
సౌత్ ఇండియాలో ప్రస్తుతం క్రేజీ సంగీత దర్శకుడిగా వెలుగొందుతున్న అనిరుధ్ తన సంగీత పయనాన్ని ప్రారంభించింది నటుడు ధనుష్ కథానాయకుడిగా నటించిన 3 చిత్రంతోననే విషయం తెలిసిందే. ఈ చిత్రం పెద్దగా సక్సెస్ కాకపోయినా, అందులోని వై దిస్ కొలవెరి పాట ప్రపంచ వ్యాప్తంగా మార్మోగింది. తరువాత 'రఘువరన్ బి.టెక్ , మారి, నవమన్మధుడు' చిత్రాల వరకూ ధనుష్ కోసం అనిరుధ్ సంగీతాన్ని అందించారు. వీరిద్దరి మధ్య బంధుత్వం కూడా ఉండటంతో అలా వారి జర్నీ కొనసాగింది. కానీ, వీరిద్దరి మధ్య బేధాబిప్రాయాలు వచ్చాయనే ప్రచారం కోలీవుడ్‌లో జరిగింది. కుటుంబ విషయంలో ఇద్దరి మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని కొందరు చెబితే... ఐశ్వర్యతో ధనుష్ విడాకులు తీసుకోవడం వల్ల అనిరుధ్ కాస్త దూరం జరిగాడని అంటారు.

అయితే ఇందులో నిజం ఎంత అన్నది పక్కన పెడితే.. సుమారు పదేళ్లుగా వీరిద్దరి కాంబోలో ఒక్క సినిమా కూడా రాలేదు. దీంతో ఈ హిట్ కాంబినేషన్‌లో చిత్రం కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అలాంటి సందర్భం ఇప్పుడు వస్తోందన్నది తాజా సమాచారం. ధనుష్ ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అదే విధంగా అనిరుధ్ నటుడు రజనీకాంత్ చిత్రాలకు వరుసగా పని చేస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా ధనుష్ హీరోగా లబ్బరు బంత్తు చిత్రం ఫేమ్ పచ్చుముత్తు తమిళరసన్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజం అయితే ధనుష్ అభిమానులకు ఖుషీనే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.