ఎందుకు మారాలి? | Sakshi
Sakshi News home page

ఎందుకు మారాలి?

Published Sat, Oct 28 2017 12:01 AM

No age limit for heroines

ఆడపిల్లకు పాతికేళ్లొస్తే చాలు... పెళ్లి కాకపోతే టెన్షన్‌. అసలు వయసుకీ పెళ్లికీ లింకేంటి? ఆ మాటకొస్తే... వయసుకీ కెరీర్‌కీ లింకేంటి? ముఖ్యంగా హీరోయిన్లు థర్టీ ప్లస్‌ ఏజ్‌లో ఉంటే.. రిటైర్‌ అవ్వాల్సిందేనా? సపోర్టింగ్‌ ఆర్టిస్ట్‌గా మారాల్సిందేనా? ఏం...? 30 ఏళ్లు దాటితే హీరోయిన్లుగా పనికి రారా? అక్క–వదిన–అమ్మ పాత్రలకు మారాల్సిందేనా? అవసరం లేదంటున్నారు కొందరు కథానాయికలు. మెయిన్లీ థర్టీ ప్లస్‌ ఏజ్‌లో ఉన్న శ్రియ, త్రిష, అనుష్క, నయనతార... ఈ నలుగురూ హీరోయిన్లుగానే దూసుకెళుతున్నారు. ‘నో ఏజ్‌ లిమిట్‌ ఫర్‌ హీరోయిన్స్‌’ అని ప్రూవ్‌ చేస్తున్నారు.

ఫిల్మ్‌ వరల్డ్‌ ఎంతమందినైనా వెల్‌కమ్‌ చేస్తుంది. అందరికీ చోటుంటుంది. లక్‌ ఫేవర్‌ చేస్తే... చాన్సులు ఈజీగానే వచ్చేస్తాయి. టాలెంట్‌ ప్రూవ్‌ చేసుకుంటే బెర్త్‌ కన్‌ఫార్మ్‌.. కొత్తవాళ్లొస్తే సీనియర్లు తప్పుకోవాలా? ‘నో... నో’. ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరంలేదు. ఎవరి అవకాశాలు వాళ్లకుంటాయి. అందుకే పదీ పదిహేనేళ్లకు పైగా హీరోయిన్లుగా కొనసాగుతోన్న శ్రియ, త్రిష, అనుష్క, నయనతారలకు చాన్సులు తగ్గలేదు. జోరుగా.. హుషారుగా సినిమాలు చేస్తున్నారు. నలుగురిలో ఏదో సమ్మోహన శక్తి ఉంది. రోజు రోజుకీ ఈ నలుగురిలో అందం మరింత పెరుగుతోంది. వయసు అంతకంతకూ తగ్గుతోంది.

శ్రియ సంగతికొస్తే... కెరీర్‌ ప్రారంభంలోనే స్టార్‌ హీరోలతో నటించారు. ఆ తర్వాత స్పెషల్‌ సాంగులు, ‘పవిత్ర’ వంటి బోల్డ్‌ మూవీస్‌ చేశారు. ఇక, శ్రియ పనైపోయిందనుకుంటున్న టైమ్‌లో... ‘మనం’తో మళ్లీ స్టార్‌ హీరోయిన్ల రేసులోకి వచ్చారు. ఓ రకంగా ఇది శ్రియకు సెకండ్‌ ఇన్నింగ్స్‌ అనుకోవాలేమో! ఈ ఇన్నింగ్స్‌లో ‘గోపాల గోపాల, దృశ్యం, గౌతమిపుత్ర శాతకర్ణి’ వంటి నటనకు ఆస్కారమున్న సినిమాలతో పాటు పక్కా కమర్షియల్‌ ‘పైసా వసూల్‌’ వంటివీ చేశారు. ప్రస్తుతం తమిళంలో ‘నరగసూరన్‌’, తెలుగులో ‘వీరభోగ వసంతరాయలు’ సినిమాలతో బిజీగా ఉన్నారు.

నయనతార సంగతి చూస్తే... తెలుగులో పక్కా కమర్షియల్‌ సిన్మాలు చేస్తూ, మధ్యలో ‘శ్రీరామరాజ్యం’లో సీతగా అభినయించి, తనలో మంచి పెర్ఫార్మర్‌ ఉందని నిరూపించుకున్నారు. ఇక, తమిళంలో అయితే లేడీ ఓరియెంటెడ్‌ సిన్మాలకు ఓటేస్తున్నారు. అవెలాగో తెలుగులో డబ్బింగ్‌ అవుతాయనుకోండి! దీంతో గ్లామర్‌తో పాటు యాక్టింగ్‌ గ్రామర్‌ను కవర్‌ చేసేస్తున్నారు. ఆమె నటించిన ‘ఆరమ్‌’ విడుదలకు రెడీ అవుతోంది. చేతిలో ‘వేలైక్కారన్‌’, ‘ఇమైక్క నొడిగళ్‌’, ‘కొలయుదిర్‌ కాలమ్‌’, ‘కో కో’ వంటి సినిమాలున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తోన్న ‘జయసింహ’లో తనే హీరోయిన్‌. అలాగే, చిరంజీవి ‘సైరా’ కూడా కమిట్‌ అయ్యారు.

త్రిష, నయన, శ్రియలతో పోల్చితే అనుష్క అంత బిజీగా లేరు. ప్రస్తుతం ఆమె చేతిలో ‘భాగమతి’ మాత్రమే ఉంది. ఈ బొమ్మాళికి బోలెడన్ని అవకాశాలు వస్తున్నా.. ఎందుకనో ఒప్పుకోవడంలేదట. అరుందతి, బాహుబలి. రుద్రమదేవి, తాజా ‘భాగమతి’ వంటి సినిమాలు చేశాక... ఇకపై కూడా మంచి సినిమాల్లోనే కనిపించాలని అనుకుంటున్నారట. అందుకే ఆచి తూచి అడుగులేస్తున్నారు.

త్రిష అయితే కెరీర్‌ ప్రారంభం నుంచి ఎక్కువగా కమర్షియల్‌ సినిమాలే చేశారు. కానీ, కథానాయికగా 50 సిన్మాలు పూర్తయ్యాక కాస్త రూటు మార్చారు. లేడీ ఓరియెంటెడ్‌ సిన్మాలపై దృష్టి పెట్టారు. ‘సదురంగ వేటై్ట–2’, ‘1818’, ‘96’ సినిమాలు చేస్తున్నారు. ‘హే జ్యూడ్‌’ అనే చిత్రం ద్వారా మలయాళ పరిశ్రమకు కూడా పరిచయం కానున్నారు. 15 ఏళ్ల కెరీర్‌ తర్వాత ఇప్పుడు వేరే భాషలో చాన్స్‌ దక్కించుకోవడం అంటే చిన్న విషయం కాదు... తమిళ పొన్ను తడాఖా అది.

సినిమా సెలక్షన్‌ను పక్కన పెడితే... ముగ్గురిలో ముఖ్యంగా చెప్పుకోవలసింది అందం గురించి! వీళ్లు చిత్రసీమలోకి వచ్చి పదేళ్లు దాటిందనీ, వీళ్లకు 30 ఏళ్లు వచ్చేశాయనీ గుర్తు చేస్తే తప్ప గుర్తు రానంతగా వయసును దాచేస్తున్నారు. 15 ఇయర్స్‌... ఈజ్‌ రియల్లీ సమ్‌థింగ్‌! మనం చూస్తూనే ఉండాలి గానీ... ఇంకో పదిహేనేళ్లు నటిస్తూనే ఉంటారు. చూస్తుందాం బాస్‌... హాలీవుడ్‌లో థర్టీ, ఫార్టీ, ఫిఫ్టీ ప్లస్‌ ఏజ్‌ లోనూ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఇండియన్‌ హీరోయిన్ల కెరీర్‌కి కూడా అంత లాంగ్విటీ ఉంటే ఏం పోతుంది? వయసు తెచ్చే పరిణతి, కెరీర్‌ తెచ్చిన అనుభవంతో మంచి మంచి సినిమాలు సెలక్ట్‌ చేసుకుంటారు. ఏమంటారు?

Advertisement

తప్పక చదవండి

Advertisement