మహానటి చిత్రం చూసిన తరువాత..! | PC Aditya On Kathi Kantha Rao Biopic | Sakshi
Sakshi News home page

రాకుమారుడుగా కాంతారావు బయోపిక్‌

Nov 12 2018 8:45 AM | Updated on Nov 12 2018 11:48 AM

PC Aditya On Kathi Kantha Rao Biopic - Sakshi

తమిళసినిమా: ఇప్పుడు సినీరంగంలోబయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తోందని చెప్పవచ్చు. ఒక పక్క దివంగత దివంగత నేత వైఎస్‌ఆర్‌ జీవిత చరిత్రతో యాత్ర అనే చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలోనే తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. అదేవిధంగా ఎన్‌టీఆర్‌ జీవిత చరిత్ర కథానాయకుడు పేరుతో తెరకెక్కుతోంది. ఆయన బయోపిక్‌తోనే లక్ష్మీస్‌ ఎన్‌టీఆర్‌ పేరుతో మరో చిత్రానికి దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ సన్నాహాలు చేస్తున్నారు. తమిళంలో ఎంజీఆర్‌ జీవిత చరిత్ర నిర్మాణంలో ఉంది. జయలలిత బయోపిక్‌ కోసం ముగ్గురు, నలుగురు దర్శకులు రెడీ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి సమకాలీన నటుడు, కత్తి వీరుడుగా పేరు గాంచిన దివంగత నటుడు కాంతారావు జీవిత చరిత్రను వెండితెరకెక్కించడానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.

దీన్ని చంద్రాధిత్య ఫిలిం ఫ్యాక్టరి పతాకంపై పీసీ. ఆదిత్య స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్నారు. ఈయన కాంతారావు ప్రధాన పాత్రలో నటించిన పిల్లలు కాదు పిడుగులు చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత 10 చిత్రాలు చేశారు. అందులో ది స్పైసెస్‌ ఆఫ్‌ లిబర్టీ అనే ఆంగ్ల చిత్రం, దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవిత కథతో కూడిన వైఎస్‌ ప్రజాప్రస్థానం వంటి చిత్రాలు కూడా చోటు చేసుకోవడం విశేషం. అంతే కాదు 100 రోజుల్లో 100 లఘు చిత్రాలు చేసి లిమ్కా బుక్‌లోకి ఎక్కిన దర్శకుడీయన. తొలి చిత్రంతోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డును అందుకున్న పీసీ.ఆదిత్యకు కాంతారావుతో సుమారు 25 ఏళ్ల అనుబంధం ఉంది. ఆ అభిమానంతోనే ఆయన బయోపిక్‌ను నేటి తరానికి తెలియజేయాలన్న సంకల్పంతో రాకుమారుడు పేరుతో తెరకెక్కించనున్నట్లు ఆయన సాక్షికి తెలిపారు.

ఆ వివరాలు ఆయన తెలియజేస్తూ కాంతారావు ఎన్‌టీఆర్, ఏఎన్‌ఆర్‌ల సమాకాలీన నటుడన్నారు. అలాంటి గొప్ప నటుడి జీవితంలో ఎన్నో ఊహించని మలుపులు చోటుచేసుకున్నాయన్నారు. కాంతారావు జీవితం సమాజానికి మంచి సందేశానిచ్చేదిగా ఉంటుందన్నారు. కాంతారావు రాసుకున్న ఆత్మకథ ఆధారంగా ఈ చిత్రం ఉంటుందన్నారు. ఆయన సినీరంగ ప్రవేశం నుంచి, తుది శ్వాస విడిచినంత వరకూ చిత్ర కథ నడుస్తుందన్నారు. కాంతారావు జీవితంలోని వెలుగు చీకటిలను ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. రాకుమారుడు పేరుతో తెరకెక్కించనున్న ఇందులో ఆయన సమకాలీన నటులు ఎన్‌టీఆర్, ఏఎన్‌ఆర్‌లతో పాటు తమిళనటుడ ఎంజీఆర్, నటి రాజశ్రీ,కృష్ణకుమారి లాంటి ప్రముఖ నటుల పాత్రలు చోటు చేసుకుంటాయని తెలిపారు.

మహానటి చిత్రం చూసిన తరువాత కాంతారావు బయోపిక్‌ను తెరకెక్కించాలన్న ఆలోచన తనకు కలిగిందన్నారు. వంద చిత్రాల్లో కథానాయకుడిగా నటించిన కాంతారావు, ఆ తరువాత చిత్ర నిర్మాణం చేపట్టి అపజయాల పాలయ్యారన్నారు. ఆయన వారసులు చేయాల్సిన ఈ చిత్రాన్ని ఒక దత్తపుత్రుడిగా తాను మహా యజ్ఞంగా తన భుజస్కంధాలపై వేసుకున్నానని అన్నారు. తెలుగు సినిమాకు రామారావు ,నాగేశ్వరరావు రెండు కళ్లు అయితే మధ్యలో తిలకం కాంతారావు అని ప్రఖ్యాత రచయిత సి.నారాయణ రెడ్డి ఒక సందర్భంలో అన్నారన్నారు. అలాంటి నటుడు కాంతారావు బయోపిక్‌ను ఆయన జయంతి రోజు ఈ నెల 16న చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించి ఆయన వర్ధంతి సందర్భంగా మార్చి 22న తెరపైకి తీసుకురావడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇందులో కాంతారావు పాత్రకు అఖిల్‌సన్ని అనే నవ నటుడిని పరిచయం చేస్తున్నామని,  అదేవిధంగా ఎన్‌టీఆర్‌ పాత్రకు భాస్కర్‌ అనే నటుడిని, ఎంజీఆర్‌ పాత్రకు చెన్నైకి చెందిన సురేశ్‌కుమార్‌ అనే నటుడిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఏఎన్‌ఆర్‌ పాత్రకు నటుడిని ఎంపిక చేయాల్సి ఉందని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement