సూపర్‌హిట్స్ స్టోరీ రైటర్ పంజు ఇక లేరు
ప్రముఖ సినీ రచయిత - నిర్మాత పంజు అరుణాచలం (75) మంగళవారం చెన్నైలోని నివా సంలో తుదిశ్వాస విడిచారు.
ప్రముఖ సినీ రచయిత - నిర్మాత పంజు అరుణాచలం (75) మంగళవారం చెన్నైలోని నివా సంలో తుదిశ్వాస విడిచారు. ప్రసిద్ధ తమిళ సినీ కవి దివంగత కణ్ణదాసన్‌కు మేనల్లుడీయన. మేనమామ దగ్గర 1958లో అసిస్టెంట్‌గా చేరారు. అనుభవం సంపాదించాక సొంతంగా కథలు రాశారు. 47 ఏళ్ల కెరీర్‌లో 45 చిత్రాలకు కథలందించారు. దాదాపు 100 సినిమాలకు స్క్రీన్‌ప్లే- సంభాషణలు, 300 పాటలు రాశారు. 45 సినిమాలు నిర్మించారు. 400 దాకా సినిమాలు పంపిణీ చేశారు. 4 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన రచన చేసిన చిత్రాల్లో 70 శాతం పైగా హిట్లుండడం విశేషం.
1976లో నిర్మించిన ‘అన్నక్కిళి’ ద్వారా ఇళయరాజాను సంగీత దర్శకుడిగా పరిచయం చేసింది ఈయనే. రజనీకాంత్ సూపర్ హిట్స్ ‘ఎంగేయో కేట్ట కురళ్’, ‘మురట్టు కాలై’, ‘ధర్మదురై’, ‘పోకిరి రాజా’ చిత్రాలకు కథలందించిందీ ఈయనే. ‘‘బాలచందర్ నన్ను సినీరంగానికి పరిచయం చేస్తే, నటుణ్ణి చేసింది పంజూ సారే’’ అని రజనీకాంత్ చెబుతుంటారు. అలాగే, కమల్‌హాసన్ హీరోగా ‘మైఖేల్ మదన కామరాజు’ నిర్మించ డంతో పాటు పలు హిట్స్‌కు కథలందించారు. పంజు, ‘వియత్నాం వీడు’ సుందరం, ఆర్.కె. ధర్మరాజ్, బాలమురుగన్ తదితర తమిళ రచయితల కథలతో పలు తెలుగు సినిమాలు తయారయ్యా యి.
సినిమా జయాపజయాలను జడ్జ్ చేయడంలో అరుణాచలం ప్రతిభే వేరని సినీవర్గాలంటాయి. ఆయన తమిళ కథలు అనేకం తెలుగులో రీమేక్ అయ్యాయి. ఇటీవల ‘కబాలి’ని ఆయన కోసం రజనీ ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఆరోగ్యం సహకరించనప్పటికీ రజనీపై అభిమానంతో చూశారా యన. ఆయనకి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. ‘వియత్నాం వీడు’ సుందరం కన్నుమూసిన సరిగ్గా నాలుగు రోజులకే పంజు అరుణాచలం మృతి కథాప్రపంచానికి తీరనిలోటే.


