
అనుష్క శెట్టి పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్న చిత్రం 'ఘాటి'.. క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ఆమె గంజాయి స్మగ్లర్‌గా కనిపించనున్నారు. భారీ అంచనాలతో సెప్టెంబర్ 5న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర నిర్మాత రాజీవ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఘాటి మూవీ ప్రమోషన్స్‌కు అనుష్క దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా సినిమాను నిర్మించాయి.
సినిమా ప్రారంభంలోనే ప్రమోషన్స్ సమయంలో అందుబాటులో ఉండకపోవచ్చని అనుష్క చెప్పినట్లు నిర్మాత రాజీవ్‌రెడ్డి తెలిపారు. ముందే రాసుకున్న టర్మ్స్ ప్రకారం మాత్రమే అనుష్క రావడం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. అది ఆమె వ్యక్తిగత నిర్ణయమని, తాము కూడా దాన్ని గౌరవించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రీ రిలీజ్ వేడుకకు కూడా ఆమె హాజరుకాకపోవచ్చని తెలిపారు. అనుష్క లాంటి నటి మాత్రమే ఘాటిలో నటించగలరని ఆయన అన్నారు. షీలా పాత్రలో అనుష్కను తప్ప మరెవరినీ ఊహించలేమని చెప్పారు. ప్రేక్షకులను థియేటర్లకు తీసుకువచ్చే సామర్థ్యం అనుష్కకు మాత్రమే ఉందని తాము నమ్ముతున్నామన్నారు. ఈ సినిమా షూటింగ్ మొత్తం ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో చిత్రీకరించామని రాజీవ్‌రెడ్డి తెలిపారు.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సమయంలో కూడా ప్రమోషన్స్‌కు అనుష్క దూరంగానే ఉన్నారు. అయితే, ఆ సమయంలో నవీన్ పోలిశెట్టి ఒంటి చేత్తో ప్రమోషన్స్ విషయంలో లాగించాడు. అయితే ఘాటిలో విక్రమ్ ప్రభు హీరోగా నటించారు. ఆయన తమిళ నటుడు కాబట్టి తెలుగులో పెద్దగా రీచ్ కావడం కష్టం. దీంతో దర్శకుడు క్రిష్ రంగంలోకి దిగారు కొన్ని ఇంటర్వ్యూలతో సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. ఆపై ఆనుష్క ఇమేజ్ ఎటూ ఉంది కాబట్టి ఓపెనింగ్స్ బాగానే ఉండనున్నాయి.