
తమిళసినిమా: నటి ప్రియమణి తన భర్త అలాంటి వాడు కాదు అంటోంది. సినిమాకు చెందిన వారు ముఖ్యంగా కథానాయికలకు ఒక్కో సీజన్‌లో ఒక్కో భాషలో అవకాశాలు తలుపు తడతాయి. ఈ బెంగళూర్ బ్యూటీ తొలుత తమిళం, తెలుగు భాషల్లో నటిగా రంగప్రవేశం చేసింది. ఆ తరువాత మాతృభాష కన్నడంలో నటిగా అడుగుపెట్టింది. ఇక మలయాళంలోనూ నటించేసి హిందీ చిత్రం రంగ అనుభవాన్నీ పొందింది. ఇలా కథానాయకిగా పలు భాషలలో ఒక్కో సీజన్‌లో రాణించిన మూడు పదుల వయసు పైబడిన ప్రియమణి గత నెల తన చిరకాల ప్రేమికుడు ముస్తఫాను పెళ్లి చేసుకుంది. పెళ్లి తరువాత సైలెంట్ అయిన ఈ భామ ఇటీవల తన పెళ్లి, భర్త, నటనల గురించి పెదవి విప్పింది.
ప్రియమణి మాట్లాడుతూ.. ఒక సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో తనకు ముస్తఫాకు పరిచయం ఏర్పడిందని చెప్పింది. అయితే చూడగానే ఆయనతో ప్రేమలో పడిపోలేదని, కొంత కాలం ఫ్రెండ్స్‌గా మెలిగామని తెలిపింది. అప్పుడు ముస్తఫా తనపై చూపిన అభిమానం ఆయన్ని ప్రేమించేలా చేసిందని చెప్పింది. పెళ్లి తరువాత నటనకు దూరంగా ఉండాలన్న ఆలోచన తనకు లేదని చెప్పింది. అదే విధంగా పెళ్లి అయిన మూడో రోజునే షూటింగ్‌కు వెళ్లాననీ చెప్పింది. భార్య వంటింటికే పరిమితం కావాలనే మనస్తత్వం తన భర్తది కాదని పేర్కొంది. ఆయన పరిపూర్ణ సమ్మతితోనే తాను వివాహానంతరం నటిస్తున్నానని చెప్పింది. ముస్లిం మతస్తుడైన ముస్తఫాను తాను పెళ్లి చేసుకోవడాన్ని చాలా మంది వ్యతిరేకించారని చెప్పింది. నా భర్త, నా కుటుంబం, నా జీవితం ఇవే ఆమెకు ముఖ్యం అని ప్రియమణి పేర్కొంది. ప్రస్తుతం ఈ అమ్మడికి తమిళం, తెలుగు భాషల్లో అవకాశాలు లేకపోవడంతో కన్నడం, మలయాళం భాషల్లో నటిస్తోంది.