నేను దారి తప్పకుండా అన్నయ్య కాపాడారు

Pawan Kalyan Speech At Chiranjeevi Birthday Celabrations - Sakshi

– పవన్‌ కల్యాణ్‌

‘‘ఈ రోజు ప్రత్యేకించి మీలో (అభిమానులు) ఒకడిగా నేనూ ఇక్కడికి వచ్చాను. నాకు స్ఫూర్తి ప్రదాత అయిన మా అన్నయ్య చిరంజీవిగారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు. ఇది చాలా ప్రత్యేకమైన సంవత్సరం. ఓ అభిమానిగా అన్నయ్యను ఎలాంటి సినిమాలో చూడాలని ఉవ్విళ్లూరానో అలాంటి సినిమా ‘సైరా నరసింహారెడ్డి’’ అన్నారు పవన్‌ కల్యాణ్‌ . నేడు చిరంజీవి పుట్టినరోజుని పురస్కరించుకుని అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో బుధవారం జరిగిన చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ– ‘‘సైరా’ లో నటించినవారిలో నాకిష్టమైన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.

ఒకరు అన్నయ్యగారు, మరొకరు అబితాబ్‌ బచ్చన్‌గారు. వీళ్లిద్దరూ నాకు జీవితంలో చాలా బలమైన స్ఫూర్తి ప్రదాతలు. అమితాబ్‌గారిని కలిసే అరుదైన అవకాశం నాకు ‘సైరా’ షూటింగ్‌లో కలిగింది. అన్నయ్య నాకు స్ఫూర్తి ప్రదాత అని ఎందుకు అన్నానంటే.. ఆ మధ్య తెలంగాణలో ఇంటర్మీడియట్‌ విద్యార్థులు పదుల సంఖ్యలో చనిపోయినప్పుడు చాలా బాధ కలిగింది. జీవితంలో నేనూ అలాంటి సందర్భంలో ఉన్నప్పుడు అన్నయ్యగారు నన్ను మూడు సార్లు దారి తప్పకుండా కాపాడారు.

ఇంటర్మీడియట్‌ ఫెయిల్‌ అయినప్పుడు నాకూ  నిరాశ, నిస్పృహ కలిగింది. అన్నయ్య వద్ద ఉన్న లైసెన్స్‌డ్‌ గన్‌తో కాల్చుకుందామనుకున్నా. ఆ డిప్రెషన్‌లో నేను ఏం చేసుకుంటానో అని మా వదిన, నాగబాబు అన్నయ్య కలిసి పెద్దన్నయ్య వద్దకు తీసుకెళ్లారు. ‘ఇంటర్మీడియట్‌ పరీక్షలో ఫెయిలైనా మనిషిగా నువ్వు ఉండాలి. ఇలా చదువుకోకపోతే ఇంకోలా చదువుకో, అంతే కానీ డిప్రెషన్‌కి గురికావొద్దు’ అంటూ అన్నయ్య ఆరోజు చెప్పిన మాటలు నాకు కొండంత ఊపిరినిచ్చాయి.

మొన్న చనిపోయిన విద్యార్థుల ఇళ్లల్లో అన్నయ్యలాంటి పెద్దవారు ఉండుంటే ఆ బిడ్డలు  అలా అయ్యుండేవారు కాదేమో అనిపించింది. టీనేజ్‌లో ఉన్నప్పుడు భారతదేశాన్ని ఎవరైనా ఏదైనా అంటే కోపంతో ఊగిపోయేవాణ్ణి. నా కోపాన్ని చూసిన అన్నయ్య వీడు ఉద్యమకారుడు అయిపోతాడేమో అనుకుని, ‘కులం, మతం అనేవాటిని దాటి మానవత్వం అనేది ఒకటుంటుంది. దాన్ని నీ ఉద్యమంలో, ఆలోచనలో మరచిపోకు’ అన్నారు. హద్దులు దాటకుండా నన్ను ఆపేసిన మాట అది.

జీవితంలో అనుకున్నవి ఏవీ  సాధించలేకపోయానని 22 ఏళ్లప్పుడు తిరుపతిలో నిర్మాత తిరుపతి ప్రసాద్‌గారు యోగాశ్రమం పెడితే నేను వెళ్లిపోయి ఐదారు నెలలు మా అన్నయ్యకి కనిపించకుండా ధ్యానం, యోగాసనాలు చేసుకుంటూ ఉన్నా. ఆ తర్వాత మా అన్నయ్యతో ‘నాకేమీ అవసరం లేదు. నేను ఇలా వెళ్లిపోతాను’ అంటే, ఆయనన్న గొప్ప మాటలు నన్ను ఎంత మార్చేశాయంటే... ‘నువ్వు భగవంతుడివై వెళ్లిపోతే ఎలా? సమాజానికి ఎందుకు ఉపయోగపడలేవ్‌..  ఇంట్లో బాధ్యతలు అనేవి ఉంటే ఇలా మాట్లాడవు’ అన్నారు.

దెబ్బలు తిన్నానో, కింద పడ్డానో, పైన పడ్డానో ఆ మాటలు ఈ రోజు నన్ను ఇక్కడిదాకా తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టాయి. అందుకే నాకు ఆయన చాలా స్ఫూర్తి ప్రదాత. రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కిన ‘సైరా’కి నేను గొంతు ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. మా అన్నయ్యకి  ఇలాంటి ఓ సినిమా ఉండాలని కలలు కన్నాను కానీ, ఇలాంటి గొప్ప సినిమా తీసే శక్తి, సమర్థత నాకు లేకపోయాయి. కానీ, నా తమ్ముడులాంటి రామ్‌చరణ్‌.. ఎవరైనా కొడుకును తండ్రి లాంచ్‌ చేస్తాడు.

కానీ, తండ్రి తిరిగి సినిమాల్లోకి రావాలనుకుంటే ‘ఖైదీ నంబర్‌ 150’ సినిమాతో లాంచ్‌ చేశాడు. చరిత్ర మరచిపోయిన నరసింహారెడ్డి జీవిత కథని ఎంతోమంది ఎన్నోసార్లు దశాబ్దాలుగా, చిత్ర పరిశ్రమ మద్రాసులో ఉన్నప్పటి నుంచి ఈ మాట వింటున్నా.. ఎవరికీ ధైర్యం సరిపోలేదు.. ఒక్క రామ్‌చరణ్‌కి తప్ప. ఇలాంటి సినిమా తీస్తే ఆ పాత్ర చిరంజీవిగారే చేయాలి, ఇలాంటి సినిమాని రామ్‌చరణే తీయాలి. అందుకనే సినిమాకి ఎన్ని వందల కోట్లైనా, ఆ డబ్బులు వస్తాయో రావో కానీ, మంచి బలమైన సినిమా తీయాలనుకున్నారు.

‘సైరా’ తో  తన కలని సురేందర్‌రెడ్డిగారు నెరవేర్చుకున్నారు. మన దేశం, చరిత్ర గురించి ఎవరో రాసినదాని గురించి మనం మాట్లాడుతాం. సింహంలాటి వ్యక్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. చరిత్ర, భారతదేశ చరిత్ర ఆయన్ని మరచిపోయిందేమో కానీ, తెలుగునేల, మన కర్నూలు, రేనాడు, మన కొణిదెల మాత్రం మరచిపోలేదు. అలాంటి గొప్ప నేలలో పుట్టిన వీరుడి చరిత్రను సగర్వంగా తీశారు. మనందరికీ ఈ కథ చాలా స్ఫూర్తిదాయకం. కొణిదెల ప్రొడక్షన్‌ నుంచి ఇలాంటి సినిమా రావడం మాకు నిజంగా గర్వకారణం. కొణిదెల నామధేయాన్ని సార్థకత చేసుకున్నారు.

ఇలాంటి గొప్ప సినిమాలో చిన్న పాత్రలో అయినా నేను నటించలేకపోయాను. కానీ, గొంతుతో ‘సైరా నరసింహారెడ్డి’ అనగలిగానంటే నా గుండె లోతుల్లోంచి, ఓ అభిమాని నుంచి వచ్చిన పిలుపది. అన్నా నువ్వు బద్దలుగొట్టగలవు, అన్నా నువ్వు చరిత్ర తిరగరాయగలవు. అన్నా మేము మీకు బానిసలం, దాసోహం.. అందుకే నేను అరిచానన్నా. చరిత్ర మరచిపోయిన వీరుణ్ణి వెలికి తీసిన అన్నయ్య చిరంజీవిగారికి, కథా రచయితలకు, సురేందర్‌రెడ్డి, రామ్‌చరణ్‌గార్లకు, నా తల్లితర్వాత తల్లిలాంటి మా వదినగారికి(సురేఖ), నటీనటులందరికీ, ప్రత్యేకంగా అమితాబ్‌ బచ్చన్‌గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు’’ అన్నారు.

‘‘చిరంజీవిగారు చాలా కాలం జీవించాలి.. జై ‘సైరా నరసింహారెడ్డి’’ అన్నారు అల్లు అరవింద్‌. ‘‘హ్యాపీ బర్త్‌ డే పెద్దమావయ్య. ‘సైరా నరసింహారెడ్డి’ లాంటి సినిమాలు మీరు ఇంకా ఎన్నో చేస్తూ ఉండాలి’’ అన్నారు సాయిధరమ్‌ తేజ్‌. నిర్మాత వెంకటేశ్వరరావు, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, చిరంజీవి చిన్న అల్లుడు, హీరో కళ్యాణ్‌దేవ్, ఐపీఎస్‌ అధికారి టి. మురళీ కృష్ణ, నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top