ఇమేజ్‌కు కాలం చెల్లిందన్న అక్షయ్ కుమార్ | Pay per image for the period was backed by Akshay Kumar | Sakshi
Sakshi News home page

ఇమేజ్‌కు కాలం చెల్లిందన్న అక్షయ్ కుమార్

Sep 27 2013 12:29 AM | Updated on Apr 3 2019 6:23 PM

ఇమేజ్‌కు కాలం చెల్లిందన్న అక్షయ్ కుమార్ - Sakshi

ఇమేజ్‌కు కాలం చెల్లిందన్న అక్షయ్ కుమార్

కథానాయకుల పేరుమీద సినిమాలు నడిచే రోజులు పోయాయని, కథ, కథనం, తెరకెక్కించే విధానమే ప్రస్తుతం సినిమాలను ఆడిస్తోందని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ అభిప్రాయపడ్డాడు.

న్యూఢిల్లీ: కథానాయకుల పేరుమీద సినిమాలు నడిచే రోజులు పోయాయని, కథ, కథనం, తెరకెక్కించే విధానమే ప్రస్తుతం సినిమాలను ఆడిస్తోందని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ అభిప్రాయపడ్డాడు. ఎంతపెద్ద సూపర్‌స్టార్‌ను హీరోగా పెట్టి సినిమా తీసినా అందులో కొత్తదనం, ప్రత్యేకత లేకపోతే ప్రేక్షకులు నిర్మోహమాటంగా తిరస్కరిస్తున్నారని చెప్పాడు. సినిమాకు పేరుకు సూపర్‌స్టార్ పేరును జోడిస్తే సినిమా దానంతట అదే హిట్ అవుతుందన్న అభిప్రాయాన్ని ఇక నుంచి నిర్మాతలు, దర్శకులు మార్చుకోవాలని సూచించాడు. 
 
 మంచి సినిమాలే ఆడతాయని, కొత్తదనం ఉన్న చిత్రాలకే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారన్నాడు. మంచి కథ, స్క్రీన్‌ప్లేలే ప్రస్తుతం బాక్సాఫీస్‌ను ఏలుతున్నాయని, ఇది చాలా మంచి పరిణామమని ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్షయ్ చెప్పాడు. అంతేకాక కథానాయకులను విభాగాల వారీగా విభజించడాన్ని కూడా తాను సమర్థించలేనన్నాడు. వంద కోట్ల హీరో, రెండువందల కోట్ల హీరో అంటూ బాలీవుడ్‌లో ఇటీవల కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చిందని, కోట్లను సంపాదించేది కథ మాత్రమేనన్నాడు. ఈ రోజుల్లో కథ, కథనం ప్రధాన్యత పెరిగిందని, హీరోలు,  హీరోయిన్లు సాధారణ అంశాలైపోయాయన్నారు. 
 
 కొత్తగా బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న కుర్రాళ్ల చిత్రాలు కూడా బంపర్ హిట్ అవుతున్నాయని, అందుకు కారణం సదరు చిత్రాల్లో ఏదో ప్రత్యేకత ఉండడమేనని చెప్పారు. దర్శకుడు ఆంటోని డిసౌజా తెరకెక్కిస్తున్న ‘బాస్’ సినిమాతో అక్షయ్ త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తున్నానని, మళయాల చిత్రం ‘పోకిరి రాజా’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని చెప్పాడు. సినిమా చాలా బాగా వచ్చిందని,  ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతుందని, హాస్యంతోపాటు యాక్షన్ కూడా అదరగొడుతుందన్నాడు. వక్త్, ఏక్ రిష్తా, జాన్వర్ వంటి సినిమాల్లాగే ఈ సినిమా కథ కూడా నచ్చడంతోనే నటించేందుకు ఒప్పుకున్నానన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement