చావు అంచులదాకా వెళ్లా : ప్రీతి జింటా

Preity Zinta Shares Her Death Near Experience - Sakshi

‘సునామీ సృష్టించిన బీభత్సానికి దాదాపు చావు అంచుల దాకా వెళ్లాను. ఆరోజు ఫుకెట్‌లో ఉన్నాం. నా కళ్ల ముందే నాతోపాటే వచ్చిన ఎంతో మంది స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. నేనొక్కదాన్నే బతికి బయటపడ్డాను. వారందరి ఆత్మకు శాంతి చేకూరాలి. నిజంగా అది చాలా దుర్దినం’  అంటూ భయానక అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు నటి ప్రీతి జింటా.

ఇండియాటుడే కాన్‌క్లేవ్‌ ఈస్ట్‌ 2018 సమ్మిట్‌లో పాల్గొన్న ప్రీతి... 2004, డిసెంబరు 26 తనకు మిగిల్చిన చేదు ఙ్ఞాపకాల గురించి చెప్పుకొచ్చారు. ‘ నిజంగా ఆరోజు చనిపోతానేమో అనుకున్నా. కానీ ఆ దేవుడి దీవెనలు నాకు ఉన్నాయి. నాతో పాటు తీర ప్రాంతాల అందాలను చూడటానికి వచ్చిన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటన నాలో చాలా మార్పు తీసుకొచ్చింది. అలాంటి పరిస్థితుల్లో కూడా బతికి బయటపడ్డానంటే ఏదో కారణం ఉంటుందని బలంగా నమ్మాను. పునర్జన్మ పొందినందుకు గుర్తుగా ఏదో ఒకటి సాధించాలనుకున్నాను. ఐపీఎల్‌ ప్రాంఛైజీ ఓనర్‌గా, నటిగా ప్రస్తుతం ఇలా మీ ముందున్నాను’ అంటూ ప్రీతి భావోద్వేగానికి లోనయ్యారు.

కాగా 2004, డిసెంబరు 26న హిందూ మహాసముద్రంలో సునామీ చెలరేగిన విషయం తెలిసిందే. 14 దేశాల్లోని దాదాపు 2 లక్షల ముప్పై వేల మందిని ఆ రాకాసి అలలు పొట్టనబెట్టుకున్నాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top