రియాంకకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలంటూ ఆమె సన్నిహితులు సందేశాల ద్వారా విచారం వ్యక్తం చేస్తున్నారు.